![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f4/Kangana_Ranaut_at_Ira_Khan%2527s_wedding_reception_%2528cropped%2529.jpg/640px-Kangana_Ranaut_at_Ira_Khan%2527s_wedding_reception_%2528cropped%2529.jpg&w=640&q=50)
కంగనా రనౌత్
భారతీయ చలనచిత్ర కథానాయిక / From Wikipedia, the free encyclopedia
కంగనా రనౌత్ (జననం 1987 మార్చి 23) ప్రముఖ భారతీయ నటి. బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్ గా ఉండే నటిగానూ మీడియాలో ఎక్కువ ప్రసిద్ధమయ్యారు కంగనా. ఆమె ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు.
కంగనా రనౌత్ | |
---|---|
![]() | |
జననం | (1987-03-23) 1987 మార్చి 23 (వయసు 37) భంబ్లా గ్రామం, మండి జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం |
వృత్తి | నటి, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2006 – ప్రస్తుతం |
సన్మానాలు | పద్మ శ్రీ (2020) |
హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు కంగనా. ఆమె తల్లిదండ్రుల గట్టి పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని అనుకునేవారు ఆమె చిన్నప్పుడు. కానీ తన 16వ ఏట తన కెరీర్ తానే నిర్మించుకోవాలనే సంకల్పంతో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ తరువాత కొన్నాళ్ళకు మోడల్ అయ్యారు కంగనా. నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణలో నటన నేర్చుకున్న ఆమె 2006లో గాంగ్ స్టర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారామె. వోహ్ లమ్హే (2006), లైఫ్ ఇన్ ఎ.. మెట్రో (2007), ఫ్యాషన్ (2008) సినిమాల్లోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కంగనా. ఈ మూడు సినిమాలకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు ఆమె.
రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్ (2009), వన్స్ అపాన్ ఎ టైమిన్ ముంబై (2010) వంటి హిట్ సినిమాల్లో నటించారు కంగనా. మానసిక ఇబ్బందులతో ఉండే పాత్రల్లో ఎక్కువగా నటించడంతో కొన్ని విమర్శలు ఎదురైనా, ఆమె నటనకు మాత్రం ప్రశంసలే లభించాయి. 2011లో మాధవన్ తో కలసి నటించిన తను వెడ్స్ మను సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె గ్లామర్ పాత్రల్లో నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హృతిక్ సరసన ఆమె నటించిన క్రిష్ 3 (2013) సినిమా బాలీవుడ్ లో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటించిన క్వీన్ (2014) సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడమే కాక జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు కంగనా. 2015లో తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు ఆమె. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ విమర్శకుల పురస్కారం, వరుసగా రెండో జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు లభించాయి.