జమ్మూ కాశ్మీరు (రాష్ట్రం)
భారతదేశంచే నిర్వహించబడే పూర్వ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia
Remove ads
జమ్మూ కాశ్మీరు (Jammu and Kashmir), /dʒəmmuː ənd kəʃmiːr/, కాశ్మీరీ:ज्वम त॒ कॅशीर, హిందీ:जम्मू और कश्मीर, ఉర్దూ:جموں و کشمیر) భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రముంది. 2019 వరకు లడఖ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా ఉండేది. 2019 ఆగస్టులో భారత పార్లమెంటు 2019 అక్టోబరు 31 నుండి లడఖ్ ను మరొక కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించింది.[1] జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో 20 జిల్లాల ఉన్నాయి.[2] గతంలో అంతర్భాగంగా ఉన్న లడఖ్ ప్రాంతాన్ని మరొక కేంద్రపాలిత ప్రాంతంగా విభజించారు. జమ్మూ కాశ్మీరు రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతానికి 90 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంలో రెండు విభాగాలున్నాయి.[2]
- జమ్ముూ విభాగం: ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పేరు "జమ్మూ ". జమ్ముూ నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం.ఈ విభాగంలో 10 జిల్లాలు ఉన్నాయి
- కాశ్మీరు విభాగం: హిమాలయాలకు, పీర్ పంజాల్ శ్రేణికీ మధ్య ఉన్న లోయని కాశ్మీరు సూచిస్తుంది. కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది.ఈ విభాగంలోని శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు. రాజకీయంగా ఇది చాలా వివాదాస్పదమైన ప్రాంతం. భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య రెండు యుద్ధాలకు కారణం. ఇప్పటికీ వేర్పాటు వాదం, ఉగ్రవాదం ఇక్కడ ప్రబలంగా ఉన్నాయి.ఈ విభాగంలో 10 జిల్లాలు ఉన్నాయి.
Remove ads
చరిత్ర
1586లో అక్బరు చక్రవర్తి సైన్యం "రాజా భగవాన్ దాస్" నాయకత్వంలో కాశ్మీరు పాలకుడు యూసుఫ్ ఖాన్‌ని ఓడించింది. ఆప్పుడు రాజా భగవాన్ దాస్ సోదరుడు "రామచంద్ర" ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడైనాడు. "కచవా జాట్" రాజపుత్ర జాతికి చెందిన అతను తమ కులదేవత "జమ్‌వాయి మాత" పేరుమీద "జమ్ము" నగరాన్ని స్థాపించాడు. ఇక్కడ స్థిరపడిన రాజపుత్రులను " డోగ్రా రాజపుత్రులు" అంటారు. దేవోత్పతన నాయక్ అంటే ఆలయాలను పడగొట్టే అధికారి అనే శాఖను ఏర్పాటు చేసిన ఏకైక భారతీయ పాలకుడు కాశ్మీరు రాజు హర్ష దేవుడు, కల్హణుడు రాసిన రాజతరంగిణి అనే గ్రంథంలో దేవోత్పతన నాయకుడనే ఉద్యోగి బాధ్యతలను వివరించాడు.

తరువాత 19వ శతాబ్దంలో రాజపుత్రులనుండి జమ్ముూ ప్రాంతం మహారాజా రంజిత్ సింగ్ పాలనలోకి వచ్చి, సిక్కు రాజ్యంలో భాగమయ్యింది. మళ్ళీ మహారాజా గులాబ్ సింగ్ నాయకత్వంలో ఇక్కడి అధికారాన్ని రాజపుత్రులు చేజిక్కించుకున్నారు. అతని కాలంలో కాశ్మీరు, లడక్, హుంజా, గిల్గిత్ ప్రాంతాలు కూడా జమ్మూరాజుల వశమయ్యాయి. 1947లో మహారాజా హరిసింగ్ భారతదేశంలో విలీనం చేస్తూ ఇచ్చిన ఒప్పందంతో జమ్ము కాశ్మీరు స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలో ఒక భాగమైంది.
భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999 (కార్గిల్) కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉంది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉంది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉంది.
భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "భారతదేశం ఆక్రమించిన కాశ్మీరు" అనీ, పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "స్వతంత్ర కాశ్మీరు" అనీ పాకిస్తాన్ వ్యవహరిస్తుంది.ఇక పాకిస్తాన్ అధీనంలోని కాశ్మీరు భాగాన్ని "పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు" అని భారతదేశం వ్యవహరిస్తుంది.
Remove ads
పరిపాలన

భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణం ప్రకారం జమ్ము-కాశ్మీరు రాష్ట్రానికి "ప్రత్యేక ప్రతిపత్తి" ఉంది. కాశ్మీరులోని ఒక వర్గం మరింత ప్రత్యేక అధికారాలు కావాలని వాదిస్తారు. కాశ్మీరులోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు -జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, భారత జాతీయ కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. చాలా కాలం కశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా నాయకత్వంతో కాశ్మీర్ రాజకీయాలు ముడివడి ఉన్నాయి. అతని అనంతరం అతని కుమారుడు ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి నాయకుడు. ప్రస్తుతం (2006లో) భారత జాతీయ కాంగ్రెస్, జమ్ము-కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది."ఒమర్ అబ్దుల్లా" తరువాత జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ అధినేత "ముఫ్తి మహమ్మద్ సయ్యిద్ " బీజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వం 2015 మార్చి 1 న బాధ్యతలు స్వీకరించారు. 2016 జనవరి 7 న ఆరోగ్యం విషమించడంతో మరణించారు.తరువాత ప్రభుత్వం ఏర్పడేంతవరకు గవర్నర్ పరిపాలనలో ఉంటుంది.
Remove ads
భౌగోళికం, వాతావరణం
జమ్ము-కాశ్మీరు నైఋతి భాగంలో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్య ప్రాంతంలో తేమతోకూడిన ఉష్ణ వాతావరణం ఉండగా, ఉత్తరభాగంలో వాతావరణం బాగా చల్లగా, తేమగా ఉంటుంది. కాశ్మీరు వాసుల జీవన విధానం అక్కడి భౌగీళిక, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మలచుకొన్నారు.
ఆర్ధిక వ్యవస్థ

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రపు స్థూల ఆదాయం ప్రగతి క్రింది పట్టికలో చూపబడింది. ప్రభుత్వ గణాంకాలు. (కోట్ల రూపాయలలో)
వ్యవసాయం, పశువుల పెంపకం జమ్ము-కాశ్మీరు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలు. పరిశ్రమలు ప్రస్తుతం చాలా కొద్ది, కాని క్రమంగా, వేగంగా వృద్ధిపొందుతున్నాయి. 1989కు ముందు (సాయుధపోరాటం పెచ్చుపెరగకముందు) పర్యాటకరంగం జమ్ము-కాశ్మీరు ఆర్థిక వ్యవస్థలో కీలకమైనదిగా ఉండేది. తీవ్రవాదం వల్ల ఈ రంగం బాగా దెబ్బతిన్నది. అయినా జమ్ము, లడఖ్‌లు పర్యాటకులను ఇప్పటికీ బాగా ఆకర్షిస్తున్నాయి.
కాశ్మీర్ బుర్ర (విల్లో) అనే జాతి చెక్కనుండి తయారు చేసే క్రికెట్ బ్యాటులు మంచి నాణ్యమైనవని పేరు. ఇంకా కాశ్మీరు కుంకుమ పువ్వు కూడా ప్రసిద్ధం. ఇందులో ఎక్కువభాగం ఎగుమతి జరుగుతున్నది.
Remove ads
సంస్కృతి


కాశ్మీరు జీవనవిధానంలో ప్రధాన లక్షణం, (మతంతో సంబంధం లేకుండా) శాంతి, నిదానం. వారి సహజీవన సంస్కృతివల్ల అన్ని మతాలు ఇరుగుపొరుగులో వర్ధిల్లాయి. ఉత్సవాలు, సంగీతం - ఇవి కాశ్మీరీలు అంతా కలసి పంచుకొనే సంప్రదాయాలు. ఆడ, మగల దుస్తులు రంగులమయం. కాశ్మీరు కవిత్వం, జానపదనృత్యాలు, హస్తకళలు బాగా వృద్ధి చెందాయి. వత్తల్ ప్రాంతంలో మగవారు చేసే "దుమ్హల్" నృత్యం, ఆడువారు చేసే "రోఫ్" నృత్యం బాగా పేరుపొందాయి.
'బుల్ బుల్ షా' అనే సూఫీసాధువు 'రించాన్' అనే బౌద్ధరాజును మహమ్మదీయ మతానికి మార్చడంతో కాశ్మీరులో ఇస్లాంమత ప్రభావం ఆరంభమైనదని చెప్పవచ్చును. కాశ్మీరులో ఇస్లాంమతాచరణలో సూఫీవిధానాలు బాగా ప్రబలంగా ఉన్నాయి. ఇది మిగిలిన దక్షీణ ఆసియాలోని ఇస్లాంమతాచారాలకంటె కాస్త భిన్నంగా కనిపిస్తుంది.
ఇంకా హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కూడా రాష్ట్రంలో గణనీయంగా ఉన్నాయి. ఉత్తరప్రాంతంలో కొద్దిమంది యూదు మతస్తులు ఉన్నారు. వీరు సిల్క్ రోడ్డు ద్వారా ఇజ్రాయిలు నుండి వలసవచ్చిఉండవచ్చును.
కాశ్మీరేతరులకు కాశ్మీరులో భూమి కొనుక్కొనే అవకాశం చట్టరీత్యా లేదు. కనుక ఈ సుందరప్రాంతంలో ఉండగోరిన పరాయి ప్రాంతపువారు "పడవటిళ్ళలో" (House Boats) ఉండటం ప్రత్యామ్నాయవిధానంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా బ్రిటిష్ వారికాలంలో సైనికులు ఈ పద్ధతిని అవలంబించారు. ఇది క్రమంగా కాశ్మీరు జీవనవిధానంలో ఒక అవినాభావ భాగమైంది. ఇప్పుడు చాలామంది కాశ్మీరీలు, కాశ్మీరేతరులు ఈ పడవటిళ్ళల్లో ఉంటారు.
Remove ads
జన విస్తరణ
కాశ్మీరులోయలో మతాల గణాంకాలు | |
ముస్లిములు | 95% |
హిందువులు, ఇతరులు | 4% |
జమ్ములో మతాల గణాంకాలు | |
ముస్లింలు | 28% |
హిందువులు | 66% |
సిక్కులు, ఇతరులు | 4% |
ముస్లింలు | 44% |
బౌద్ధులు | 50% |
హిందువులు, ఇతరులు | 5% |
జమ్ము-కాశ్మీరు మొత్తంలో సుమారు 70% ముస్లిములు. మిగిలినవారిలో బౌద్ధులు, హిందువులు, సిక్కులు ఉన్నారు. లడఖ్ ప్రాంతపు ప్రజలు ఇండో-టిబెటన్ జాతికి చెందినవారు. జమ్ము దక్షిణప్రాంత వాసులు తమ మూలాలు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలలో ఉన్నాయని చెప్పుకుంటారు. 1941 వరకు కాశ్మీరు మొత్తం జనాభాలో 15%వరకు హిందువులు ఉండేవారు. 1947లో హిందువుల జనసంఖ్య 2,00,000-4,50,000 మధ్య అంచనా.[3] 1990 తరువాత పెచ్చుపెరిగిన తీవ్రవాదం వల్ల, హిందువులపై దాడులవల్ల అధికభాగం హిందువులు కాశ్మీరుప్రాంతాన్ని వదలి వలసపోవలసి వచ్చింది. ఇప్పుడు (2006లో) మొత్తం హిందూజనాభా 5,000-15,000 మధ్య ఉంటుందని అంచనా.[4]
Remove ads
విభాగాలు
జమ్ము-కాశ్మీరులో మొత్తం 20 జిల్లాలు ఉన్నాయి. వాటిని జమ్మూ విభాగం 10 జిల్లాలు, కాశ్మీరు విభాగంగా 10 జిల్లాలు ఉన్నాయి.[5]
జమ్మూ విభాగంలోని జిల్లాలు
కథువా, జమ్మూ, సంబా, ఉధంపూర్, రియాసీ, రాజౌరీ, పూంఛ్, దోడా, రంబాన్, కిష్త్‌వార్
కాశ్మీరు విభాగంలోని జిల్లాలు
అనంతనాగ్, కుల్గాం, పుల్వామా, షోపియన్, బుద్గాం, గందర్బల్, బండిపోరా, బారాముల్లా, కుప్వారా, శ్రీనగర్,
పర్యాటక రంగం

కాశ్మీరును "భూతల స్వర్గం" అని అంటారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ దాల్ సరస్సు పైన పడవటింట్లోంచి చూస్తూ అక్కడి సౌందర్యానికి ముగ్ధుడై భూమిమీద స్వర్గం ఎక్కడైనా ఉంటే అది ఇక్కడే, ఇక్కడే అన్నాడు. కాశ్మీరులో ముఘల్ ఉద్యానవనాలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తాయి. ముఘల్‌ఉద్యానవనాలు, శ్రీనగర్, గుల్‌మార్గ్, పహల్‌గాఁవ్ - ఇవి కాశ్మీరులో ముఖ్యమైన పర్యాటక స్థలాలు.
భారతదేశంలో పర్యాటకులకు కాశ్మీరు అన్నింటికంటే ప్రధానగమ్యంగా ఉండేది. కాని ఇటీవల విజృంభించిన ఉగ్రవాద కార్యకలాపాలవల్లా, శాంతిభద్రతల సమస్యలవల్లా పర్యాటకులు బాగా తగ్గిపోయారు.
జమ్ము కాశ్మీర్ సంకల్ప దివస్
ఫిబ్రవరి 22 ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజు 1994 లో మన పార్లమెంటు ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అవిభాజ్య అంతర్భాగమని, దీనిని దేశం నుంచి వేరుచేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా గట్టిగా, అన్ని పద్ధతుల్లో అడ్డుకుంటామని తీర్మానించింది. అంతే కాదు. ఇది జమ్మూ కశ్మీర్ విషయంలో దేశం దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ తీర్మానం చేసినప్పుడు పీవీ నరసింహారావు ప్రధానమంత్రి. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నది బిజెపి. మజ్లిస్ సహా అన్ని పార్టీలూ ఈ తీర్మానాన్ని ఒక్క గొంతుకతో సమర్థించాయి.
ఈ తీర్మానంలో నాలుగు అంశాలున్నాయి. మొదటిది – జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం. దీన్ని వేరుచేసే ఏ ప్రయత్నాన్నైనా ఎన్ని పద్ధతుల్లో అడ్డుకుంటాం. రండవది భారతదేశపు ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక ఏకాత్మతను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొనే సంకల్పం, సామర్థ్యం భారత్ కు ఉంది. మూడవది – దురాక్రమణ ద్వారా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలనుంచి పాకిస్తాన్ వైదొలగాలి. నాలుగు – భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యాన్నీ భారత్ సహించదు.
Remove ads
కాశ్మీరు వివాదం, వేర్పాటువాదం, సాయుధ పోరాటం
1947 నాటికి జమ్మూ-కాశ్మీరు ముస్లిములు అధిక సంఖ్యలో ఉండి, హిందూరాజు పాలనలో ఉన్న రాజ సంస్థానం. భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి, దేశ విభజన జరిగినప్పుడు భారతదేశంలో చేరాలో, పాకిస్తాన్‌లో చేరాలో కాశ్మీరు రాజు నిర్ణయించుకొనలేకపోయాడు. స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజులకే పాకిస్తాన్ వాయవ్యప్రాంతపు పఠానుతెగలవారు సరిహద్దుదాటి కాశ్మీరులో ప్రవేశించారు. స్థానికులను ప్రేరేపించి కాశ్మీరును పాకిస్తాన్‌లో విలీనం చేయించాలని వారి వ్యూహం. అప్పుడు కాశ్మీరు సంస్థానానికి సైనికబలం లేదు. శాంతిభద్రతలు క్షీణించి, అరాచకం ప్రబలుతున్న సమయంలో కాశ్మీరు రాజు భారతదేశం సహాయం అర్ధించాడు. తరువాత కాశ్మీరును భారతదేశంలో విలీనం చేయడానికి నిర్ణయించాడు. తత్ఫలితంగా నేషనల్ కాన్ఫరెన్సు నాయకుడు షేక్ అబ్దుల్లా కాశ్మీరు రాష్ట్రనాయకుడయ్యాడు.

1948 జనవరిలో భారతసైన్యం కాశ్మీరులో ప్రవేశించి అరాచక మూకలను తరిమి, దానిని భారతదేశంలో భాగంగా చేసుకొంది. ఖంగుతిన్న పాకిస్తాన్ సైన్యం కాశ్మీరుపై దండెత్తింది. అప్పుడు జరిగిన మొదటి భారత-పాకిస్తాన్ యుద్ధం కొన్ని నెలలు తీవ్రంగా సాగింది. తరువాత జరిగిన యుద్ధవిరమణ ఒప్పందం ప్రకారం కొంత కాశ్మీరు భాగం పాకిస్తాన్ అధినంలో ఉండిపోయింది. ఈ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు అని భారతదేశంలో అంటారు. అదే భాగాన్ని ఆజాద్ కాశ్మీరు అని పాకిస్తాన్‌లో అంటారు.
1962లో జరిగి భారత-చైనా యుద్ధంలో కాశ్మీరు ఈశాన్యభాగమైన ఆక్సాయ్ చిన్ భాగాన్ని చైనా ఆక్రమించింది. ఇది కూడా భారతదేశంలో భాగమేనని భారతదేశపు వాదన.
అప్పటినుండి భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య వైరానికి కాశ్మీరు ప్రధానకారణం. ప్రపంచంరాజకీయాలలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధానికి దారితీయగల ప్రమాదం ఉన్నవాటిలో ఇదిఒకటి. ఇందుమూలంగా 1948లోను, 1965లోను భారత్-పాకిస్తాన్‌లమధ్య యుద్ధాలు జరిగాయి. (1971లో జరిగిన యుద్ధం బంగ్లాదేశ్ కారణంగా జరిగింది). మరల 1999లో కార్గిల్ ప్రాంతంలో జరిగిన సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి పోకుండా నిలువరించబడింది.
కానీ కాశ్మీరులో ఏ ప్రాంతాన్నైనా వివాదాస్పద ప్రాంతం అనిగాని, పాకిస్తాన్‌లో భాగం అనిగాని చూపే ప్రచురణను భారతప్రభుత్వం బహిష్కరిస్తుంది.[6]
1988-2000 మధ్య ఉగ్ర్రవాదం కాశ్మీరులో 45,000పైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ సంఖ్యను కొన్న సంస్థలు మరింత ఎక్కువని అంచనా వేస్తున్నాయి. 1990 నుండి పాకిస్తాన్‌ద్వారా శిక్షితులైన ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రబలాయి. అందువల్ల భారతసైన్యం కాశ్మీరులో నిరంతరంగా ప్రచ్ఛన్నయుద్ధం చేయవలసి వస్తుంది. సామాన్యులపై మిలిటరీవారి అత్యాచారాలగురించి తీవ్రమైన విమర్శలున్నాయి.[7].కాశ్మీర్ భారత్, పాకిస్థాన్‌లలో దేనికీ చెందకుండా, స్వతంత్రదేశంగా ఉండాలని లిబియా అధ్యక్షుడు గడాఫీ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో అన్నారు. (ఈనాడు 25.9.2009).
గిల్గిత్ - బాల్టిస్థాన్
కాశ్మీరులో భాగమైన గిల్గిత్-బాల్టిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్ 1947లో ఆక్రమించింది.ఇప్పటివరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది.ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్ చైనాకు అప్పగించింది.అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్ రవాణా మార్గంలో గిల్గిత్-బాల్టిస్థాన్ భూభాగం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడిన పార్టీలన్నింటినీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించడాన్ని భారత విదేశాంగ శాఖ తప్పు పట్టింది.పాకిస్థాన్‌లో పీఓకే విలీనాన్ని ఆమోదించని వారిని, వ్యతిరేక ప్రచారం నిర్వహించేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించవచ్చునన్న నిబంధన పీఓకే తాత్కాలిక రాజ్యాంగంలో ఉంది.జమ్మూ కాశ్మీర్ లో హిందూ మతస్తులని, ఉగ్ర వాదులు చంపుతున్నారు, గతంలో చాల మందిని 10,00,000 హిందూ మతస్తులని చంపినారు, ఉగ్ర వాదులుగా మారక పోతే ముస్లిం మతస్తులని కుడా చంపుతున్నారు . ముస్లిం మహిళలని రక్షణ లేదు.
Remove ads
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads