బంగాళాఖాతం
బంగాళాఖాతం హిందూ మహాసముద్రపు ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ, వాయవ్య దిశల్లో భారతదేశం, ఉత్తరాన బంగ్లాదేశ్, తూర్పున మయన్మార్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. శ్రీలంక లోని సంగమన్ కందా కు, వాయవ్య కొన వద్ద ఉన్న సుమత్రా (ఇండోనేషియా) కూ మధ్య ఉండే రేఖ, బంగాళాఖాతానికి దక్షిణ సరిహద్దు. ఇది, అఖాతం అని పిలువబడే నీటి ప్రాంతాల్లో ప్రపంచంలో కెల్లా అతి పెద్దది. దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో దీనిపై ఆధారపడిన దేశాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో, బంగాళాఖాతాన్ని కళింగ సాగర్ అనేవారు. తరువాత బ్రిటిషు భారతదేశంలో, చారిత్రాత్మక బెంగాల్ ప్రాంతంలోని కలకత్తా రేవు, భారతదేశంలో బ్రిటిషు సామ్రాజ్యానికి ముఖద్వారం కావడంతో, ఆ ప్రాంతం పేరుతో ఇది బంగాళాఖాతంగా పిలవబడింది. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు బీచ్ అయిన కాక్స్ బజార్, అతిపెద్ద మడ అడవులూ బెంగాల్ పులికి సహజ ఆవాసమూ అయిన సుందర్బన్స్ బంగాళాఖాతం తీరం లోనే ఉన్నాయి.