లీపు సంవత్సరం
From Wikipedia, the free encyclopedia
Remove ads
ఒక కాలెండరు సంవత్సరంలో మామూలుగా ఉండేదాని కంటే ఒక రోజు గానీ లేక ఒక నెల గాని అదనంగా ఉంటే, దానిని లీపు సంవత్సరం అంటారు.[1]

కారణం
ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని ప్రవేశపెట్టారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు కచ్చితంగా ఒక పూర్ణ దినాలలో పునరావృతం కావు. ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఖచ్చితంగా 365 రోజులు కాకుండా, సుమారు 6 గంటలు (పావు రోజు) అదనంగా పడుతుంది. కానీ ప్రతి ఏడూ ఒకే పూర్ణ సంఖ్యలో రోజులుండే కాలెండరు, ఈ పావు రోజును చూపించలేదు. గ్రిగోరియన్ క్యాలెండరు ప్రకారం మామూలుగా సంవత్సరంలో 365 రోజులే ఉంటాయి. అంటే, ఖగోళ సంవత్సరంతో పోలిస్తే ఒక పావు రోజు తక్కువగా ఉంటుంది. ఏళ్ళు గడిచే కొద్దీ ఈ తేడా పెరిగిపోతూ, నాలుగేళ్ళలో ఇది సుమారు ఒక రోజు అవుతుంది. గ్రిగోరియన్ క్యాలెండరులో నాలుగేళ్ళకోసారి ఒక రోజును అదనంగా చేర్చి ఈ తేడాను సవరిస్తారు.[2] ఈ సంవత్సరాన్నే లీపు సంవత్సరం అని అంటారు. లీపు సంవత్సరం కాని దానిని సాధారణ సంవత్సరం అనీ, మామూలు సంవత్సరం అనీ అంటారు.
Remove ads
లెక్కించే విధానం
గ్రిగోరియన్ క్యాలెండరులో మామూలుగా 365 రోజులుంటాయి. కానీ లీపు సంవత్సరంలో 366 రోజులుంటాయి. ఫిబ్రవరిలో మామూలుగా ఉండే 28 రోజులకు ఒకరోజు అదనంగా కలుపుతారు. ఈ అదనపు రోజును నాలుగేళ్ళ కోసారి - సంవత్సరం 4 చేత నిశ్శేషంగా భాగాహారింపబడే సంవత్సరంలో - కలుపుతారు. కానీ, 4 చేత నిశ్శేషంగా భాగాహారింపబడినప్పటికీ, 100 చేత నిశ్శేషంగా భాగాహారింపబడే సంవత్సరంలో అదనపు రోజును కలపరు (ఉదాహరణకు 1800, 1900 లు లీపు సంవత్సరాలు కావు). కాని, 100 చేత నిశ్శేషంగా భాగాహారింపబడినప్పటికీ, 400 చేత నిశ్శేషంగా భాగాహారింపబడే సంవత్సరంలో (ఉదాహరణకు 1600, 2000 లు లీపు సంవత్సరాలే) అదనపు రోజును కలుపుతారు.
లీప్ అంటే ఇంగ్లీషులో గెంతడం. గ్రిగోరియన్ క్యాలెండర్లో ఏ తేదీ ఐనా వారం ప్రకారం ఏటా ఒక రోజు ముందుకు జరుగుతూ ఉంటుంది (365 రోజులను 7 తో భాగహారిస్తే 1 శేషంగా వస్తుంది కాబట్టి, ఏడాది తరువాత వచ్చే అదే తేదీ వారంలో ఒకరోజు ముందుకు జరుగుతుంది).[3][4] ఉదాహరణకు, 2017 జనవరి 1 ఆదివారం రాగా, 2018 జనవరి 1 సోమవారం వచ్చింది. 2019 జనవరి 1 మంగళ వారం, 2020 జనవరి 1 బుధవారం వచ్చాయి. 2017, 2018, 2019 మామూలు సంవత్సరాలు కాబట్టి అలా ఒక్కొక్కరోజే ముందుకు జరిగాయి. 2020 లీపు సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరంలో ఫిబ్రవరికి 29 రోజులుంటాయి కాబట్టి 2021 జనవరి 1 ఒకరోజు అదనంగా ముందుకు గెంతి శుక్రవారం నాడు (మామూలు సమవత్సరమే అయితే గురువారం వచ్చేది) వచ్చింది. ఇలా ఒకరోజు అదనంగా గెంతడం వలన దీనికి లీపు సంవత్సరం అని పేరు వచ్చి ఉండవచ్చు.
Remove ads
అధిక మాసం
హిందువులు అనుసరించే చాంద్రమాన పంచాంగపు సంవత్సరానికి, ఖగోళ సంవత్సరానికీ ఉన్న తేడాను సవరించే పద్ధతిని అధిక మాసం అంటారు. ఈ పద్ధతిలో ప్రతి 32 నెలలకు ఒకసారి ఒకనెలను అధికంగా కలుపుతారు. ఈ నెలను అధిక మాసం అని అంటారు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads