టాంక్ బండ్ (Tank Bund) గా ప్రసిద్ధమైన ఈ రహదారి 1568లోహుస్సేన్ సాగర్ గట్టుగా నిర్మించబడింది. ఇది చెరువు గట్టుగా ఊంది కాబట్టి, టాంక్ బండ్ (చెరువు గట్టు) గా ప్రసిద్ధి చెందింది. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది హుస్సేన్ సాగర్ మీద ఉన్న టాంకు బండ్. ఈ గట్టుమీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి, జంటనగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం వాహ్యాళికి వెళ్ళేవారికి (ముఖ్యంగా ఆదివారం, ఇతర శెలవు రోజుల సాయంత్ర సమయాలలో), స్నేహితులను కలుసుకొనేవారికి, ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం.