అష్టదిగ్గజములు

రాజు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఎనిమిది మంది తెలుగు కవులకు సామూహిక బిరుదు From Wikipedia, the free encyclopedia

అష్టదిగ్గజములు
Remove ads

అష్ట దిగ్గజాలు అంటే "ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు" అని అర్థం. హిందూ పురాణాలలో ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయని ప్రతి. ఇవే అష్టదిగ్గజాలు. అదే విధంగా శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు.

Thumb
అష్టదిగ్గజములు

పురాణాలలో అష్టదిగ్గజాలు

  1. ఐరావతం
  2. పుండరీకం
  3. వామనం
  4. కుముదం
  5. అంజనం
  6. పుష్పదంతం
  7. సార్వభౌమం
  8. సుప్రతీకం

కృష్ణదేవరాయలు ఆస్థానంలో

విజయ నగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులు అష్టదిగ్గజాలుగా తెలుగు సాహితీ సంప్రదాయంలో ప్రసిద్ధులయ్యారు. వీరికి కడప జిల్లాలోని తిప్పలూరు గ్రామాన్ని ఇచ్చినట్లు శాసనాధారాన్ని బట్టి తెలుస్తూంది.

సుప్రఖ్యాతమైన అష్టదిగ్గజాలు

అష్టదిగ్గజములు ఎవరెవరనే విషయమై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ క్రింది వారు అయి ఉండవచ్చు అని ఒక భావన.

  1. అల్లసాని పెద్దన
  2. నంది తిమ్మన
  3. ధూర్జటి
  4. మాదయ్యగారి మల్లన లేక కందుకూరి రుద్రకవి
  5. అయ్యలరాజు రామభధ్రుడు
  6. పింగళి సూరన
  7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి)
  8. తెనాలి రామకృష్ణుడు

తెలుగు సాహిత్య పాఠకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాలుగా వీరికే ప్రఖ్యాతి ఉంది. ప్రజాబాహుళ్యంలో ప్రచారం పొందిన చాటువుల ప్రకారం పైనున్న వారే అష్టదిగ్గజ కవులు. వీరి మధ్య జరిగినాయన్న కథలూ, వాటికి సంబంధించిన పద్యాలు వంటివి ఎన్నో ఉన్నాయి. అష్టదిగ్గజాల గురించి తెలుగునాట ఎన్నోచోట్ల విస్తారంగా జరిగే సాహిత్యరూపకంలోనూ వీరి పాత్రలే వస్తూంటాయి. ఐతే పరిశోధకుల్లో వేరే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

అష్టదిగ్గజ కవుల గురించిన పరిశోధనలు

రాయలు సరస్వతీ పీఠాన్ని పరివేష్టించి ఎనమండుగురు కవులు కూర్చొనేవారని కథ ఉంది. కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా మన్ననలందుకొన్న ఈ ఎనిమిదిమందీ నిజంగా తెలుగు కవులేనా, వారి పేర్లు పై జాబితాలోనివేనా అన్న విషయంపై సాహితీ చరిత్రకారులలో భిన్నభిప్రాయాలున్నాయి. పింగళి లక్ష్మీకాంతం ఈ విషయంపై ఇలా పరిశీలించారు .[1]

కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయము అనే గ్రంథంలో

సరస సాహిత్య విస్ఫురణ మొనయ
సార మధురోక్తి మాదయగారి మల్ల
నార్యుడల యల్లసాని పెద్దనార్యవరుండు
ముక్కు తిమ్మన మొదలైన ముఖ్య కవులు

అనే పద్యం ఉంది.

అష్టదిగ్గజాలలో ఐదుగురి పేర్లు నిశ్చయంగా చెప్పవచ్చును -

  1. అల్లసాని పెద్దన : కృష్ణరాయలకు ఆప్తుడు. తన కృతిని రాయలకు అంకితమిచ్చాడు.
  2. నంది తిమ్మన : తన కృతిని రాయలకు అంకితమిచ్చాడు. రాయల వంశముతో తిమ్మన వంశమునకు పూర్వమునుండి అనుబంధమున్నది. నంది మల్లయ, ఘంట సింగయలు తుళువ వంశమునకు ఆస్థాన కవులు.
  3. అయ్యలరాజు రామభద్రుడు : ఇతని సకలకథాసార సంగ్రహమును రాయల యానతిపై ఆరంభించినట్లు, రాయల కాలంలో అది పూర్తికానట్లు పీఠికలో తెలుస్తున్నది. రామాభ్యుదయము మాత్రం రాయల అనంతరం వ్రాసి రాయల మేనల్లడు అళియ రామరాజుకు అంకితమిచ్చాడు.
  4. ధూర్జటి : రాయల ఆస్థానంలో మన్ననలు అందుకొన్నాడు. ధూర్జటి తమ్ముని మనుమడు కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయంలో ఈ విషయం చెప్పబడింది. జనశృతి కూడా ఇందుకు అనుకూలంగానే ఉంది.
  5. మాదయగారి మల్లన : ఇతడు అష్ట దిగ్గజాలలో ఒకడని చెప్పడానికి కూడా కుమార ధూర్జటి రచనయే ఆధారం. మల్లన తన గ్రంధాన్ని కొండవీటి దుర్గాధిపతి, తిమ్మరుసు అల్లుడు అయిన నాదెండ్ల అప్పామాత్యునకు అంకితమిచ్చాడు.

ఈ ఐదుగురు కాక తక్కిన మువ్వురి పేర్లు నిర్ణయించడానికి తగిన ఆధారాలు లేవు. ఊహలలో ఉన్న పేర్లు - (1) తాళ్ళపాక చిన్నన్న (2) పింగళి సూరన (3) తెనాలి రామకృష్ణుడు (4) కందుకూరి రుద్రయ్య (5) రామరాజ భూషణుడు (6) ఎడపాటి ఎఱ్ఱన (7) చింతలపూడి ఎల్లన. ఈ విషయం నిర్ణయించడానికి వాడదగిన ప్రమాణాలు ...

  • అతను రాయల సమకాలికుడయ్యుండాలి
  • రాయల ఆస్థానంలో ప్రవేశం కలిగి ఉండాలి

ఇలా చూస్తే తాళ్ళపాక చిన్నన్న (పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము వంటి గ్రంధముల రచయిత) బహుశా తాళ్ళపాక అన్నమయ్య కొడుకో, మనుమడో కావలెను. ఇతడు రాయల సమకాలికుడు కావచ్చును. అష్టదిగ్గజాలలో ఒకడైయుండే అవకాశం ఉంది. కందుకూరి రుద్రకవి రాయల సరస్వతీ మహలు ఈశాన్యంలో కూర్చొనేవాడని నానుడి. ఇతని నిరంకుశోపాఖ్యానము 1580లో వ్రాయబడినది అనగా ఈ కవి చిన్నతనములోనే రాయలు గతించియుండవలెను. ఆయన రాయల ఆస్థానంలో ప్రవేశించడానికి మంత్రులు, తాతాచార్యులు వంటివారెవరూ ఉపకరించకపోవడంతో రాయల క్షురకుడైన మంగలి కొండోజీ ద్వారా చేరారని, మంత్రుల కన్నా మంగలి కొండోజుయే గొప్పవాడని కీర్తిస్తూ పద్యం రాసినట్టు ప్రతీతి. ఈ మంగలి కొండోజు కృష్ణరాయల మరణానంతరం 1542-1565 వరకూ రాజ్యంచేసిన సదాశివరాయల కాలంలో ఆయనకూ, అసలైన అధికారం చేతిలో ఉన్న అళియ రామరాయలకు సన్నిహిత భృత్యుడు. బాడవి పట్టణ కాపురస్తుడైన మంగలి తిమ్మోజు కొండోజు గారు అంటూ ప్రస్తావిస్తూ చాలా దానశాసనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుద్రకవి అతని సహకారంతోనే సదాశివరాయల కొలువులోకి వచ్చారనీ, రాయల మరణానంతరం కూడా ఆయన అష్టదిగ్గజాల్లో ప్రఖ్యాతులైన కొందరు కవులు ఉండేవారని వారితోనే ఈయనకు చాటువుల్లో చెప్పే సంగతి సందర్భాలు ఎదురై ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారుడు దిగవల్లి వెంకట శివరావు పేర్కొన్నారు. చేరి కన్నడభూమి చెఱవట్టు పాశ్చాత్య/నృపతిపై నొక్కింత కృప తలిర్చు అన్న పద్యంలో రుద్రకవి విద్యానగర వినాశనాన్ని వర్ణించడమూ ఇందుకు బలమిచ్చింది.[2] రామరాజభూషణుని వసుచరిత్ర తళ్ళికోట యుద్ధం తరువాత వ్రాయబడినట్లుగా అనిపిస్తుంది. కనుక ఇతని చిన్నవయసులోనే రాయల ఆస్థానంలో ఉండడం అనూహ్యం. పింగళి సూరన జననం రాయల మరణానికి 25 సంవత్సరాలముందు కావచ్చును కనుక అతడు కూడా అష్టదిగ్గజకవులలో ఉండే అవకాశం లేదు. అంతేగాక సూరన తండ్రికి రాయలు నిడమానూరు అగ్రహారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. తెనాలి రామకృష్ణకవి కాలం ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఉద్భటారాధ్య చరిత్ర బహుశా రాయల కాలంనాటి గ్రంథం. పాండురంగ మహాత్మ్యం రాయలు తరువాత వ్రాసినది.

ఈ పరిశీలనను ముగిస్తూ పింగళి లక్ష్మీకాంతం చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి - "రాయలు సరస్వతీ మహలులోని ఎనిమిదిమంది కవులు తెలుగువారే కానక్కరలేదు. రాజనీతిపరంగా వివిధ భాషలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండిఉండాలి. ఆయన తెనుగురాజు, ఆయన రాజ్యము తెనుగు రాజ్యము అయినందును ఆస్థానంలో ఐదు స్థానాలు తెలుగు కవులకు లభించాయి. అందరూ తెలుగువారేనని చరిత్రకారులెవరైనా వ్రాయదలచినచో చిక్కులు వచ్చును"

Remove ads

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads