ఆముక్తమాల్యద

శ్రీకృష్ణదేవరాయలు రచించిన కావ్యం From Wikipedia, the free encyclopedia

ఆముక్తమాల్యద
Remove ads

సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి, శ్రీరంగనాధుల కల్యాణం.

Thumb
Title page of 1907 Print Edition
Remove ads

నేపధ్యం, ప్రారంభం

కృష్ణదేవరాయలు విజయవాడకు యాత్రపై వచ్చి విడి ది చేసినపుడు శ్రీకాకుళాంధ్ర విష్ణువు ఆయన కలలో కనబడి తెలుగులో తనపై ఒక కావ్యమును రాయమని ప్రోత్సహించినట్టుగా ఒక కథనం ఉంది.

ఇది అముక్త మాల్యద అనేపేరున ఉన్న విష్ణుచిత్తుని కథ. విష్ణు చిత్తునితో ప్రారంభమై యమునాచార్యుడు, మాలదాసరి కథలను ఉపకథలుగా చెప్తూ గోదాదేవి కళ్యాణంతో అంతమయ్యే కథ. తమిళం లో తిరుప్పావై గా గానము చేయబడుతున్న గోదాదేవి కథ.

ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో శ్రీవేంకటేశ్వరుని స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో, 'శ్రీ' శబ్దంతో కావ్యామారంభించాడు.

శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును, గౌస్తుభంబునం
దాకమలావధూటియునుదారత దోప పరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ యాకృతు లచ్ఛత బైకి దోపన
స్తోకత నందు దోచె నన శోభిలు వేంకట భర్త గొల్చెదన్.

సాధారణంగా శార్దూలముతో గాని, విక్రీడితముతో గాని కావ్యమును ప్రారంభించుట పరిపాటియైన కాలములో, ఈ కావ్యము ఉత్పలమాలతో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవేంకటేశ్వరులు, ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద, గోదాదేవి రంగనాయక స్వామి వారి పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను.

Remove ads

కథాంశాలు

ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీశిశువు లభిస్తుంది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మలో భూదేవి. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.

ప్రధానకథకు అనుబంధంగా మత్స్యధ్వజుడు, ఖాండిక్యకేశిధ్వజులు, యమునాచార్యుడు, మాలదాసరి అనే కథలున్నాయి. ఇవి విష్ణువు యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి.

ఈ గ్రంథమున 7 ఆశ్వాసములు ఉన్నాయి. మొదటి ఆశ్వాసమున ఇష్టదేవతాస్తుతి, గ్రంథకర్త ప్రశంస, కృతిపతి ప్రశాంస, గ్రంథప్రవృత్తికి హేతువు, షష్ఠ్యంతములను ఉన్నాయి. ఈ విషయములు 49 పద్యములతో చెప్పబడినవి. ఇందలి కృతిపతి ప్రశాంసయందు తెలియవచ్చెడి విషయమేమనగా కృష్ణరాయలు "కళింగదేశంమీద దండెత్తి విజయం సాధించి శ్రీకాకులనికేతుతనండగు శ్రీవిష్ణువుణు సేవింపబోయి ఆ రాత్రి స్వప్నంబున ఆంధ్ర జలజాక్షుడాతనితో ఆంధ్రభాషయందు ఒక్క కృతి మాకు ప్రియముగ నిర్మించమని చెప్పినాడుట".

గ్రంథస్త విషయ క్రమము

1 ఆశ్వాసము (ఆ) - విలుబుత్తూరు వర్ణనము, భాగవతులు, విష్ణుచిత్తుడు గురుంచి వర్ణన.

2 ఆ - మధురాపుర వర్ణనము, మత్స్యధ్వజుడు గురుంచి, గ్రీష్మఋతు వర్ణన.

3 ఆ - విష్ణుచిత్తవాదము, ఖాండిక్యకేశిధ్వజసంవాదము.

4 ఆ- విష్ణుచిత్తుని విజయము, విష్ణుచిత్తునకు భగవంతుడు సాక్షాత్కరించుట, విష్ణుచిత్తుని స్వపుర ప్రవేశము, యమునాచార్య చరిత్రము, వర్షాకాలము, శరదృతువర్ణనము, యామున ప్రభువు, యామున ప్రభురాజనీతి.

5 ఆ- గోదాదేవి, వసంతఋతువర్ణనము.

6 ఆ - మాలదాసరి.

7 ఆ- బ్రహ్మరాక్షస వృత్తాంతము, గోదాదేవి శ్రీరంగమున రంగనాధుని సేవించుట, గోదాదేవీ రంగనాధుల వివాహము.

Remove ads

శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన

కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీవేంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు.[1] విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవిని కనుమరుగు పరచి శ్రీవేంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుట కవకాశము కల్పించిన శేషుని రాయలు స్తుతించాడు. రాయలు తరువాతి పద్యములలో చాల భాగము తిరుమల నంతయు సాక్షాత్కరింపజేసినాడు.

తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో, ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము (బంగారు దండము) కదలనిదే లోకవ్యవహారమే జరుగదని ఇలా వర్ణించాడు:

పూని ముకుందునాజ్ఞగనుబొమ్మనె కాంచి యజాండభాండముల్
వానను మీద బోవ నడువ న్గొనెదన్నననగ్రనిశ్చల
త్వానుచలత్వనిష్ఠలె సమస్తజగంబుల జాడ్యచేతనల్
గా నుతి కెక్కు సైన్యపతి కాంచనవేత్రము నాశ్రయించెదన్.

హరి పాంచజన్యమును పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాకా పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరి శంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడా ఒనగూర్చునని రాయల శుభాసంశన.

హరిపూరింప దదాస్య మారుత సుగంధాకృష్ణమై నాభి పం
కరుహక్రోడమిళిందబృంద మెదు రెక్కం దుష్క్రి యాపంక సం
కరదైత్యాసు పరంపరం గముచు రేఖం బొల్చురాకానిశా
కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం గళ్యాణసాకల్యమున్.

శంఖ చక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కానీ రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖమును గదను వర్ణించాడు. శ్రీవారి నందక ఖడ్గం పాపములనెడి తీగలయొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్ధ్యము కలదని వర్ణించాడు:

ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ భాస్వత్త్సరు స్తంభ సం
స్థితి దీండ్రించెడుజాళువా మొసలివాదీప్తార్చిగా గజ్జలా
న్వితధూమాసితరేఖ పైయలుగుగా విజ్ఞానదీపాంకురా
కృతి నందం బగు నందకం బఘ లతాశ్రేణి చ్ఛిదం జేయుతన్.

ఆముక్త మాల్యద ఒక అధ్బుత కావ్యచంద్రిక.

ఆళ్వారులు

శ్రీ వైష్ణవ మతాచార్యులైన పన్నిద్దరాళ్వారులను రాయలు ఇలా కీర్తించాడు:

అలపన్నిద్దఱు సురులందును సముద్యల్లీలగా పన్నవె
గ్గల ప్రందాపము బాపునా నిజమనః కంజాత సంజాతపు
ష్కలమాధ్వీకఝరి న్మురారి నొగియంగా జొక్కి ధన్యాత్ములౌ
నిల పన్నిద్దఱుసూరులం దలతు మోక్షేచ్ఛామతిం దివ్యులన్.

అంకితం

రాయలు ఆముక్తమాల్యదను శ్రీకాకుళాంధ్రదేవుని ఆనతిమీద శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. అనేక ప్రబంధ రాజములను కృతిభర్త అయిన శ్రీకృష్ణదేవరాయలు లోకైకనాధుడు శ్రీవేంకటేశ్వరునికి ఈ క్రింది విధంగా ఆముక్తమాల్యదను సమర్పించాడు:

అంభోధికన్యకాకుచ
కుంభోంభితఘసృణమసృణ గురువక్షునకున్
జంభారిముఖాధ్యక్షున
కంభోజాక్షునకు సామిహర్యక్షునకున్.

కర్తృత్వ వివాదము

ఈ గ్రంథమును శ్రీకృష్ణదేవరాయలుచే వ్రాయబడలేదని అల్లసాని పెద్దన వ్రాసినాడని కొందరు అనుచుందురు. మరికొందరు వీరిరిరువురు వ్రాయక ఆకాలమున శ్రీకాకుళ విష్ణుదాసులలో ఒక విష్ణువాగ్రేసరుడే దీనిని రచించెనని అనుచుందురు. దీనిని సమర్ధించుటకు పలువురు విమర్శకులు గ్రంథవిషయములను ఆధారముగా చేసుకొని, గ్రంథశైలిలో పలు విషయములను బట్టి ఆరోపించిరి.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads