సమాచార ఉపగ్రహం
సమాచార ప్రసారాల కోసం అంతరిక్షంలోకి పంపించిన ఉపగ్రహం. / From Wikipedia, the free encyclopedia
సమాచార ఉపగ్రహం అంటే రేడియో టెలికమ్యూనికేషన్లను రిలే చేసే కృత్రిమ ఉపగ్రహం. దీనిలో ఉండే ట్రాన్స్పాండరు ద్వారా భూమ్మీద వేరువేరు స్థలాల్లో ఉండే ట్రాన్స్మిట్టరు, రిసీవరుల మధ్య ఒక సమాచార కాలువను సృష్టిస్తుంది. టెలివిజను, టెలిఫోను, రేడియో, అంతర్జాలం, సైనిక అవసరాల కోసం సమాచార ఉపగ్రహాలను వాడుతున్నారు. ప్రస్తుతం వివిధ కక్ష్యల్లో ఉన్న 2,000 పైచిలుకు సమాచార ఉపగ్రహాలను వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు వాడుతున్నాయి.[1]
వైర్లెస్ సమాచార వ్యవస్థ, సిగ్నళ్ళ ప్రసారం కోసం విద్యుదయస్కాంత తరంగాలను వాడుతుంది. ఈ తరంగాలు ప్రయాణం చేసేందుకు గాను మూలము, గమ్యమూ రెండూ కూడా ఒకదానికొకటి కనబడే రేఖలో (దృగ్రేఖ - లైన్ ఆఫ్ సైట్) ఉండాలి. అంచేత గోళాకారపు భూమి యొక్క వక్రత వీటిని అడ్డగిస్తుంది. సమాచార ఉపగ్రహం, మూలం నుండి (ఈ రెండూ దృగ్రేఖలో ఉంటాయి కాబట్టి) ఈ సిగ్నళ్ళను స్వీకరించి, తిరిగి గమ్యానికి పంపిస్తుంది (ఈ రెండూ కూడా దృగ్రేఖలోనే ఉంటాయి కాబట్టి). తద్వారా సమాచార సిగ్నళ్ళు భూమి వక్రతను అధిగమిస్తాయి.[2]
సమాచార ఉపగ్రహాలు విస్తృతమైన రేడియో, మైక్రోవేవ్ పౌనఃపున్యాలను (ఫ్రీక్వెన్సీ) వాడుతాయి. వివిధ సిగ్నళ్ళు ఒకదానికొకటి అడ్డగించుకోకుండా ఉండేందుకు ఏయే సంస్థలు ఏయే పౌనఃపున్యాల బ్యాండ్లను వాడవచ్చుననే విషయమై నిబంధనలను ఏర్పరచారు. ఈ బ్యాండ్ల కేటాయింపు కారణంగా సిగ్నళ్ళ అడ్డగింపు బాగా తగ్గిపోయింది.[3]