స్మార్ట్‌ఫోన్
From Wikipedia, the free encyclopedia
స్మార్ట్‌ఫోన్ అనేది మొబైల్ టెలిఫోన్, కంప్యూటింగ్ పనులను కలిపి చేసే పోర్టబుల్ పరికరం. బలమైన హార్డ్‌వేర్ సామర్థ్యాలు, విస్తృతమైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో ఇవి సాధారణ ఫీచర్ ఫోన్ల కంటే భిన్నంగా ఉంటాయి. వీటి లోని ఆపరేటింగ్ సిస్టమ్‌ల సాయంతో అనేక సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ ( మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా వెబ్ బ్రౌజింగ్‌తో సహా), మల్టీమీడియా పనులు (సంగీతం, వీడియో, కెమెరాలు, గేమింగ్‌తో సహా) చేస్తాయి. సాధారణ ఫోన్లలో ఉండే వాయిస్ కాల్స్, టెక్స్ట్ మెసేజింగ్ వంటి విధులు మామూలుగానే చేస్తాయి. స్మార్ట్ఫోన్లలో అనేక మెటల్-ఆక్సైడ్-సెమీకండక్టర్ (MOS) ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్‌లు ఉంటాయి. వీటిలో ఉన్న సెంసర్ల సాయంతో మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్లు, బేరోమీటర్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్ వంటి అనేక అప్లికేషన్లు పనిచేస్తాయి. స్మార్ట్ఫోన్లలో వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్‌లకు ( బ్లూటూత్, వై-ఫై, లేదా శాటిలైట్ నావిగేషన్ వంటివి) మద్దతు ఉంటుంది.
ప్రారంభ స్మార్ట్ఫోన్లు ప్రధానంగా ఎంటర్ప్రైజ్ మార్కెట్ వైపు దృష్టిపెట్టాయి. సెల్యులార్ టెలిఫోనీ అంశాన్ని కూడా చేర్చి, స్వతంత్ర వ్యక్తిగత డిజిటల్ అసిస్టెంట్ (PDA) పరికరాల స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసాయి. కానీ పెద్ద ఆకారం, తక్కువ బ్యాటరీ జీవితం, నిదానంగా ఉండే అనలాగ్ సెల్యులార్ నెట్‌వర్క్‌లు, ఇంకా పరిణతి చెందని వైర్లెస్ డేటా సేవలు వంటి కారణాల వల్ల ఇవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. MOS ట్రాన్సిస్టర్లు పరిమాణంలో మరింత చిన్నవై సబ్-మైక్రాన్ స్థాయిలకు చేరడం, మెరుగైన లిథియం-అయాన్ బ్యాటరీ రావడం, వేగవంతమైన డిజిటల్ మొబైల్ డేటా నెట్‌వర్క్‌లు, మొబైల్‌ను అనుమతించే మరింత పరిణతి చెందిన సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారాలు రావడం వగైరాలతో ఈ సమస్యలు పరిష్కారమై పోయాయి.
2000వ దశకంలో, NTT DoCoMo యొక్క i-మోడ్ ప్లాట్‌ఫారమ్, బ్లాక్‌బెర్రీ, నోకియా ల సింబియన్ ప్లాట్ఫార్మ్, విండోస్ మొబైళ్ళు మార్కెట్లో ఆదరణ పొందడం మొదలైంది. ఈ మోడల్‌లలో ఎక్కువగా QWERTY కీబోర్డులు లేదా రెసిస్టివ్ టచ్‌స్క్రీన్ ఇన్పుట్ ఉండేవి. ఈమెయిల్, వైర్లెస్ ఇంటర్నెట్ అవసరాన్ని అవి నొక్కిచెప్పాయి. 2000ల చివరలో ఐఫోన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను అనుసరించి, మెజారిటీ స్మార్ట్ఫోన్లు సన్నని, స్లేట్-వంటి ఫార్మ్ ఫ్యాక్టర్లతో వచ్చాయి. వీటికి పెద్ద, కెపాసిటివ్ స్క్రీన్లుంటాయి. భౌతిక కీబోర్డ్‌ల కంటే మల్టీ-టచ్ సంజ్ఞలకు మద్దతునిస్తాయి. కేంద్రీకృత స్టోర్ నుండి అదనపు అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోడానికి, లేదా కొనుక్కోడానికి, క్లౌడ్ స్టోరేజ్, సింక్రొనైజేషన్, వర్చువల్ అసిస్టెంట్లు అలాగే మొబైల్ చెల్లింపు సేవలను ఉపయోగించడానికీ వినియోగదారులకు వీలు కలిగించాయి. స్మార్ట్ఫోన్లు PDAలు, హ్యాండ్‌హెల్డ్/పామ్-సైజ్ PCలు, పోర్టబుల్ మీడియా ప్లేయర్లను (PMP) తొలగించి వాటి స్థానాన్ని ఆక్రమించాయి. [1] మెరుగైన హార్డ్‌వేర్, వేగవంతమైన వైర్లెస్ కమ్యూనికేషన్ (LTE వంటి ప్రమాణాల కారణంగా) స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ అభివృద్ధికి ఊతమిచ్చాయి. 2012 మూడవ త్రైమాసికంలో, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల స్మార్ట్ఫోన్లు వాడుకలో ఉన్నాయి. [2] 2013 ప్రారంభంలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఫీచర్ ఫోను [3] అమ్మకాల గణాంకాలను అధిగమించాయి.