మిఖాయిల్ గోర్బచేవ్
From Wikipedia, the free encyclopedia
మిఖాయిల్ సెర్గేయివిచ్ గోర్బచేవ్ (1931 మార్చి 2 - 2022 ఆగస్టు 30) రష్యన్ రాజకీయ నాయకుడు, మాజీ సోవియట్ యూనియన్ రాజకీయ నాయకుడు. సోవియట్ యూనియన్‌కు ఎనిమిదవ, చివరి నేత. 1985 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. 1988 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ దేశాధినేతగా, 1988 నుండి 1989 వరకు సుప్రీం సోవియట్ ప్రెసీడియం ఛైర్మన్‌గా, 1989 నుండి 1990 వరకు సుప్రీం సోవియట్ ఛైర్మన్‌గా, 1990 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. సైద్ధాంతికంగా, అతడు మొదట్లో మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడి ఉన్నాడు, అయితే 1990 ల ప్రారంభంలో సామ్యవాద ప్రజాస్వామ్యం వైపు వెళ్ళాడు.
మిఖాయిల్ గోర్బచేవ్ | |
---|---|
Михаил Горбачёв | |
సోవియట్ యూనియన్ అధ్యక్షుడు | |
In office 1990 మార్చి 15 – 1991 డిసెంబరు 25 | |
Vice President | గెన్నడి యనయేవ్ |
తరువాత వారు |
|
ప్రధాన కార్యదర్శి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ | |
In office 1990 మార్చి 11 – 1991 ఆగస్టు 24 | |
ప్రధాన మంత్రి |
|
Deputy | వ్లాడిమిర్ ఇవాష్కో |
అంతకు ముందు వారు | కాన్స్టాంటిన్ చెర్నెంకో |
తరువాత వారు | వ్లాడిమిర్ ఇవాష్కో (acting) |
ఛైర్మన్, సుప్రీమ్ సోవియట్ ఆఫ్ సోవియట్ యూనియన్ | |
In office 1989 మే 25 – 1990 మార్చి 15 | |
Deputy | అనాటొలీ లుక్యానొవ్ |
తరువాత వారు | అనాటొలీ లుక్యానొవ్ |
ప్రిసీడియమ్ | |
In office 1988 అక్టోబరు 1 – 1989 మే 25 | |
అంతకు ముందు వారు | ఆండ్రీ గ్రోమికో |
కో-ఛైర్మన్, యూనియన్ ఆఫ్ సోషల్ డెమోక్రాట్స్ | |
Incumbent | |
Assumed office 2000 మార్చి 11 | |
సెకండ్ సెక్రెటరీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ | |
In office 1984 ఫిబ్రవరి 9 – 1985 మార్చి 10 | |
అంతకు ముందు వారు | కాన్స్టాంటిన్ చెర్నెంకో |
తరువాత వారు | యెగొర్ లిగచెవ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మిఖాయిల్ సెర్గేయివిచ్ గోర్బచేవ్ (1931-03-02) 1931 మార్చి 2 (వయసు 93) ప్రవాల్నోయ్, రష్యన్ SFSR, సోవియట్ యూనియన్ |
మరణం | 30 ఆగస్టు 2022 మాస్కో, రష్యా |
జాతీయత |
|
రాజకీయ పార్టీ | యూనియన్ ఆఫ్ సోషల్ డెమోక్రాట్స్ (2007–ప్రస్తుతం) |
ఇతర రాజకీయ పదవులు |
|
జీవిత భాగస్వామి | రైసా గోర్బచేవ్
(m. 1953; died 1999) |
సంతానం | 1 |
కళాశాల | మాస్కో స్టేట్ యూనివర్సిటీ |
పురస్కారాలు | నోబెల్ శాంతి బహుమతి |
సంతకం | |
ఈ శ్రావ్యకాన్ని వినే ప్రయత్నంలో మీకు ఇబ్బంది ఎదురైందా? మీడియా సహాయాన్ని చూడండి.
| |
కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర సభ్యత్వం
ఇతర పదవులు
|
రష్యన్, ఉక్రేనియన్ మిశ్రమ వారసత్వానికి చెందిన గోర్బచేవ్, స్టావ్రోపోల్ క్రాయ్ లోని ప్రివోల్నోయేలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. జోసెఫ్ స్టాలిన్ పాలనలో పెరిగిన అతడు, యవ్వనంలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరడానికి ముందు కొన్నాళ్ళు సమష్టి పొలంలో హార్వెస్టర్లను నడిపాడు. అప్పట్లో మార్క్సిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంతం ప్రకారం సోవియట్ యూనియన్ను ఏకపక్షంగా పరిపాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. మాస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి 1955 లో న్యాయ పట్టా పొందాడు. అంతకు ముందు, 1953 లో, మాస్కో స్టేట్ యూనివర్శిటీలో ఉన్నప్పుడే తోటి విద్యార్థిని రైసా టైటారెంకోను వివాహం చేసుకున్నాడు. స్టావ్రోపోల్కు వెళ్లిన అతడు కొమ్సోమోల్ యువజన సంస్థలో పనిచేశాడు. స్టాలిన్ మరణం తరువాత, నికిటా కృశ్చేవ్ మొదలుపెట్టిన డీస్టాలినైజేషన్ సంస్కరణలను సమర్ధించాడు. 1970 లో స్టావ్రోపోల్ ప్రాంతీయ కమిటీకి మొదటి పార్టీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు, ఈ పదవిలో అతడు గ్రేట్ స్టావ్రోపోల్ కాలువ నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా 1978 లో మాస్కో వెళ్ళాడు. 1979 లో దాని పాలక పొలిట్‌బ్యూరోలో చేరాడు. సోవియట్ నాయకుడు, లియోనిద్ బ్రెజ్నెవ్ మరణానంతరం మూడేళ్ల పాటు యూరీ ఆండ్రోపోవ్, కాన్స్టాంటిన్ చెర్నెంకో ల ప్రభుత్వాలు గడిచాక, 1985 లో, గోర్బచేవ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, వాస్తవ ప్రభుత్వాధినేతగా ఎన్నికయ్యాడు.
సోవియట్ రాజ్యాన్ని, దాని సోషలిస్ట్ ఆదర్శాలనూ పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నప్పటికీ, గోర్బచేవ్ గణనీయమైన సంస్కరణలు అవసరమని నమ్మాడు -ముఖ్యంగా 1986 చెర్నోబిల్ విపత్తు తరువాత. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం నుండి వైదొలిగాడు. అణ్వాయుధాలను పరిమితం చేయడానికీ, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌తో శిఖరాగ్ర సమావేశాలను ప్రారంభించాడు. దేశీయంగా, వాక్ స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛనూ మెరుగుపర్చడానికి గ్లాస్నోస్ట్ విధానాన్ని ("బహిరంగత") ఉద్దేశించాడు. సమర్ధతను మెరుగుపరచడానికి, ఆర్థిక నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించడానికీ పెరెస్త్రోయికా ("పునర్నిర్మాణం")ను ఉద్దేశించాడు. అతడి ప్రజాస్వామిక చర్యలు, పీపుల్స్ డిప్యూటీస్ కాంగ్రెస్ (ఇందులోని సభ్యులను ప్రజలే ఎన్నుకుంటారు) ఏర్పాటూ ఏకపక్ష దేశాన్ని బలహీన పరచాయి. 1989-90లో వివిధ తూర్పు బ్లాక్ దేశాలు మార్క్సిస్ట్-లెనినిస్ట్ పాలన నుండి వైదొలగినప్పుడు గోర్బచేవ్ సైనికపరంగా జోక్యం చేసుకోవడానికి నిరాకరించాడు. దేశంలో అంతర్గతంగా పెరుగుతున్న జాతీయవాద భావాలు సోవియట్ యూనియన్ను విచ్ఛిన్నం చేసే స్థాయిలో బెదిరించాయి. దీంతో, మార్క్సిస్ట్-లెనినిస్ట్ అతివాదులు 1991 లో గోర్బచేవ్‌పై ఆగస్టు తిరుగుబాటు చేసారు. అయితే అది విఫలమైంది. దీని నేపథ్యంలో, గోర్బచేవ్ కోరికకు వ్యతిరేకంగా, యెల్ట్సిన్ తదితఉలు సోవియట్ యూనియన్ను రద్దు చేసారు. అతడు రాజీనామా చేశాడు. పదవీవిరమణ తరువాత, అతడు గోర్బచేవ్ ఫౌండేషన్‌ను ప్రారంభించాడు, రష్యన్ అధ్యక్షులు బోరిస్ యెల్ట్సిన్, వ్లాదిమిర్ పుతిన్‌లపై విమర్శలు చేసాడు. రష్యాలో సామాజిక-ప్రజాస్వామ్య ఉద్యమం కోసం ప్రచారం చేశాడు.
20 వ శతాబ్దపు రెండవ భాగానికి చెందిన అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకడుగా గోర్బచేవ్‌ను పరిగణిస్తారు. గోర్బచేవ్ వివాదాలకు కేంద్రమయ్యాడు. నోబెల్ శాంతి బహుమతితో సహా అనేక పురస్కారాలు పొందాడు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడంలో, సోవియట్ యూనియన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను తగ్గించడంలో, తూర్పున మార్క్సిస్ట్-లెనినిస్ట్ పరిపాలనల పతనం, జర్మనీ పునరేకీకరణ - రెండింటినీ తట్టుకోవడంలో అతడు కీలక పాత్ర పోషించినందుకు ప్రశంసలు పొందాడు. దీనికి విరుద్ధంగా, సోవియట్ పతనాన్ని ఆపలేక పోయినందుకు రష్యాలో నిందారోపణలకు గురౌతూ ఉంటాడు. ఈ సంఘటన ప్రపంచంలో రష్యా యొక్క ప్రభావం క్షీణించడానికీ, ఆర్థిక సంక్షోభానికీ దారితీసింది.