అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి
తెలుగు రచయిత, కవి From Wikipedia, the free encyclopedia
Remove ads
అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (జ: 1888-మ: 1959) తెలుగు కవి, బహుగ్రంథకర్త. భార్గవ రామ చరిత్రం అనే మహాకావ్యంతో పాటుగా శ్రీ భర్తృహరి నిర్వేదము, కావ్యగుచ్ఛము, విద్వద్దంపతీ విలాసము మొదలైన కావ్యాలెన్నో రాశారు. మహాకావ్యమైన భార్గవ రామ చరిత్రం గ్రంథాన్ని మహాభారతం ఉద్యోగ పర్వంలో 5 శ్లోకాల్లో క్లుప్తంగా - ప్రజాకంటకులైన హైహయులు, వారిని అనుసరించిన క్షత్రియులను నిర్జించేందుకు బ్రాహ్మణులు, ఇతర వర్ణాల వారు ప్రత్నించి భంగపడడం. నాయకత్వేలేమిని నివారించేందుకు ఓ నీతిశాస్త్ర, శస్త్రాస్త్ర విశారదుడైన బ్రాహ్మణ వీరుని నేతృత్వంలో సర్వక్షత్రియులను జయించడం కనిపిస్తుంది. ఆ విషయాన్నే విస్తరించి మహాకావ్యాన్ని సుబ్రహ్మణ్యశాస్త్రి నిర్మించారు.
Remove ads
వ్యక్తిగత జీవితం
అనుముల వేంకట సుబ్రహ్మణ్యకవి 1888లో సర్వధారి కార్తీక పౌర్ణమి నాడు (నవంబరు 18వ తేదీన) నెల్లూరు జిల్లా పెదగోగులపల్లి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు అచ్చమాంబ, వేంకటనారాయణ. వీరి చిన్ననాడు అచ్చమాంబ ఇంటిపనిలో నుండగా ఒక నాగుపాము ఊయలలో నిద్రిస్తున్న సుబ్రహ్మణ్యశాస్త్రి శిరస్సుపై పడగవిప్పి ఆడి దిగిపోయినదట. మరళ ఇటువంటి సంఘటనే తన 45వ ఏట కూడా జరుగగా శాస్త్రిగారు "నాగకుమార నవరత్నములు" రచించిరి. వీరి తల్లిదండ్రులు అతని బాల్యములోనే మరణించుట వలన పెంపకము అతని మేనత్తలు, పెద్దతండ్రి సుబ్బరామయ్య స్వీకరించిరి. విద్యాభ్యాసం ముగించుకుని 1909 నుంచి 1923 వరకూ వనపర్తి తాలూకాలోని వ్యాపర్ల గ్రామానికి చెందిన వామననాయక్ జాగీరులో అధ్యాపకునిగా పనిచేశారు. 1923 నుంచి 1948 వరకూ కర్నూలు పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు. వీరు తన 25వ ఏట వేంకట సుబ్బమ్మను వివాహమాడారు. వీరికి సంతానయోగము లేకపోవుట వలన తమ జ్ఞాతి అయిన శివసూరి కుమారుడు వెంకట నారాయణను దత్తత తీసుకున్నారు. 1950ల్లో జనగాం ప్రెస్లన్ విద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు. అధ్యాపక వృత్తిలో ఉండగానే ఏప్రిల్ 5, 1959న మరణించారు.
Remove ads
రచన రంగం
అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి బహుగ్రంథ కర్త. ఆయన రచనల్లో ముద్రితములూ, అముద్రితాలూ కూడా ఉన్నాయి.
ముద్రిత గ్రంథాలు
ఆయన ముద్రిత కావ్యాల్లో భార్గవ రామ చరిత్ర అనే మహాకావ్యం కూడా ఉంది. హైహయులు, వారి అనుయాయులైన క్షత్రియులు ప్రజలను పీడించడంతో బ్రాహ్మణులు మొదలైన ఇతర మూడు వర్ణాల వారు ఒక్కటై వారితో పలుమార్లు పోరాడి ఓడిపోయారనీ, తమ ఓటమికి నాయకత్వలేమి కారణమని గ్రహించి నీతిశాస్త్ర విశారదుడు, శూరుడు అయిన బ్రాహ్మణ వీరుడిని (పరశురాముడు) సైన్యాధిపత్యానికి ఒప్పించి, సర్వ క్షత్రియులను జయించినట్టు మహాభారత ఉద్యోగపర్వంలోని సైన్య నిర్యాణ పర్వంలో 5 శ్లోకాల్లో సంగ్రహంగా ఉంది. దీన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఇతర పురాణాల్లో ఉన్న పరశురామ గాథలను సమన్వయం చేసుకుంటూ ఈ మహాకావ్యాన్ని నిర్మించారు సుబ్రహ్మణ్యశాస్త్రి.
హరిహరోపాధ్యాయుడు సంస్కృతంలో రాసిన వేదాంత ప్రధానమైన గ్రంథాన్ని శ్రీ భర్తృహరి నిర్వేదము పేరిట ప్రబంధాన్ని రచించారు. మూలంలోని భావాన్ని వదలక, తనదైన ప్రత్యేక కావ్యంగా దీన్ని ఆయన తీర్చిదిద్దారు. ఈ కావ్యంలో భర్తృహరి తన భార్య భానుమతీదేవి మౌనముద్రకు కారణం తెలియక ఆమెను అనునయించే ఘట్టాన్ని పారిజాతాపహరణంలోని సత్యభామ అలక ఘట్టానికి సాటివచ్చేలా రచించే ప్రయత్నం చేశారు. సుభాషిత త్రిశతి రచించిన భర్తృహరి జీవితంలో అందుకు పాదులు వేసిన ఘట్టాలను, ఆయన వేదాంతి కావడం వంటివి ఈ కావ్యవస్తువు.
కావ్యగుచ్ఛము అనే మరో గ్రంథంలో తారాచంద్రుల ఇతివృత్తం, అష్టావక్రుని బ్రహ్మచార దీక్షకు పరీక్షాఘట్టం వంటి పలు ఇతివృత్తాలతో నిర్మించిన చిరు కావ్యాలు గుదిగుచ్చారు. విద్వద్దంపతీ విలాసము అనే మరో కావ్యంలో విదుషీమణి ఐన కాపుకులస్త్రీ, బ్రాహ్మణుడు ప్రేమించి ఫలించక మరణిస్తారు, తర్వాత ఈజిప్ట్ దేశంలో మళ్ళీ పుట్టి ప్రేమ ఫలింపజేసుకుంటారు. ఈజిప్టులో వారిద్దరి కలయికకు ఇతివృత్తాన్ని ప్రఖ్యాత అరేబియన్ నైట్స్ లోని ఒక కథను తీసుకుని దాని అనుసృజనగా చేశారు. కాకతీయుల నాటి ఇతివృత్తంతో కుమార రుద్రదేవకవి, బమ్మెర పోతన, పౌరాణికాంశాలతో భారతీయ స్త్రీ ధర్మాలు, శ్రీకృష్ణ చరిత్ర రాశారు. ఇవన్నీ వివిధ సంస్థలు ముద్రించినవి.
సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన మహాకావ్యమైన భార్గవ రామచరిత్ర సహా ఏ రచనలూ జీవించివుండగా ప్రచురణకు నోచుకోలేదు. జీవించినంతకాలం ఇవి ముద్రితాలు కావాలని, పదుగురూ తన రచనలు చదవాలనీ కోరుకున్నారు. ఆయన మరణించాకా పలు సంస్థలు, వ్యక్తుల చొరవతో ఒక్కొక్కటిగా ఈ రచనలు ప్రచురితమయ్యాయి.[1]
అముద్రిత గ్రంథాలు
అముద్రితమైన ఆయన రచనల్లో ఈ కిందివి ఉన్నాయి[1]
- పరశురామ చరిత్రము
- పరశురామ చరిత్రము (విమర్శ)
- రామ నివాసము
- పాల్కురికి సోమనాథకవి
- ప్రియదర్శిక
- మంగళ గౌరి
- శమంతకమణి
- శంకర జీవితము
- ఉషాపరిణయము
- కర్నూలు మండల చరిత్ర
Remove ads
ప్రాచుర్యం
మహాకవి తిక్కనలాగానే సుబ్రహ్మణ్యశాస్త్రికి కలలోనే భార్గవ రామ చరిత్ర మహాకావ్యాన్ని రాయమన్న ప్రోత్సాహం లభించడం, ఆయనలాగానే హరిహరనాథునికి అంకితమివ్వడం వంటివే కాకుండా కావ్యరచనా శైలిలోని ఇతర కారణాలనూ పురస్కరించుకుని భార్గవ రామ చరిత్ర రచనలో తిక్కన సోమయాజి ముమ్మూర్తులా మూర్తీభవించాడంటూ ప్రముఖ కవి గడియారం వేంకట శేషశాస్త్రి ప్రశంసించారు.[1]
మూలాలు
ఇంకా చదవండి
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads