పూజ
హిందూ దైవారాధన పద్ధతి From Wikipedia, the free encyclopedia
Remove ads
పూజ అనేది హిందువులు, బౌద్ధులు, జైనులు దేవతలకు భక్తి శ్రద్ధలతో చేసే ప్రార్థన. అతిథికి ఆతిథ్యం ఇవ్వడం, గౌరవించడం లేదా ఒక కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకోవడం ఆరాధన కూడా పూజయే. [1] [2] ప్రత్యేక అతిథులను గౌరవించడానికి, లేదా వారు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం కూడా పూజలు చేస్తారు. పూజ అనే సంస్కృత పదానికి గౌరవం, నివాళి, ఆరాధన అని అర్థాలు. [3] పూజలో దైవానికి కాంతి, పువ్వులు, నీరు లేదా ఆహారాన్ని ప్రేమపూర్వకంగా సమర్పించడం హిందూ మతం లోని ముఖ్యమైన ఆచారం. ఆరాధించేవారికి, ఆరాధించే రూపంలో దైవత్వం కనిపిస్తుంది, దైవత్వం పూజించేవారిని చూస్తుందని హిందూ విశ్వాసం. మానవుడికి, దేవునికీ మధ్య, మానవుడికీ గురువుకూ మధ్య జరిగే పరస్పర చర్యను దర్శనం అంటారు. [4]
హిందూమతంలో వివిధ సందర్భాలలో, వివిధ తరచుదనాలతో పూజలు చేస్తారు. ఇది ఇంట్లో చేసే రోజువారీ పూజ కావచ్చు, లేదా అప్పుడప్పుడు ఆలయాల్లో చేసుకునే వేడుకలు, వార్షిక పండుగలూ కావచ్చు. ఇతర సందర్భాల్లో, శిశుజననాలు లేదా వివాహం వంటి కొన్ని జీవితకాల సంఘటనలకు గుర్తుగానో, లేదా కొత్త వ్యాపార ఉద్యోగాలను మొదలుపెట్టే సాందర్భాల్లోనో పూజలు చేస్తారు. [5] జీవితంలోని కొన్ని దశలు, సంఘటనల సందర్భంగా, లేదా దుర్గాపూజ, లక్ష్మీ పూజ వంటి కొన్ని పండుగలలో ఇంట్లోను, దేవాలయాలలోనూ పూజలు చేసుకుంటారు. [6] హిందూ మతంలో పూజ తప్పనిసరి కాదు. కొంతమంది హిందువులు రోజూ పూజ వ్చేస్తారు. కొందరు అప్పుడప్పుడూ చేసుకుంటారు. మరి కొందరు అరుదుగా చేసుకోవచ్చు. కొన్ని దేవాలయాలలో, ప్రతిరోజూ వివిధ వేళల్లో వివిధ రకాల పూజలు చేస్తారు. [7] [8]
పూజ శాఖ, ప్రాంతం, సందర్భం, దేవుడూ, అవలంబించే ఆచారాలను బట్టి మారుతూంటుంది. [9] [7] అధికారిక నిగమ వేడుకల్లో, విగ్రహం లేదా చిత్రం లేకుండా అగ్ని దేవుని గౌరవార్థం అగ్నిని వెలిగించవచ్చు. దీనికి విరుద్ధంగా, ఆగమ వేడుకలలో, ఒక దేవుని విగ్రహం లేదా చిహ్నం లేదా చిత్రం ఉంటుంది. రెండు వేడుకల్లోనూ, ఒక దీపాన్ని వెలిగించవచ్చు, మంత్రాలు చదువుతారు. సాధారణంగా భక్తుడే పూజ చేసుకుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన ఆచారాలు, శ్లోకాలలో బాగా ప్రావీణ్యం ఉన్న పూజారి సమక్షంలో చేస్తారు. దేవాలయాల్లో, పూజారి నిర్వహించే కార్యక్రమాలలో పూజ, ఆహారం, పండ్లు, స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ తరువాత ఇది, ప్రసాదంగా మారుతుంది. [7] [10]
హిందూమతంలో పూజల్లో నిగమ, ఆగమ ఆచారాలు రెంటినీ ఆచరిస్తారు. ఇండోనేషియా లోని బాలిలో ఆచరించే హిందూ మతంలో ఆగమ పూజ ఎక్కువగా ఉంటుంది. ఇండోనేషియాలో పూజను సెంబహ్యాంగ్ అని పిలుస్తారు. [11] [12]
Remove ads
మూలాలు
పండితుల ప్రకారం, [13] పూజ గురించిన మొట్టమొదటి ప్రస్తావన గృహ్య సూత్రాలలో ఉంది. ఇది గృహ సంబంధమైన ఆచారాలకు సంబంధించిన నియమాలను చెబుతుంది. ఈ సూత్రాలు, సుమారు సా.పూ. 500 నాటివి. గతించిన పూర్వీకుల కోసం చేసే ఆచారాలను నిర్వహించే పూజారులను గౌరవించే ఆతిథ్యాన్ని పూజ అని పిలిచేవారు. వేద కాలాల మాదిరిగానే, పూజ సాధారణ భావన ఇప్పటికీ అలాగే ఉంది. దానితో పాటు దేవతను స్వాగతించడానికి కూడా ఇదే పేరు వచ్చింది. [13] సా.శ. 6వ శతాబ్దం నాటి పురాణ సాహిత్యంలో దేవతా పూజ ఎలా నిర్వహించాలనే విషయమై విస్తృతమైన రూపురేఖలున్నాయి. ఆ విధంగా దేవతా పూజలో వేద ఆచారాలు, దేవత పట్ల చేసే కర్మలతో మిళితమైంది. హిందూమతంలోని అనేక ఇతర అంశాల మాదిరిగానే, వేద పూజ, భక్తితో కూడిన దేవతా పూజ రెండూ కొనసాగాయి.
Remove ads
ఆలయ పూజ
దేవాలయంలో చేసే పూజ ఇళ్ళల్లో చేసుకునే పూజల కంటే చాలా విస్తృతమైనది. సాధారణంగా రోజుకు చాలా సార్లు చేస్తారు. వాటిని ఆలయ పూజారి నిర్వహిస్తాడు. అదనంగా, ఆలయ దేవతను అతిథిగా కాకుండా నివాసిగా పరిగణిస్తారు కాబట్టి పూజ దానిని ప్రతిబింబించేలా మార్చారు; ఉదాహరణకు ఉదయాన దేవతను"ఆవాహన" చెయ్యడం కాకుండా "మేల్కొలుపు"తారు. ఆలయ పూజలు ప్రాంతాల వారీగా, వివిధ వర్గాలను బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు వైష్ణవ దేవాలయాలలో భక్తి గీతాలు పాడతారు. ఆలయ పూజలో, పూజారులు ఇతరుల తరపున వ్యవహరిస్తూ పూజ నిర్వహిస్తారు. [14]
Remove ads
పద్ధతులు, సేవలు

విస్తృతమైన పూజ
ఇంట్లో లేదా గుడిలో చేసే పూజలో అనేక సాంప్రదాయిక ఉపచారాలు ఉంటాయి. కింద చూపినది ఒక ఉదాహరణ పూజ; పూజ లోని ఈ అంగలు ప్రాంతం, సంప్రదాయం, సమయాన్ని బట్టి మారవచ్చు. ఈ ఉదాహరణలో, దేవతని అతిథిగా ఆహ్వానించారు, భక్తుడు గౌరవనీయమైన అతిథిగా దేవతకు ఆతిథ్యం ఇస్తాడు. స్తోత్ర పారాయణం చేస్తూ నైవేద్యం సమర్పిస్తారు. [16] అన్ని రకాల పూజలలో సాధారణంగా ఉండే 16 అంగలను షోడశొపచారాలంటారు. [17]
- ఆవాహన. వేడుకకు దేవతను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు.
- ఆసనం . దేవతకి ఆసనం సమర్పిస్తారు.
- పాద్యం . దేవత పాదాలు కడుగుతారు.
- తల, శరీరం కడుక్కోవడానికి నీరు అందిస్తారు
- అర్ఘ్యం. దేవత నోరు కడుక్కోవడానికి నీరు సమర్పిస్తారు.
- స్నానం లేదా అభిషేకం. స్నానానికి నీటిని అందిస్తారు.
- వస్త్రం. చిత్రం చుట్టూ ఒక గుడ్డ, ఆభరణాలతో అలంకరిస్తారు.
- ఉపవీదం లేదా మంగళసూత్రం . పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని ధరించడం.
- అనులేపన లేదా గంధం. దైవపటానికి గంధం, కుంకుమ వంటి లేపనాలు పూస్తారు.
- పుష్పం. దేవుని పువ్వులు సమర్పిస్తారు. మెడలో దండలు వేస్తారు.
- ధూపం. ప్రతిమ ముందు ధూపం వేస్తారు.
- జ్యోతి లేదా హారతి . దేవునికి హారతి సమర్పిస్తారు.
- నైవేద్యం . వండిన అన్నం, పండ్లు, శుద్ధి చేసిన వెన్న, చక్కెర, తమలపాకు వంటి ఆహారాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
- ప్రణామం. కుటుంబ సభ్యులు నివాళులర్పించడానికి చిత్రం ముందు నమస్కరిస్తారు, లేదా సాష్టాంగ నమస్కారం చేస్తారు.
- ప్రదక్షిణ. దేవత చుట్టూ ప్రదక్షిణలు.
- సెలవు తీసుకుంటారు.
కొన్నిసార్లు కింది అదనపు దశలు కూడా ఆచరిస్తారు
- ధ్యానం. భక్తుని హృదయంలో దేవతను ఆవాహన చేస్తారు.
- ఆచమనీయం. నీటితో ఆచమనం చేస్తారు
- ఆభరణం . దేవతను ఆభరణాలతో అలంకరిస్తారు.
- చత్రం. ఛత్రాన్ని సమర్పణ.
- చామరం చామరాన్ని సమర్పిస్తారు.
- విసర్జన లేదా ఉద్వాసన. దేవతను ఆ స్థలం నుండి తరలిస్తారు.
ఈ పూజ పద్ధతిలో ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి:
- పంచ ఉపచారాల పూజ (5 అంగల పూజ).
- చతుష్షష్టి ఉపచారాల పూజ (64 అంగల పూజ). [18]
ఆలయాలు, ప్రాంతాలు, సందర్భాలను బట్టి కూడా పూజ పద్ధతులు గణనీయంగా మారతాయి. [19]
అర్చన పూజ అనేది ఒక వ్యక్తి తరపున క్లుప్తమైన మధ్యవర్తిత్వ పూజ. ఇది ప్రధాన పూజ తర్వాత చేపట్టవచ్చు. [20]
Remove ads
గురు పూజ
గొప్ప ఆధ్యాత్మిక గురువుల విషయంలో ప్రత్యేకంగా గురు పూర్ణిమ నాడు పూజలు చేసే ఆచారం కూడా ఉంది. జీవించి ఉన్న గురువులకు కూడా పూజ చేస్తారు. [21] గురువులను పూజా వస్తువులుగా ఎంచుకుంటారు. సజీవ దేవతలుగా గౌరవిస్తారు, దేవతల స్వరూపాలుగా చూస్తారు. గురువులను కొన్నిసార్లు ప్రతీకాత్మక వస్త్రాలు, దండలు, ఇతర ఆభరణాలతో అలంకరించి, ధూపం వేసి, వారి పాదాలను కడిగి, అభిషేకించి, వారికి పండ్లు, ఆహారం, పానీయాలు ఇచ్చి వారి పాదాల వద్ద ధ్యానం చేస్తూ వారి ఆశీర్వాదం కోసం వేడుకుంటారు.
Remove ads
పూర్వ మీమాంసలో పూజపై విమర్శ
పూజ అనేది సరైన మతపరమైన కార్యకలాపంగా హిందువులు అంగీకరించినప్పటికీ, మీమాంస ఆలోచనాపరులు దీన్ని విమర్శించారు. జైమిని రచించిన కర్మమిమంసాసూత్రం ఈ విమర్శకు పునాది. నాల్గవ శతాబ్దపు చివరిలో నివసించిన శబార ఇప్పటికీ మనుగడలో ఉన్న తొలి వ్యాఖ్యానం. [22] శబరభాష్యానికి మీమాంసలో గర్వించదగిన స్థానం ఉంది. శబర యొక్క అవగాహనను తరువాతి రచయితలందరూ అనుసరించారు. దేవతాదికరణ (9: 1: 5: 6-9) అనే శీర్షికతో కూడిన తన అధ్యాయంలో శబర, దేవతల గురించిన అవగాహనను పరిశీలించాడు. వారికి భౌతిక శరీరాలు ఉన్నాయనడం, వారికి సమర్పించిన నైవేద్యాలను సేవించడం, వారు సంతృప్తి చెందడం ఆరాధకులకు ప్రతిఫలమివ్వడం లాంటి నమ్మకాలను అతను తిరస్కరించాడు. [23] వేదాలను ప్రమాణం తీసుకున్న శబర, మహాభారతం, పురాణ గ్రంథాలు లేదా స్మృతి సాహిత్యాలను కూడా చెల్లుబాటు అయ్యే మూలాలుగా అంగీకరించడానికి అతను నిరాకరించాడు. దేవుళ్ళు భౌతికంగా లేదా జ్ఞానవంతులు కాదని, అందువల్ల సమర్పణలను ఆస్వాదించలేరని చెప్పాడు. దీని కోసం అతను అనుభావిక పరిశీలనకు విజ్ఞప్తి చేశాడు, దేవతలకు ఇచ్చినప్పుడు నైవేద్యాలు పరిమాణంలో తగ్గవు; ఏదైనా తగ్గుదల కేవలం గాలికి కొట్టుకుపోతే తగ్గుదల రావచ్చు. అలాగే దేవతల ఇష్టానుసారం దేవుళ్లకు పదార్ధాలు సమర్పిస్తారని, కానీ "ప్రత్యక్ష అవగాహన ద్వారా ధృవీకరించబడినది ఏమిటంటే, ఆలయ సేవకులకు ( ప్రత్యక్షత్ ప్రమాణాత్ దేవతాపరిచారకం [24] అభిప్రాయం) ఏది ఇష్టమే ఆ వస్తువులనే నైవేద్యంగా ఉపయోగిస్తున్నారని అతను వాదించాడు. [25] తన చర్చలో, శబర "అతిథులకు, కర్మకూ మధ్య ఎటువంటి సంబంధం లేదు" అని నొక్కిచెప్పాడు. ఈ యాదృచ్ఛిక వ్యాఖ్య అతిథితో సారూప్యతతో పూజ నిర్మించబడిందని, అతిథులను స్వాగతించే పురాతన వైదిక సంప్రదాయం అని చెప్పడానికి మంచి చారిత్రక రుజువును అందించింది. ఈ సారూప్యత చెల్లుబాటు కాదని శబర కొనసాగించారు. [26] శతాబ్దాలుగా మీమాంసకులు ఈ వ్యాఖ్యానాన్ని కొనసాగించినప్పటికీ, శంకరాచార్యతో చేసిన చర్చలో వారు ఓటమి పాలవడంతో వారి అభిప్రాయాలు మరుగున పడ్డాయి. మీమాంసలు 17వ శతాబ్దంలో కూడా వర్ధిల్లాయని, నీలకంఠ చేసిన వ్యాఖ్యానాల ద్వారా రుజువైంది.
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads