వ్యాసం (గణిత శాస్త్రము)
From Wikipedia, the free encyclopedia
ఒక వృత్తంలో కేంద్రం గుండా పోవు జ్యాను వ్యాసము అంటారు. వృత్తము అనగా ఒక సమతలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సమితి. వృత్తం పై గల బిందువుల నుండి సమాన దూరంలో గల స్థిర బిందువును కేంద్రము అంటారు. వృత్తం పై ఏవేని రెండు బిందువులను కలిపిన రేఖాఖండమును వృత్త జ్యా (Chord) అంటారు. వృత్తమునకు అనేక జ్యాలు గీయవచ్చు. అన్ని జ్యా లలో కేంద్రం గుండా పోవు జ్యా అతి పెద్ద జ్యా అవుతుంది. దీనిని వ్యాసము అంటారు. వృత్తమున అనంతమైన వ్యాసములు గీయవచ్చు. అన్ని వ్యాసముల కొలతలు సమానంగా ఉంటాయి. వ్యాసమును ఆంగ్లంలో "డయామీటర్" (Diameter) అంటారు. దీన్ని "d"తో సూచిస్తారు.
- వృత్త వ్యాసము పొడవులో సగమును వ్యాసార్థము అందురు.
- వృత్త వ్యాసము వృత్తమును రెండు సర్వ సమాన అర్థ వృత్తములుగా విభజిస్తుంది.
- వృత్త వ్యాసము గుండా పోవు రేఖ వృత్తానికి సౌష్టవాక్షం అవుతుంది. వృత్తానికి అనంతమైన సౌష్టవ రేఖలు గీయవచ్చు.
- వృత్త వ్యాసం పరిధి వద్ద చేయు కోణం 90 డిగ్రీలు లేదా సమకోణం. అనగా వృత్తం పై ఏదేని బిందువుతో వ్యాసం యేర్పరచు త్రిభుజం సమకోణ త్రిభుజం అవుతుంది.
మరింత సమాచారం వృత్త వ్యాసము ...
వృత్త వ్యాసము | |
---|---|
తలం | ద్విపరిమాణీయం |
నిర్వచనం | అతి పెద్ద జ్యా |
వ్యాసముల సంఖ్య | అనంతం |
ఆంగ్ల పదం | diameter |
పరిధితో సంబంధం | వృత్త పరిధి = π (వ్యాసము) |
మూసివేయి