దండవంకీ: ఇది దండచేయికి ధరించే ఆభరణము. ఇవి సాధారణంగా బంగారంతో తయారుచేస్తారు. కొన్నింటికి విలువైన రత్నాలు అతికిస్తారు. కొన్ని నాగుపాము ఆకారంలో చేస్తే మరికొన్ని సన్నని పట్టీ లాగా ఉండి వదులు చేసుకోవడానికి వీలుగా అమర్చబడి ఉంటుంది. ఎక్కువమంది దీనిని రవిక చేతులకుండే పట్టు అంచులు పైకి వచ్చేటట్లు ధరిస్తారు.
కాసులపేరు: ఇది సాధారణంగా కాసులు వరుసగా పేర్చినట్లుగా ఉండి గొలుసు మాదిరిగా తయారుచేసి మెడలో హారంగా ధరిస్తారు.
అందెలు: అందె (anklet, ankle chain, or ankle bracelet) ఒక విధమైన కాలి ఆభరణము. వీటిని ప్రాచీనకాలం నుండి ఈజిప్టు, భారతదేశాలలో స్త్రీలు ధరిస్తున్నారు. భారత సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో అందెలు తప్పనిసరిగా ధరించి నర్తించవలసివస్తుంది.
కడియం: కడియాన్ని కాళ్ళకు, చేతులకు కూడా వేసుకుంటారు. చేతులకు వేసుకునే వాటిని చేతి కడియాలు, కాళ్ళకు వేసుకునే వాటిని కాళ్ళ కడియాలు అని అంటారు. గతంలో ఈ కడియాలను స్త్రీలే కాక పురుషులు కూడా ధరించేవారు. రాగితో చేసిన కడియాలు ఆరోగ్య రీత్యా కూడా చాల మంది ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో వీటిని కంకణాలు అని కూడా అంటారు. కానీ చేతికి వేసుకునే వాటినే కంకణాలు అని అంటారు.