విశ్వనాథ సత్యనారాయణ
తెలుగు రచయిత, కవి From Wikipedia, the free encyclopedia
Remove ads
విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది. ఈయన తిరుపతి వెంకట కవులు ద్వయానికి చెందిన ప్రముఖ తెలుగు రచయిత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి విద్యార్థి. విశ్వనాథ ఆధునిక, శాస్త్రీయ శైలిలో, సంక్లిష్ట రీతుల్లో రాశారు. ఆయన ప్రసిద్ధ రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (రామాయణం కోరికలు తీర్చే దివ్య వృక్షం), కిన్నెరసాని పాటలు (మత్స్యకన్య పాటలు), నవల వేయిపడగలు (ది థౌజండ్ హుడ్స్) ఉన్నాయి. అనేక అవార్డులలో, ఆయన 1971లో పద్మభూషణ్ పురస్కారం, తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు. 20వ శతాబ్దంలోని ఆంధ్ర సాహిత్యంనకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. అతను చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యాలు, కవితలు, నవలలు, నాటకలు, పద్యకావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు - అతను పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. అతను మాటలలోనే "నేను వ్రాసిన పద్యల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " అతను వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును.[1]

విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా అతను చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో అతనుదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం - ఈ వ్యక్తిత్వం."[2]
Remove ads
జీవిత విశేషాలు
బాల్యజీవితం
విశ్వనాథ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి)[3] ) కృష్ణా జిల్లా నందమూరు (ఉంగుటూరు మండలం)లో జన్మించాడు. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. అతనిది తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబం. శోభనాద్రి జీవితం చాలా వరకూ వైభవోపేతంగా సాగిన చివరి దశలో దాతృత్వ గుణం వల్ల దారుణమైన పేదరికాన్ని అనుభవించాడు. విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించాడు. అతను మాటల్లో చెప్పాల్సి వస్తే మరీ చిన్నతనంలో నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ.[4] అనంతర కాలంలో శోభనాద్రి కేవలం అంగవస్త్రం, పంచె మాత్రమే సర్వవస్త్రాలుగా మిగిలాకా కూడా దానాలిచ్చి దూసిన స్వర్ద్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన స్థితిలో జీవించాల్సి వచ్చింది.[4] తండ్రి శోభనాద్రి మంచి భక్తుడు, అతను వారణాసి వెళ్ళి గంగానదిలో స్నానం చేయగా దొరికిన విశ్వేశ్వరస్వామి లింగాన్ని తీసుకువచ్చి స్వగ్రామమైన నందమూరులో ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. అతను ప్రభావం తమపై విపరీతంగా వుందని విశ్వనాథ సత్యనారాయణ అనేకమార్లు చెప్పుకున్నాడు. విశ్వనాథ సత్యనారాయణలోని దాతృత్వం, భక్తి వంటి సుగుణాలు తండ్రి నుంచి వచ్చినవేనని చెప్పుకున్నాడు[నోట్ 1] విశ్వనాథ సత్యనారాయణ బాల్యంలో అతను పుట్టిపెరిగిన గ్రామం, దానిలో దేశికవితా రీతులతో గానం చేసే భిక్షుక బృందాలూ, పురాణగాథలు నేర్చి ప్రవచించడంతో నిత్యం గడిపే స్వజనం అతను కవిత్వానికి పునాదులు వేసాయని చెప్పవచ్చు.[5]
విద్యాభ్యాసం
విశ్వనాథ సత్యనారాయణ విద్యభ్యాసము ఎన్నో ఆటంకాల నడుమ సాగింది. ప్రాథమిక విద్యను నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు. పై చదువు బందరు పట్టణంలో సాగింది. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించారు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన ప్రముఖ కవి, పండితుడు. అతను వద్ద బందరు పాఠశాలలో విద్యార్థులుగా చదువుకున్న వారు అనంతర కాలంలో మహా పండితులుగా, మహాకవులుగా ఆంధ్రదేశంలో సుప్రఖ్యాతి పొందడం విశేషం. వారిలో విశ్వనాథ సత్యనారాయణ అగ్రగణ్యులు. చెళ్ళపిళ్ళ తమకు నిత్యం పాఠ్యప్రణాళిక ప్రకారం, సమయానికి వచ్చి పాఠాలు చెప్పినవారు కారనీ, ఐతే తమకు తోచిన సమకాలీన పండిత చర్చలు పిల్లలకు బోధిస్తూ శాఖాచంక్రమణంలో ఎన్నెన్నో భాషా, సాహిత్య విశేషాలు వివరించి తుదకు గొప్ప పండితులుగా శిష్యులను తీర్చిదిద్దారని విశ్వనాథ వ్రాశారు.[6] [నోట్ 2] విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతూండగా 1921లో మహాత్మాగాంధీ పిలుపుమేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేందుకు కళాశాలను వదిలివేశారు. తండ్రి చనిపోయి కుటుంబం దుస్థితిని అనుభవిస్తున్నా అతను ఈ సాహసం చేశారు. 1921 నుంచి 1926 వరకూ బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మధ్యలో వదిలివేసిన బి.ఎ.ను తిరిగి 1926-27లో పూర్తిచేసి, బందరు హిందూ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు.[5]
ఉద్యోగ జీవితం
ప్రధానంగా అతను అధ్యాపక వృత్తిలో జీవితాన్ని గడిపారు. విద్యార్థి దశలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం, తండ్రి మరణంతో దారుణమైన పేదరికం వంటి కారణాల వల్ల అతను బి.ఎ. పూర్తికాకుండానే ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. అనంతరం ఇతను వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించారు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1932లో స్వల్పకాలం) పనిచేశారు. అనంతరం దాదాపుగా ఐదారేళ్ళ పాటుగా స్థిరమైన ఉద్యోగం లేకుండా రచన, ప్రసంగాదుల ద్వారా జీవించారు. కఠోరమైన ఆర్థిక దుస్థితిని ఎదుర్కొన్నా ఈ కాలంలో కవిగా అతను విఖ్యాతులయ్యారు. విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాలగా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో అతను వివిధ హోదాల్లో పనిచేసారు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగానూ, 1958లో శాసనమండలికి నామినేటెడ్ సభ్యులుగానూ విధులు నిర్వర్తించారు.
దాంపత్యం
విశ్వనాథ సత్యనారాయణ మొదటి భార్య పేరు వరలక్ష్మి. ఆమె అపురూపమైన వ్యక్తిత్వం కల మహా మనీషిగా విశ్వనాథ తరచు పేర్కొన్నారు. వరలక్ష్మి సాహచర్యం తనకు వరమని, ఆమె వల్లనే తానొక కవిని కాగలిగానని పలు విధాలుగా అనేకమైన రచనల్లో పేర్కొన్నారు. ఆమె వాగ్మాధుర్యం, సౌందర్యం, పాతివ్రత్యం, సంసారాన్ని దిద్దుకున్న తీరు వంటివి అతిలోకమైన లక్షణాలుగా వివరించారు. తాను స్వయంగా వట్టి నీరసబుద్ధి గలవాడనని, తాను గొప్ప రసవేత్తను, రసస్రష్టను కావడానికి, మహాకవిని కావడానికి మూలం ఆమేనని పద్యరూపంగా పేర్కొన్నారు.[నోట్ 3] వారికి అచ్యుతదేవరాయలు అనే కుమారుడు కలిగాడు.
భార్యా వియోగం
ప్రధాన వ్యాసం:వరలక్ష్మీ త్రిశతి
1931-32 కాలంలో అతను మొదటి భార్య, తనను రసవేత్తగా మలిచిన వ్యక్తి వరలక్ష్మి అనారోగ్యంతో మరణించారు. ఆ వియోగదు:ఖం విశ్వనాథ జీవితంపై, ఆలోచనలపై తీవ్రమైన ముద్రవేసింది. అతను జీవితంలో గొప్ప కుదుపు తీసుకువచ్చింది. తన జీవిన సరస్వం వంటి ఆమె మరణం వల్ల అతనులో కలిగిన వేదన తన చరమాంకంలోనూ పోలేదు. అతను 36 ఏట తొలి భార్య మరణించగా తన 80వ ఏట మరణించే సమయంలోనూ ఆమెనే తలచుకున్నారని సన్నిహితులు, కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వరలక్ష్మి మరణం పొందాకా ఆ వియోగబాధలో రోజుల తరబడి వెలువడ్డ పద్యాలను కూర్చి 20 ఏళ్ళ అనంతరం వరలక్ష్మీ త్రిశతిగా ప్రచురించారు. 300 పద్యాలున్న ఈ గ్రంథంలో వరలక్ష్మి మరణం, కర్మకాండలు మొదలుకొని స్మృతిగా మిగిలి వేదన మిగల్చడం వరకూ అనేక సందర్భాల్లో వచ్చిన పద్యాలు ఉంటాయి. తెలుగు సాహిత్యంలో నిలిచే నవలగా విమర్శకులు భావించిన విశ్వనాథ వేయిపడగలులో నాయకుడైన ధర్మారావు పాత్ర నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణదనీ, ధర్మారావు భార్య అరుంధతి వరలక్ష్మమ్మ అని పేర్కొంటారు. ఆమె మహోన్నత్యం, సహజ పాండిత్యం, అనారోగ్యం, మరణం వంటివన్నీ ఆ నవలలోనూ వర్ణితమయ్యాయి. అతను మహాకావ్యం రామాయణ కల్పవృక్షంతో కూడా వరలక్ష్మి మరణానికి గాఢమైన సంబంధముంది. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.[4] అతను జీవితంపై, సాహిత్యంపై అలా వరలక్ష్మితో దాంపత్యమూ, ఆమె అకాల మరణమూ తీవ్రమైన ప్రభావం చూపించాయి.
కష్టదశ (1932-38)
అతను జీవితంలో 1932 నుంచి 38 వరకూ అత్యంత కష్టదశగా చెప్పవచ్చు. ఈ సమయంలో అతను స్థిరమైన ఉద్యోగం లేకుండా జీవించాల్సిరావడంతో ఆర్థికపరమైన కష్టాలు, అత్యంత ప్రేమాస్పదురాలైన భార్య గతించడంతో మానసికమైన దుఃఖాన్నీ అనుభవించారు. విశ్వనాథ సత్యనారాయణ రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవి ఈ దుస్తరమైన కాలంలోనే వెలువడ్డాయి. 1976 అక్టోబరు 18 న (నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి) విశ్వనాథ పరమపదించాడు. జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడచింది. 1996 అక్టోబరు 21న అతను శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడలో అతను విగ్రహాన్ని ఆప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆవిష్కరించారు.
Remove ads
సాహితీ ప్రస్థానం


1916 లో "విశ్వేశ్వర శతకము"తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే "ఆంధ్రపౌరుషము" రచించాడు. 1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. అతను రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించారు. 1961లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించారు.
ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచనలను కొన్నింటినైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే, అతను అంతర్జాతీయ ఖ్యాతినార్జించి ఉండేవాడని అతను అభిమానులు అంటుంటారు. అయితే విశ్వనాథ రచనలను విశ్లేషించే విమర్శకుడు అతను తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యం కాని విషయం [1]
పాత్ర చిత్రణ
విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాథ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, స్వయం ప్రకాశవంతమయిన పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. స్త్రీ పాత్ర చిత్రణలు పేరెన్నిక గన్నవి.
ముఖ్య రచనలు
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి - ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి అతను మొదటి రచనలలోనివి. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నారు. తమిళనాడులోని మదురై ప్రాంతం నేపథ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించారు. భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశారు. విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ, అనితరమైన అతను శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.
విశ్వనాథ సత్యనారాయణ వారి ముఖ్య రచనా సాహిత్యంలో శతకములు ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయి, వీటి గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే.
ఈ క్రింద చెప్పిన 10 శతకాలు వాటి పేర్లు, మకుటము ప్రస్తావించటం జరిగింది.
1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ!
2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ!
3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ!
4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!
5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ!
6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ!
7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల!
8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి!
9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల!
10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి!
Remove ads
వ్యక్తిత్వం
విశ్వనాథ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగింది. తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవారు. ఇందువల్ల విశ్వనాథను వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు. ఛాందసుడు అనీ, "గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్" అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించారు. విశ్వనాథకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు. కాని అతను పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు. షేక్స్‌పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించాడు.
|
గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథకు తన ప్రతిభ పైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు. తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నారు విశ్వనాథ. జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి, ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాథ అనేవారు. శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవారు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకొనేవారు.[1]
విశ్వనాథ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీనరసింహం ఇలా ప్రశంసించాడు: - "ఆహారపుష్టి గల మనిషి. ఉప్పూ కారం, ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం. కాఫీలో గాని, తాంబూలంలో గాని ఎక్కువగా పంచదార వాడేవారు. ఆజానుబాహువు. బ్రహ్మతేజస్సు ముఖాన, సరస్వతీ సంపద వాక్కున, హృదయ స్థానాన లక్ష్మీకటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల. మనస్సు నవ్య నవనీతం. వాక్కు దారుణాఖండల శస్త్రతుల్యం. చదివేవి ఎక్కువ ఆంగ్ల గ్రంథాలు. వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంథాలు. చిన్నలలో చిన్న, పెద్దలలో పెద్దగా ఒదిగి పోయే స్వభావం. శారీరకంగా వ్యాయామం, యోగాభ్యాసం అయన నిత్యం అభ్యసించేవి. విమర్శలూ, స్తోత్రాలూ, తిట్లూ, దీవెనలూ, దారిద్ర్యం, ఐశ్వర్యం - ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడు. ఒకమాటలో అతను అపూర్వమైన 'దినుసు'"[2]
Remove ads
శైలి
విశ్వనాథ వారిది విశిష్టమైన శైలి. అతను రచనల్లో లోకానుభవం తొంగి చూస్తుంది. అతను గురించి అతనుే చెప్పుకున్న ఈ వాక్యాలు అతను శైలిని అవగతం చేస్తాయి:
నాకవిత్వం అంతా నా జీవితంలోని అనుభవాలమయం. లోకవ్యక్తిని కావ్యవ్యక్తి నయ్యాను. దశరథుణ్ణి గూర్చి బంధుజ్యేష్ఠుడన్నాను, వేయిపడగలలో "రామేశ్వరశాస్త్రి బంధుజ్యేష్ఠుడు" అన్నాను. ఎవరీ బంధుజ్యేష్ఠుడు? మా నాయనగారు. నీ చుట్టువున్న లోకంలో నీకు చెందని భావం ఏముంటుంది? ఈ భావాలు. ఈ అనుభవాలు నీ మనస్సుపై వేసిన ముద్రలలో నుండే నీ మాటలు దొర్లుకొనివస్తాయి. నీవు కవివయితే ఆ శబ్దము వ్యంజకమై కావ్యత్వాన్ని పొందుతుంది. కవివయితే నంటే ఏమిటి? కవియైనవాడు లోకాన్ని చూచే దృష్టివేరు వానికి కనిపించే లోకము అందరు చూచే లోకమే
పలుచని బురదలోపల మానిసిని జూచి
నెగచి యూకున దూకె నీటిపాము
వెలివడ్డ బొరియముంగలనిక్కి తెల్లబో
యెను కొంగ కెఱగాని యెండ్రకాయ
ఒడ్డున బురదలో గొడ్డు గిట్టలు దిగి
పడె జంఘదఘ్నమై పంటకాల్వ
జనుము చల్లుటకు తీసిన పాయ పాపట
చక్కదీగిచి దిద్దె సస్యలక్ష్మి
పలుచగా వేడియెక్కు బవళ్ళతోడ
బైరగాలి పొరల్ తడియారజొచ్చె
పగటి కుషసు నా నొప్పె నవార్షుకములు
కాఱులకు దొల్తగా శరత్కాల లక్ష్మి
తెలుగు ఋతువులలో ఈ పద్యం వ్రాసాను. నేను మా పల్లెలో చిన్ననాడు చూచిన దృశ్యాలు ఎవరూచూడలేదా? చూసేవుంటారు కాని చెప్పలేదు. శక్తి లేక చెప్పకపోవచ్చు లేక ఆ దృష్టి లేకచెప్పకపోవచ్చు. కనుక ఎవడు కవి? ఆ శక్తి, ఆ దృష్టి ఉన్నవాడు.[4]
Remove ads
పురస్కారాలు, సన్మానాలు
- 1934లో వేయిపడగలు నవలకు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బహుమతి
- 1935 డిసెంబరు 20న బందరు పౌర సన్మానం చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అధ్యక్షతన జరిగింది. ఆ సభలో విశ్వనాథ సత్యనారాయణకు కవిసమ్రాట్ బిరుదు లభించింది.
- 1942లో గుడివాడ పౌరులు గజారోహణ సన్మానం చేసారు.
- 1956 లో విజయవాడ, గుడివాడ, కరీంనగర్ లలో ఆయా పట్టణాల పౌరులు షష్టిపూర్తి సన్మానం చేసారు.
- 1957 లో ఢిల్లీ ఆంధ్రసంఘం సన్మానం, పురస్కారం
- 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్ష పదవి
- 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడు
- 1961లో మద్రాస్ ఆంధ్రమహాసభ సన్మానం, పురస్కారం
- 1963లో "విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
- 1963లో కలకత్తా వంగ సాహిత్య పరిషత్తు కిరీట సన్మానం
- 1965లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ "కళాప్రపూర్ణ"తో సన్మానించింది.
- 1967లో రాయలసీమ సాహితీ పరిషత్తు సన్మానం
- 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారంతో గౌరవించింది.
- 1971లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
- 1971లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
- జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో అతను "రామాయణ కల్పవృక్షము"నకు, జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించినపుడు, సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది.
- విశ్వనాథ సత్యనారాయణ బొమ్మ ఉన్న తపాలా బిళ్ళను 26-04- 2017 న విడుదల చేసారు.[7]
Remove ads
ప్రముఖ రచనలు
విశ్వనాథ సత్యనారాయణ చేసిన అనేక రచనలు 20వ శతాబ్ది తెలుగు సాహిత్యంలోని ఎన్నో సాహిత్య సిద్ధాంతాల్లో, వాదాల్లో కీలకమైన గ్రంథాలుగా నిలిచాయి.
పద్యకావ్యాలు
అతను తొలినాళ్ళలో వ్రాసిన గిరికుమారుని ప్రేమగీతాలు, కిన్నెరసాని పాటలు వంటి రచనల ద్వారా అతను భావకవుల్లో ముఖ్యునిగా పేరుపొందారు.`రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రిలతో పాటుగా విశ్వనాథ సత్యనారాయణ కూడా భావకవిత్వ రంగంలో ప్రముఖునిగా పేరొందారు. విశ్వనాథ రచించిన ఋతుసంహారం, తెలుగు ఋతువులు వంటి కావ్యాలలో అతను చేసిన తెలుగు నాట ఋతువుల సూక్ష్మమైన వర్ణనలు చాలా పేరుపొందాయి. భావకవిత్వంలో అతికొద్ది ఇతివృత్తమో, అసలు ఇతివృత్తమే లేకుండా కేవల ఖండకావ్యమో వ్రాయడం మరింత పెరగడం, నాజూకు దనంతో, ప్రతి పద్యమూ మాధుర్యంతో ఉండాలనే రీతులు ప్రాచుర్యం పొందడంతో విశ్వనాథ ఆ మార్గానికి దూరం కావడం జరిగింది. కథాంశం అత్యంత కీలకమని, కథను చెప్పడంలో వివిధ మలుపుల్లో అవసరమైనంత మేరకే ఏ చమత్కృతి అయినా రాణిస్తుందని విశ్వనాథ భావించేవారు, తదనుగుణమైన రచనలు చేసేవారు. నిజానికి తొలినాటి రచనలైనా ఈ పద్ధతిలో భావకవిత్వానికి ఎంతో భేదం ఉన్నాయి. కిన్నెరసాని పాటలు అమలిన శృంగారం వంటి భావకవితా లక్షణాలను కొంత కనబరిచినా, మౌలికమైన కథాంశ రాహిత్యం లేకపోవడంతో భావకవిత్వానికి అతను మార్గానికి సంబంధం లేదని విమర్శకులు భావించారు.[8] ఆపైన కాలంలో అతను చేసిన అనేకమైన పద్య రచనల్లో భక్తిరచనలు ముఖ్యమైనవి.
Remove ads
రచనల జాబితా
విశ్వనాథ సత్యనారాయణ రచనలు[9]:
నవలా సాహిత్యం
|
|
|
|
పద్య కావ్యాలు
|
|
|
|
నాటకములు
|
|
|
|
విమర్శలు
|
|
|
|
శతక సాహిత్యం
|
|
|
ఇతరములు
|
|
|
|
Remove ads
ఉదాహరణలు
- ఆంధ్ర పౌరుషము నుండి
-
- గోదావరీ పావనోదార వాపూర మఖిలభారతము మాదన్న నాడు
- తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
- పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెల్గు వాసించునాడు
- కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు
- అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి
- విమల కృష్ణానదీ సైకతములయందు
- కోకిలపుబాట పిచ్చుకగూండ్లు గట్టి
- నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
- రామాయణ కల్పవృక్షం నుండి
-
- ఉత్పలమాల
- ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా
- పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే
- హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ
- ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై
- విశ్వేశ్వర శతకము నుండి
- శార్దూలవిక్రీడితము
- మీ దాతృత్వమొ తండ్రి దాతృతమొ మీమీ మధ్య నున్నట్టి లా
- వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
- ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
- ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!
- కిన్నెరసాని పాటల నుండి
- నడవగా నడవగా నాతి కిన్నెరసాని
- తొడిమ యూడిన పూవు పడతిలా తోచింది
- కడు సిగ్గు పడు రాచకన్నెలా తోచింది
- బెడగు పోయిన రత్నపేటిలా తోచింది.
- కోకిలమ్మ పెళ్ళి నుండి
- చిలుక తల్లి మహాన్వయంబున
- నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
- కోకిలమ్మా తెలుగు పలుకూ
- కూడబెట్టినదీ
- మరొకటి
- తేటగీతి
- వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
- సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
- అంగనామణి పెండిలియాడి కూడ
- పాతచుట్టరికమునె రాపాడుచుండె
Remove ads
విశ్వనాథ గురించి
- తన శిష్యుని గురించి గురువు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ఇలా అన్నాడు
నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్
సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్ వవుత మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్
సాంప్రదాయవాది, ఛాందసుడు అనీ, "గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్" అనేవాడు అనీ విశ్వనాథ దృక్పథాన్ని విమర్శించిన అభ్యుదయ కవి శ్రీశ్రీ కూడా తెలుగు సాహిత్యంలో విశ్వనాథ యొక్క ఉత్కృష్ట స్థానానికి, ఛందస్సులేని ద్విపదతో ఒకవైపు విశ్వనాథ శైలిని నిరసిస్తూనే, నీరాజనం పట్టాడు.
మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద
ఇవి కూడా చూడండి
వివరణలు(నోట్స్)
- అతని ఆస్తిక్యమింతని యనఁగఁ గలదె
లేదనిన యూహ గలుగని సాదునకును
నట్టి తండ్రికిఁ బుత్రుల మైనయట్టి
మువ్వురము సర్వథా తండ్రి మూర్తిమేము (రామాయణ కల్పవృక్షము-అవతారిక) వంటి పద్యాల్లో స్వయంగా ఇలాంటి విషయాలు చెప్పుకున్నారు. - విశ్వనాథ సత్యనారాయణ ఆత్మకథలోనే కాక అనేకానేక పద్యాలలో తన గురువు చెళ్ళపిళ్ళ గురించి ఎన్నో విశేషాలు వెల్లడించారు. ముఖ్యంగా తన జీవిత సాఫల్యంగా భావించిన రామాయణ కల్పవృక్షం కావ్యం యొక్క అవతారికలోని తిరుపతి వేంకటేశ్వరులు.., తన యెద యెల్ల మెత్తన..., శిష్యవాత్సల్యంబు చెలువు తీర్చిన మూర్తివంటి ప్రఖ్యాత పద్యాలతో పాటుగా తనవంటి గొప్ప రసావతార మూర్తి శిష్యుడైనాడన్న భోగము నన్నయకూ, తిక్కనకూ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రికి దక్కినట్టుగా దక్కలేదన్న పద్యం అల నన్నయకు లేదు..కూడా వుంది.
వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
.......ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి(విశ్వనాథ సత్యనారాయణ:వరలక్ష్మీ త్రిశతి) వంటి పద్యాల్లో తన సమస్తమైన కవిత్వానికి తన మొదటి భార్య వరలక్ష్మి కారకురాలని, నీరసమైన తన తత్త్వాన్ని మార్చి గొప్ప కవిని చేసిందని పేర్కొన్నారు.నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు
Remove ads
చిత్రమాలిక
- జ్ఞానపీఠ పురస్కారం పైగల నామఫలకం
- విశ్వనాథ ఇంట
- విశ్వనాధ సత్యనారాయణకు బహుకరించిన పద్మభూషణ్ పతకం వారి ఇంట్లో ప్రదర్శించబడుతున్నది
- విశ్వనాథ సత్యనారాయణ ఇంటి ముందు గల ఇంటిపేరుఫలకం
- విశ్వనాథ సత్యనారాయణ ఇల్లు
- విశ్వనాథ అందుకున్న ఒకానొక జ్ఞాపిక
దృశ్యమాలిక
మూలాలు, వనరులు
బయటి లంకెలు, వనరులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads