హృతిక్ రోషన్
From Wikipedia, the free encyclopedia
Remove ads
హృతిక్ రోషన్ (జననం 1974 జనవరి 10) [1] ప్రముఖ భారతీయ సినీ నటుడు.[2] ఇప్పటివరకు 6 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. మీడియా ఆయనను భారత అత్యంత ఆకర్షణీయమైన నటునిగా పేర్కొంటుంటుంది.[3][4]
1980వ దశకంలో కొన్ని సినిమాల్లో బాలనటునిగా నటించిన హృతిక్, తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన కహో నా.. ప్యార్ హై (2000) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాలు అందుకున్నారు ఆయన. ఆ తరువాత ఫిజా (2000), మిషన్ కాశ్మీర్ (2000) వంటి సినిమాల్లో నటించిన ఆయన కభీ ఖుషీ కభీ గమ్ (2001) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు ఆయన. ఆ తరువాత కొంత కాలం విజయాలను అందుకోలేకపోయిన హృతిక్, సైన్స్ ఫిక్షన్ కోయీ.. మిల్ గయా (2003) సినిమాతో తిరిగి విజయాన్ని పొందారు. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. క్రిష్ (2006) సినిమా ఈ చిత్రానికి సీక్వెల్ గా నిర్మించినదే. ఆయన కెరీర్ లోని మూడవ ఫిలింఫేర్ పురస్కారం ధూమ్2 (2006) సినిమాతో అందుకున్నారు ఆయన. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నారు హృతిక్. చారిత్రక చిత్రం జోధా అక్బర్ (2008) సినిమాతో నాలుగో ఫిలింఫేర్ పురస్కారం కూడా అందుకున్నారు.[5] గుజారిష్ (2010) సినిమాలో అంగవైకల్యం ఉన్నవాడిగా చేసిన ఆయన నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. జిందగీ నా మిలేగీ దుబారా (2011), అగ్నిపథ్ (2012), క్రిష్ 3 (2013) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఆయన. అగ్నిపథ్, క్రిష్ 3 సినిమాలు బాలీవుడ్ లో అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల జాబితాలో నిలిచాయి. ఇటువంటి సినిమాలు ఆయనను బాలీవుడ్ లో ప్రముఖ హీరోగా నిలబెట్టాయి.
హృతిక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చారు. చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు హృతిక్. జస్ట్ డాన్స్ అనే డాన్స్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఆయన స్వంత దుస్తుల బ్రాండ్ ను కూడా ఆరంభించారు ఆయన.
Remove ads
కెరీర్
తొలినాళ్ళ నటనా జీవితం
దర్శక నిర్మాత, హృతిక్ తాత (తల్లికి తండ్రి) అయిన జే. ఓం ప్రకాష్ ఆయనను మొదట బాలనటునిగా సినిమాలో పరిచయం చేశారు. 6వ ఏట ఆశా (1980) సినిమాలో ఒక డ్యాన్స్ సన్నివేశాన్ని హృతిక్ కు తెలీకుండా, కనపడకుండా కెమెరాలు ఉంచి చిత్రించారు.[6] హృతిక్ ను చిన్నప్పుడు అదృష్టంగా భావించేవారు ఆయన కుటుంబంవారు. అందుకే సినిమాలు హిట్ అయ్యేందుకు డైలాగులు కూడా లేని చిన్న పాత్రలో అయినా నటించమనేవారట. అలా ఎన్నో సినిమాల్లో చెప్పుకోవడానికి కూడా లేనంత చిన్న పాత్రలు చేశారట. రాకేష్ రోషన్ నిర్మించిన ఆప్ కే దీవానే (1980) సినిమాలో రాం కరే అల్లా కరే పాటలోనూ, ఓం ప్రకాశ్ నిర్మించిన ఆస్ పాస్ (1981) సినిమాలో షేహర్ మే చర్చీ హై పాటలో ధర్మేంద్ర, హేమ మాలినీల మధ్య ప్రేమలేఖలు అందించే కుర్రాడిగా కనిపించారు ఆయన. ఆయన 11 ఏళ్ల వయసులో జే. ఓం ప్రకాశ్ దర్శకత్వం వహించిన బగవాన్ దాదా (1986) లో మొదటిసారి డైలాగు ఉన్న పాత్రలో నటించారు హృతిక్.[7][8]
స్కూల్, కాలేజీ చదువు అయిపోయిన తరువాత అమెరికాకు మాస్టర్స్ డీగ్రీ చదివేందుకు వెళ్లి వచ్చారు హృతిక్.[9] సినీ నిర్మాణంలో అన్ని అంశాలనూ నేర్చుకునేందుకు కింది పనుల నుంచీ అన్ని చేశారు ఆయన. నేల ఊడ్వడం దగ్గర నుంచీ మొదలుపెట్టి కథా చర్చలు, కెమెరా పని, దర్శకత్వం, ఎడిటింగ్ వంటి విభాగాల్లో పనిచేశారు. తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఖేల్ (1992), కోయ్లా (1997) సినిమాలకు అసిస్టెంటుగా పనిచేశారు హృతిక్.[10]
2000: మొదటి సినిమా
2000 జనవరి 14లో కహో... నా ప్యార్ హై సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు హృతిక్. నటి అమేషా పటేల్ తో కలసి నటించిన ఈ సినిమాకు తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హృతిక్ ద్విపాత్రాభినయం చేశారు. 620 మిలయన్ వసూళ్ళు సాధించిన ఈ చిత్రం భారీ హిట్ నమోదు చేసింది.[11] ఈ సినిమా 2000 సంవత్సరానికిగానూ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.[12] ఈ చిత్రం ఎన్నో అవార్డులు అందుకుంది. హృతిక్ నటనకు కూడా విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి.[13][14] ఎన్నో పత్రికలు హృతిక్ నటనను ప్రశంసిస్తూ వార్తలు వెలువరించాయి.[15][16] 2001లో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ, ఉత్తమ నటుడు పురస్కారాలను అందుకున్నారు హృతిక్.[17]
Remove ads
వ్యక్తిగత జీవితం
హృతిక్ ముంబైలో పంజాబీ హిందూ కుటుంబానికి చెందిన బాలీవుడ్ నటుడు రాకేష్ రోషన్, పింకీ దంపతులకు 1974 జనవరి 10న జన్మించారు. ఒక తాత (తండ్రికి తండ్రి) రోషన్ లాల్ బాలీవుడ్ సంగీత దర్శకుడు కాగా, మరో తాత (తల్లికి తండ్రి) ఓం ప్రకాశ్ దర్శక నిర్మాత. హృతిక్ అక్క సునయన. ఆయన పినతండ్రి రాజేష్ రోషన్ కూడా సంగీత దర్శకుడే. బాంబే స్కాటిష్ స్కూల్ లో చదువుకున్నారు హృతిక్.[18] ఆ తరువాత సిడెన్హం కళాశాల నుండి కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు ఆయన.[19]
ఒక ఇంటర్వ్యూలో హృతిక్ మాట్లాడుతూ తనకు చిన్నప్పుడు నత్తి సమస్య ఉండేదనీ, స్కూల్లో మౌఖిక పరీక్షలకు హాజరుకావడానికి ఇబ్బంది అయి చేయి విరగ్గొట్టుకోవడం, దెబ్బలు తగిలించుకోవడం, ఒంట్లో బాగోలేదు అని చెప్పడం వంటివి చేసి స్కూలు మానేసేవాణ్ణని వివరించారు. ఆ తరువాత ప్రతీరోజూ సాధన చేసి ఆ సమస్య నుంచీ బయటపడగలిగానని కూడా తెలిపారు.[20]
20 డిసెంబరు 2000న నటుడూ సంజయ్ ఖాన్ కుమార్తె సుసానే ఖాన్ ను వివాహం చేసుకున్నారు హృతిక్. ఆయన 12వ ఏట నుంచే సుస్సెన్నెతో పరిచయం ఉంది. వారి స్నేహితుల సర్కిల్ కూడా ఒకటే. కలసి పెరిగిన హృతిక్ సుసానే ఖాన్ పై ప్రేమను సిగ్గు వల్ల ఎప్పుడూ బయటకు చెప్పేవారు కాదట.[21] కానీ వారి పెళ్ళికి 4 ఏళ్ళ ముందు నుంచి వారిద్దరూ ప్రేమికులయ్యారు.[22] వీరికి హ్రీహాన్ (జననం 2006), హ్రిధాన్ (జననం 2008) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.[23][24]
హృతిక్ కుడి చేతికి రెండు బొటన వేళ్ళు ఉంటాయి.[25] ఆ వేలును సినిమాల్లో కనపడకుండా తీస్తారు కానీ కోయీ... మిల్ గయా సినిమాలో అది కీలకమైన విషయంగా ఉపయోగించుకున్నారు కాబట్టీ ఆ ఒక్క సినిమాలోనే చూపించారు.[26]
13 డిసెంబరు 2013న తమ 17ఏళ్ళ కాపురాన్ని ముగిస్తూ తానూ, తన భార్య సుసానే ఖాన్ విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు హృతిక్.[27][28][29] ముంబై లోని బాంద్రా కోర్టు 2014 నవంబరు 1న వారికి విడాకులు మంజూరు చేసింది.[30][31][32]
Remove ads
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads