జింబాబ్వే క్రికెట్ జట్టు

From Wikipedia, the free encyclopedia

Remove ads

జింబాబ్వే పురుషుల జాతీయ క్రికెట్ జట్టు, పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహిస్తుంది. జింబాబ్వే క్రికెట్ (గతంలో జింబాబ్వే క్రికెట్ యూనియన్‌ అనేవారు) పర్యవేక్షిస్తుంది. ఈ జట్టును చెవ్రాన్స్ అని కూడా అంటారు. జింబాబ్వే 1992 నుండి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో పూర్తి స్థాయి సభ్యునిగా ఉంది. 2023 మే నాటికి జింబాబ్వే, టెస్ట్‌లలో 10వ స్థానంలో, వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డేలు)లో 11వ స్థానంలో, ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో (T20Iలు) 11వ స్థానంలోనూ ఉంది.

త్వరిత వాస్తవాలు మారుపేరు, అసోసియేషన్ ...
Remove ads

చరిత్ర

టెస్టు స్థాయికి చేరే ముందు

టెస్టు హోదా సాధించడానికి ముందే జింబాబ్వేకు జాతీయ క్రికెట్ జట్టు ఉంది.

కీలక అంశాలలు:

  • రోడేషియా దక్షిణాఫ్రికా దేశీయ క్రికెట్ టోర్నమెంట్, క్యూరీ కప్‌లో 1904 నుండి 1932 వరకు అప్పుడప్పుడు ప్రాతినిధ్యం వహించింది. ఆపై 1946 నుండి స్వాతంత్ర్యం వరకు క్రమం తప్పకుండా ప్రాతినిధ్యం వహించింది.
  • స్వాతంత్ర్యం తరువాత, దేశం మరింత అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించింది.
  • 1981 జూలై 21న, జింబాబ్వే ఐసిసిలో అనుబంధ సభ్యునిగా మారింది.
  • జింబాబ్వే 1983 క్రికెట్ ప్రపంచ కప్‌తో పాటు 1987, 1992 పోటీల్లో కూడా పాల్గొంది.

1983లో జింబాబ్వే తమ మొదటి ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో ఆరు మ్యాచ్‌లలో ఐదు ఓడిపోవడంతో వారి ఆట ముగిసింది. అయితే, ఆస్ట్రేలియాపై వారు ఆశ్చర్యకరంగా గెలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 60 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది, కెప్టెన్ డంకన్ ఫ్లెచర్ అత్యధికంగా 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఫ్లెచర్ 42 పరుగులకు 4 వికెట్లు తీసి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు, ఆస్ట్రేలియాను 7 వికెట్లకు 226 పరుగులకు పరిమితం చేశాడు, తద్వారా క్రికెట్ చరిత్రలో అద్భుతమైన అప్సెట్‌ను నమోదు చేశాడు. [10]

1987 ప్రపంచ కప్‌లో, జింబాబ్వే తమ ఆరు గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లలో ఓడిపోయింది, అయితే వారు న్యూజిలాండ్‌పై గెలవడానికి చాలా దగ్గరగా వచ్చారు. 50 ఓవర్లలో 243 పరుగుల విజయ లక్ష్యంతో వికెట్ కీపర్ -బ్యాట్స్‌మెన్ డేవిడ్ హాటన్ 142 పరుగులు చేశాడు. అయితే జింబాబ్వే ఆఖరి ఓవర్‌లో 239 పరుగులకు ఆలౌటై, మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది.[11]

1992 టోర్నమెంట్‌లో, జింబాబ్వే రౌండ్-రాబిన్ దశను దాటి ముందుకు సాగడంలో విఫలమైంది. వారి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడింటిలో ఓడిపోయింది, అయితే రెండు చెప్పుకోదగ్గ విజయాలు ఉన్నాయి. వారి మొదటి మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 312 పరుగుల అత్యధిక స్కోరును నమోదు చేసింది, ఇందులో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఆండీ ఫ్లవర్ అత్యధికంగా 115 పరుగులు చేశాడు. అయితే ఈ స్కోరును మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక జట్టు మూడు వికెట్ల తేడాతో ఛేదించింది. [12]


తమ చివరి మ్యాచ్‌లో, జింబాబ్వే, ఇంగ్లండ్‌తో తలపడింది. ఇంగ్లండ్ అప్పటికే సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 134 పరుగులకు ఆలౌటైంది. ఎడ్డో బ్రాండెస్ 21 పరుగులకు 4 వికెట్లు తీసాడు. గ్రాహం గూచ్‌ని మొదటి బంతికే అవుట్ చేసాడు. ఇంగ్లాండ్‌ను 125 పరుగులకు ఆలౌట్ చేసి, జింబాబ్వే తొమ్మిది పరుగుల విజయాన్ని అందుకుంది.

ఈ ఇరవై ప్రపంచ కప్ మ్యాచ్‌లే ఈ కాలంలో జింబాబ్వే ఆడిన అంతర్జాతీయ ఆటలు. [13]

1992–1996: టెస్టు స్థితి ప్రారంభ సంవత్సరాలు

1992 జూలైలో జింబాబ్వేకు ఐసిసి టెస్టు హోదాను మంజూరు చేసింది. ఆ సంవత్సరం అక్టోబరులో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా మొదటి టెస్టు మ్యాచ్ ఆడి, తొమ్మిదో టెస్టు దేశంగా అవతరించింది. [14]

ప్రారంభంలో జింబాబ్వే టెస్టు ప్రదర్శనలు బలహీనంగా ఉన్నాయి. వారికి టెస్టు హోదాను కాస్త ముందే ఇచ్చారేమో అనిపించింది. మొదటి 30 టెస్టు మ్యాచ్‌లలో, వారు 1995 ప్రారంభంలో పాకిస్తాన్‌పై స్వదేశంలో ఒకదానిని మాత్రమే గెలుచుకున్నారు.

అయితే వన్డే రంగంలో, అంత బలంగా లేకపోయినా, త్వరలోనే పోటీ ఇవ్వడం మొదలుపెట్టింది. ముఖ్యంగా, వారి ఫీల్డింగ్ సామర్థ్యానికి ప్రపంచ గౌరవం లభించింది.

1997–2002: స్వర్ణయుగం

జట్టుకు ఉన్న ఇబ్బందులు ఎలా ఉన్నప్పటికీ, వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్ ఆండీ ఫ్లవర్‌ను ఒక దశలో ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పరిగణించారు. ఈ యుగంలో, ఫ్లవర్ సోదరుడు గ్రాంట్, ఆల్‌రౌండర్లు ఆండీ బ్లిగ్నాట్, హీత్ స్ట్రీక్ (తరువాత జాతీయ కెప్టెన్‌గా నియమితులయ్యారు) వంటి ఆటగాళ్ళు కూడా ఉద్భవించారు. ముర్రే గుడ్విన్ కూడా ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్; అంతర్జాతీయ క్రికెట్‌ నుండి రిటైరయ్యాక, అతను ససెక్స్ తరఫున ఆడి, భారీ స్కోర్లు చేశాడు. 1994/95లో శ్రీలంకపై 266 పరుగులతో జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు సాధించిన డేవిడ్ హాటన్ మరో ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్. ఈ సమయంలో ప్రపంచ వేదికపై, కొంతకాలం కెప్టెనుగా చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కాంప్‌బెల్, లెగ్-స్పిన్నింగ్ ఆల్-రౌండర్ పాల్ స్ట్రాంగ్, ఎడ్డో బ్రాండెస్, పేస్ బౌలర్/ఓపెనర్ నీల్ జాన్సన్ ఇతర ముఖ్యమైన ఆటగాళ్ళు.

ఈ నాణ్యమైన ఆటగాళ్ల ప్రదర్శనతో, 1990ల చివరలో జింబాబ్వే జట్టు ఇతర దేశాలపై టెస్ట్‌లను గెలవడం ప్రారంభించింది. ఇందులో పాకిస్థాన్‌పై సిరీస్ విజయం కూడా ఉంది. దురదృష్టవశాత్తూ, అదే సమయంలో జింబాబ్వేలో రాజకీయ పరిస్థితులు క్షీణించాయి, ఇది జాతీయ జట్టు ప్రదర్శనలపై హానికరమైన ప్రభావాన్ని చూపింది.

జింబాబ్వే 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది, సూపర్ సిక్స్‌లలో ఐదవ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ కంటే తక్కువ నెట్ రన్-రేట్ ఉన్న కారణంగా మాత్రమే సెమీ-ఫైనల్ స్థానాన్ని కోల్పోయింది.

గ్రూప్ దశలో, జింబాబ్వే మూడు పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.[15] ఆ తరువాత, అప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టైన దక్షిణాఫ్రికాతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ నీల్ జాన్సన్ 76 పరుగులతో పోరాడారు. ప్రత్యుత్తరంలో దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 40 పరుగులకే కుప్పకూలింది. లాన్స్ క్లూసెనర్, షాన్ పొలాక్ అర్ధ సెంచరీలు చేయడంతో ఓటమి మార్జిన్‌ను 48 పరుగులకు తగ్గించారు. జింబాబ్వేపై దక్షిణాఫ్రికాకు ఇది మొదటి ఓటమి, జింబాబ్వే అత్యంత ప్రసిద్ధ విజయాలలో ఒకటి. నీల్ జాన్సన్ బంతితో అద్భుతంగా రాణించి మూడు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ టోర్నీ తర్వాత జాన్సన్ జింబాబ్వే తరఫున ఆడడం మానేశాడు.

ఈ కాలంలో జరిగిన వన్‌డే సిరీస్‌లలో జింబాబ్వే, టెస్టులు ఆడే దేశాలన్నిటినీ (ఆస్ట్రేలియా మినహా) ఓడించింది. 2000-2001లో న్యూజిలాండ్‌ను స్వదేశంలోను, విదేశంలోనూ ఓడించింది. ఈ జట్టు అనేక బహుళ-జాతీయ వన్డే టోర్నమెంట్‌లలో ఫైనల్స్‌కు కూడా చేరుకుంది.

2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే ఓడిపోయింది. 2004లో, కెప్టెన్ హీత్ స్ట్రీక్‌ను ZCU (ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్) తొలగించింది. జట్టు నిర్వహణ, ఎంపిక విధానాలలో రాజకీయ ప్రభావానికి వ్యతిరేకంగా 14 మంది ఇతర ఆటగాళ్లు జట్టు నుండి వాకౌట్ చేశారు. శ్రీలంక పర్యటన యథావిధిగా ముందుకు సాగింది. కానీ అంతర్జాతీయ స్థాయి లేని ఆటగాళ్ళు జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించడంతో ఈ పర్యటన విఫలమైంది. [16] [17] దీని కారణంగా, 2004లో జింబాబ్వే ఇకపై టెస్టు క్రికెట్ ఆడకూడదనే ఆంక్షను ZCU అంగీకరించింది, అయినప్పటికీ టెస్టు దేశంగా దాని హోదా ప్రభావితం కాలేదు. [18]

2005–2009: దిగజారుతున్న రాజకీయ పరిస్థితులు, ఆట క్షీణించడం, ఆటగాళ్ల వలస

అనేక మంది సీనియర్ ఆటగాళ్ల రాజీనామా తర్వాత పేలవమైన టెస్టు ప్రదర్శనల తర్వాత, జింబాబ్వే జట్టు ఐసిసి ప్రోత్సాహంతో 2005 చివరిలో దాని క్రికెట్ బోర్డు, జట్టును టెస్టు క్రికెట్ నుండి స్వచ్ఛందంగా సస్పెండ్ చేసింది.

2005 ప్రారంభంలో, హీత్ స్ట్రీక్ జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే జింబాబ్వేలో ఆపరేషన్ మురంబాత్స్వినాతో కూడిన రాజకీయ పరిస్థితి జింబాబ్వే జట్టుకు అంతరాయం కలిగించింది. విదేశీ పర్యటనల సమయంలో, ఆటగాళ్లు తమ దేశంలో దొరకని - లేదా చాలా ఖరీదైనవి - నిత్యావసరాలను కొనుగోలు చేస్తారని అనేవారు. మామూలుగా ఇతర పర్యటన బృందాలు సావనీర్‌లు కొనేవారు.

2005లో కుదిరిన ఒక ఒప్పందంతో చాలా మంది తిరుగుబాటుదారులు జింబాబ్వే జట్టు లోకి తిరిగి వచ్చారు.[19] అయితే, మార్చిలో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో జింబాబ్వే తమ రెండు టెస్టుల్లోనూ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడంతో పరిస్థితి మెరుగుపడలేదు. ఆగస్టులో న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు రోజుల్లోనే ఓడిపోవడంతో ఇది మరింత దారుణంగా మారింది. ఈ ప్రక్రియలో, జింబాబ్వే అవమానానికి గురైంది; టెస్టు చరిత్రలో (1952లో భారత్ తర్వాత) ఒకేరోజులో రెండుసార్లు ఔట్ అయిన రెండో జట్టుగా అవతరించింది. తర్వాత సెప్టెంబరులో స్వదేశంలో భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఓడిపోయింది. భారత్‌తో సిరీస్ తర్వాత స్ట్రీక్, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అసలే కష్టాల్లో ఉన్న జట్టుకు మరో దెబ్బ తగిలింది.

2005 నవంబరు నాటికి, ఆట నిర్వహణలో రాజకీయ జోక్యంతో కాంట్రాక్టు చర్చలపై జింబాబ్వే క్రికెట్‌తో ఆటగాళ్ళు మరోసారి వివాదంలో పడ్డారు. కొత్త కెప్టెన్ టాటెండా తైబు అంతర్జాతీయ క్రికెట్‌కు రాజీనామా చేశారు. అప్పటికి డౌగీ మారిల్లియర్, క్రెయిగ్ విషార్ట్, షాన్ ఎర్విన్ వంటి వారి నిష్క్రమణతో జట్టు మరింత బలహీనపడింది. వీరంతా నిరసనగా రిటైర్ అయ్యారు. స్థానిక క్రికెట్ అధికార గణంపై నిరాశ వ్యక్తం చేశారు.

2006 జనవరి నాటికి, 37 మంది జింబాబ్వే క్రికెటర్లకు బోర్డుతో ఉన్న ఒప్పందాలు ముగిసిన తర్వాత జింబాబ్వే క్రికెట్ నుండి తిరిగి చర్చల ప్రతిపాదనలేమీ అందలేదు. ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికపైకి తిరిగి రావాలనే ఆశంటూ ఉండాలంటే, ముందు జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ చింగోకా, ఓజియాస్ బువుట్‌లను పదవి నుండి తొలగించాలని ఈ ఆటగాళ్ల సంఘం డిమాండ్ చేసింది.

2006 జనవరి 6న, జింబాబ్వే ప్రభుత్వ విభాగమైన స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ కమిషన్, జింబాబ్వే క్రికెట్ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంది. సైన్యంలో బ్రిగేడియరు, ప్రభుత్వ స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ ఛైర్మనూ అయిన గిబ్సన్ మషింగైడ్జ్, "వారి జాతిదురహంకార ధోరణి, ప్రభుత్వ విధానం కాకుండా తమ స్వంత ఎజెండాలను కాపాడుకోవడం" కారణంగా బోర్డు డైరెక్టర్లలోని శ్వేతజాతీయులు, ఆసియన్లూ అందరినీ తొలగించామని చెప్పాడు.

జింబాబ్వేలో క్రికెట్‌లో కొత్త లీడింగ్ పార్టీగా తాత్కాలిక బోర్డు నియమించబడింది, పీటర్ చింగోకా కమిటీ అధిపతిగా నియమితులయ్యాడు. బవూటేతో చింగోకాకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా, అతను కూడా పదవిలో కూడా కొనసాగే అవకాశం ఉంది.

2006 జనవరి 18న, జింబాబ్వే క్రికెట్ ఏడాది పొడవునా టెస్టు క్రికెట్ ఆడకుండా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. [20] జింబాబ్వే కోచ్ కెవిన్ కుర్రాన్ మాట్లాడుతూ జింబాబ్వే తమ తదుపరి టెస్టును 2007 నవంబరులో వెస్టిండీస్‌తో ఆడాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపాడు.[21] జింబాబ్వే జాతీయ జట్టుకు తగినన్ని టెస్టు ప్రమాణాలు లేవని పరిశీలకులు భావించారు. పూర్తి స్థాయి సభ్యులతో మ్యాచ్‌లు ఆడితే ఆటలు ఏకపక్షంగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రమాణాలు మెరుగుపడే అవకాశం పెద్దగా ఉండదు. చాలా కాలంగా టెస్టు క్రికెట్‌లో 'విప్పింగ్ బాయ్స్'గా పరిగణించబడుతున్న బంగ్లాదేశ్, జింబాబ్వేపై మొదటి విజయాన్ని నమోదు చేసింది. 2011 ఆగస్టు 8న, హరారేలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఒకే టెస్టు మ్యాచ్ సిరీస్‌లో జింబాబ్వే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

దేశీయంగా, లోగాన్ కప్ పోటీలను – జింబాబ్వే లోని ప్రావిన్సుల మధ్య జరిగే ఫస్ట్-క్లాస్ పోటీ - ఒక శతాబ్దం క్రితం ప్రారంభమైన తరువాత మొదటిసారిగా 2006లో రద్దు చేసారు. (ప్రపంచ యుద్ధాలు జరిగిన కొన్ని సంవత్సరాలలో కప్ జరగలేదు). ఆట యొక్క ప్రమాణం చాలా పేలవంగా ఉంటుందని, జింబాబ్వే క్రికెట్‌కు బయట ఉన్న ఇమేజ్‌ మరింత ద్చెబ్బతినడానికి ఇది దోహదపడుతుందనీ భావించి ZC దీన్ని రద్దుచేసిందని విస్తృతంగా భావించారు. వన్-డే ట్రోఫీ అయిన ఫెయిత్‌వేర్ కప్ ను నిర్వహించారు. అందులోని ఆట క్లబ్ స్థాయి కంటే నాసిగా ఉందని పరిశీలకుల నుండి ఫిర్యాదులు వచ్చాయి. ప్రమాణాలలో ఈ దారుణమైన పతనానికి ప్రధాన కారణం ఆటగాళ్ళ నిష్క్రమణతో పాటు, జింబాబ్వే క్రికెట్‌లో అంతర్గత రాజకీయాలు కూడా కారణమే. జింబాబ్వే ఆర్థిక వ్యవస్థలో జరిగిన పతనం వల్ల కూడా ఆటలకు ప్రజలు చాలా తక్కువగా హాజరు కావడానికి దారితీసింది. ఆటగాళ్లకు ఎక్కువ కాలం జీతాలు కూడా అందలేదు.

మరింత హానికరమైన సంఘటనలో, మాజీ ఆటగాడు మార్క్ వెర్ములెన్, ZC కార్యాలయాలను తగలబెట్టడానికి ప్రయత్నించి, జింబాబ్వే క్రికెట్ అకాడమీ ప్రాంగణాన్ని ధ్వంసం చేసాడు. దాంతో అతను అరెస్టయ్యాడు. పెరుగుతున్న సాంఘిక, ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశంలో, అటువంటి సౌకర్యాలను తిరిగి నిర్మించుకోవడం చాలా కష్టం.

వెస్టిండీస్‌లో జరిగిన 2007 క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు, 2003 ప్రపంచ కప్ తర్వాత మాదిరిగానే ఆటగాళ్ల వలసలను ఆపడానికి, ఎంపిక చేసిన ఆటగాళ్లను కొత్త ఒప్పందంపై సంతకం చేయాల్సిందిగా కోరారు. వారు బయలుదేరడానికి ఒక వారం ముందు తనను కలవాలని జింబాబ్వే క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఒజియాస్ బువాట్‌, ఆటగాళ్లకు చెప్పారు. ఒప్పందంపై సంతకం చేయండి లేదా స్క్వాడ్ నుండి తొలగిస్తాం అని అల్టిమేటం ఇచ్చాడు. సలహాలు తీసుకునేంత సమయం ఇవ్వమని, వెంటనే నిర్ణయం తీసుకోవాలనీ ఆటగాళ్ళకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఒక ఆటగాడు, కాంట్రాక్ట్‌లలోని కొన్ని విషయాలపై స్పష్టత అవసరం అని తన సహచరులకు చెప్పాడు. అతన్ని తిరిగి బూటే కార్యాలయానికి పిలిపించి, ఇది తీసుకుంటే తీసుకో లేదంటే వదిలెయ్‌ అని హెచ్చరించాడు: ఈ ఆటగాడు ఆంథోనీ ఐర్లాండ్ అని తర్వాత వెల్లడైంది. [22] తాను స్నేహితులతో సంప్రదించాలనుకుంటున్నానని అతను బూటేకి చెప్పినప్పుడు, బూటే ఫోన్‌ తీసి సెలక్షన్ హెడ్ కెన్యన్ జిహెల్‌కి కాల్ చేసి, ఈ ఆటగాణ్ణి మార్చాలని చెప్పాడు. ఆ ఆటగాడు వెనక్కి తగ్గి, సంతకం చేశాడు.

జింబాబ్వే దయనీయమైన ఆర్థిక స్థితి వలన, ప్రపంచ కప్ నుండి రావాల్సిన నగదు ఇంకా రాని నేపథ్యంలో జింబాబ్వే క్రికెట్, సుమారు 1 మిలియను డాలర్ల రుణం తీసుకోవలసి వచ్చింది. ఆటగాళ్ళ ఫీజులు US డాలర్లలో చెల్లించడానికి బోర్డు అంగీకరించింది. ఆటగాళ్లకు ఒక్కో ప్రదర్శనకు US$2000 చెల్లించాలి. తీసిన వికెట్లు, చేసిన అర్ధశతకాల ఆధారంగా US$500 బోనస్‌లు చెల్లించాలి. గరిష్ట చెల్లింపు US$8000కి పరిమితం చేసారు. అయితే, వలసలను ఆపడానికి, నగదు నిర్వల కోసం, 2007 జూన్ వరకు రుసుములు చెల్లించలేదు. [23]

ZC బోర్డ్‌తో కొనసాగుతున్న సమస్యల కారణంగా కొంత మంది ఆటగాళ్లు తమ నష్టాలను తగ్గించుకుని తమ కెరీర్‌ను విదేశాల్లో ముగించుకోవాలనీ భావించారు: ఆంథోనీ ఐర్లాండ్, 2007లో గ్లౌసెస్టర్‌షైర్ తరపున ఆడేందుకు ఒప్పందాన్ని అంగీకరించాడు. ఓపెనర్ వుసి సిబాండా కూడా నిష్క్రమించాడు. మరింత మంది ఈ బాటలో నడిచారు.

2007 క్రికెట్ ప్రపంచ కప్‌లో జింబాబ్వే పేలవంగా ఆడింది. టెస్టులాడని దేశం, ఐర్లాండ్‌ను ఓడించడంలో కూడా విఫలమైంది.

కేప్‌టౌన్‌లో జరిగిన ట్వంటీ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాను జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఓడించింది. బ్రెండన్ టేలర్ ఫస్ట్-క్లాస్ వికెట్ కీపింగ్ (క్యాచ్, స్టంపింగ్, రనౌట్), 45 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేసి, జింబాబ్వేకు గెలుపు దారి చూపించాడు. అతడిని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించారు. ఆ తర్వాత వారు ఇంగ్లండ్‌తో 50 పరుగుల తేడాతో ఓడిపోయారు. అంటే ఇతర గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ను ఓడించిన తర్వాత వారి నెట్ రన్ రేట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండింటి కంటే తక్కువగా ఉన్నందున వారు మొదటి దశలోనే టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు.

2007 అక్టోబరులో, జింబాబ్వేలో క్రికెట్ స్థాయిని మెరుగుపరచడానికి క్రికెట్ సౌత్ ఆఫ్రికా చేసిన ప్రయత్నాలలో భాగంగా దక్షిణాఫ్రికాలో జరిగే మూడు దేశీయ పోటీలలో జింబాబ్వే పాల్గొంటుందని ప్రకటించడంతో, కొంత ప్రోత్సాహకర వాతావరణం కనిపించింది.[24]

అయితే, క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు సమావేశం వరకూ ఈ ప్రణాళికలు వాయిదా వేయడంతో పై పోటీలలో వారు పాల్గొనడం సందేహాస్పదంగా మారింది. [25] 2007 నవంబరు చివరిలో ఒక రాజీ కుదిరింది. జింబాబ్వే MTN డొమెస్టిక్ ఛాంపియన్‌షిప్, స్టాండర్డ్ బ్యాంక్ ప్రో 20 సిరీస్‌లలో పాల్గొనవలసి ఉంటుంది, తొలుత అనుకున్నట్లుగా సూపర్‌స్పోర్ట్ సిరీస్‌లో కాదు. [26] బదులుగా, వారు ఫ్రాంచైజీ, ప్రాంతీయ ఆటగాళ్లతో కూడిన దక్షిణాఫ్రికా కాంపోజిట్ XIతో మూడు నాలుగు-రోజుల ఫస్ట్-క్లాస్ గేమ్‌లు ఆడారు. పార్ల్, పోచెఫ్‌స్ట్రూమ్, కింబర్లీలో జరిగిన మూడు గేమ్‌ల లోనూ జింబాబ్వేయే గెలిచింది. [27]

ఆ గేమ్‌ల మధ్య, వారు వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌ను ఆడారు. ప్రారంభ మ్యాచ్‌లో గెలిచి, [28] 3-1తో సిరీస్‌ను కోల్పోయారు. వర్షం కారణంగా చివరి మ్యాచ్ రద్దయింది. [29]

Thumb
2009 జనవరి 23న ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్‌డే మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాళ్ళు డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు.

2010–2013: ఆర్థిక సమస్యల మధ్య మళ్ళీ టెస్టులు

వెస్టిండీస్ పర్యటనలో జింబాబ్వే ఒక వన్‌డే, ఒక T20I గెలిచింది. భారత్‌, శ్రీలంకలతో కూడిన ముక్కోణపు టోర్నీలో జింబాబ్వే ఫైనల్స్‌కు చేరుకుంది. వారు స్వదేశంలో 2-1తో ఓడించిన ఐర్లాండ్‌తో మినహా సంవత్సరంలో తమ మిగిలిన మ్యాచ్‌లను కోల్పోయారు.

జింబాబ్వే తమ ప్రపంచ కప్ 2011 ప్రచారాన్ని 2011 ఫిబ్రవరి 21న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాపై 91 పరుగుల ఓటమితో మొదలుపెట్టింది. 2011 మార్చి 4న న్యూజిలాండ్‌తో 10 వికెట్ల తేడాతో ఓడిపోయే ముందు కెనడాపై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. టోర్నమెంట్‌లో జింబాబ్వే చివరి గేమ్‌లో కెన్యాపై విజయం సాధించడానికి ముందు, శ్రీలంక, పాకిస్తాన్‌ల చేతుల్లో మరిన్ని భారీ పరాజయాలు పొందింది. ఈ పరాజయాల తర్వాత, ఎల్టన్ చిగుంబురా స్థానంలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ టేలర్‌ను 2011 జూన్ 24న అన్ని ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా ప్రకటించారు.

ఆరు సంవత్సరాల ప్రవాసం తర్వాత జింబాబ్వే, 2011 ఆగస్టు 4 న టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వచ్చింది. హరారేలో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌ ఆడింది. 130 పరుగుల తేడాతో గెలుపొంది జింబాబ్వే జట్టు, టెస్టు క్రికెట్‌ లోకి విజయంతో తిరిగి వచ్చింది. [30]

టెస్టుల్లోకి తిరిగి వచ్చే క్రమంలో భాగంగా జింబాబ్వే క్రికెట్, హరారే స్పోర్ట్స్ క్లబ్, ముతారే స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లబు పెద్దయెత్తున మెరుగుపరచనున్నట్లు ప్రకటించింది. [31] విక్టోరియా జలపాతం వద్ద కొత్త టెస్టు మైదానం కోసం ప్రణాళికలు కూడా వెల్లడయ్యాయి. [32] ZC దేశీయ పోటీలను స్పాన్సర్ చేయడానికి, మూడు సంవత్సరాల పాటు జాతీయ జట్టు కిట్‌లను తయారు చేయడానికి రీబాక్‌తో US$ 1 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. [33]

ఆ టెస్టు తర్వాత జింబాబ్వే, బంగ్లాదేశ్‌లు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడ్డాయి. జింబాబ్వే ఆ సీరీస్‌ను 3-2తో గెలిచి, 2006 తర్వాత టెస్టులాడే దేశంపై తమ మొదటి వన్‌డే సిరీస్ విజయాన్ని సాధించింది [34] [35]

పాకిస్థాన్ చేతిలో జింబాబ్వే అన్ని ఫార్మాట్లలో ఓడిపోయింది. దీని తర్వాత వారు న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్ ఆడారు. T20I సిరీస్‌లో వారు 2-0తో ఓడిపోయారు. వన్‌డే సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0తో ఆధిక్యంలో ఉంది. చివరి వన్డే బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతోంది. అప్పటికి వారు వరుసగా 12 మ్యాచ్‌ల పరాజయాలతో ఉన్నారు.

అంతేకాకుండా, మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది, జింబాబ్వేకు గెలిచే అవకాశం కనబడ్డంలేదు. జింబాబ్వేలు గతంలో ఎన్నడూ వన్డేల్లో 300కి పైగా స్కోరును ఛేజ్ చేయలేదు. కానీ, ఈసారి, చరిత్రలో మొదటిసారి, వాళ్ళది సాధించారు.

ఇన్నింగ్స్ విరామంలో జింబాబ్వే జట్టు ప్రధాన లక్ష్యం ఓడిపోయినా కాస్త పరువు దక్కించుకుని ఓడిపోవడం. ఓపెనర్ వుసి సిబాండా డకౌట్ అయినప్పుడు, అది కూడా సాధ్యం కాదనిపించింది, కానీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. అతను గత గేమ్‌లలో సాధించిన శతకాలకు కొనసాగింపు లాగా ఆడి, 75 పరుగుల అద్బుతమైన స్కోరు సాధించి, అవుటయ్యాడు.

టేలర్ ఔటైన తర్వాత, టాటెండా తైబు వేగంగా చేసిన అర్ధశతకం జింబాబ్వేను వేటలో నిలిపింది. అయితే, ఇద్దరు ఆల్ రౌండర్లు మాల్కం వాలర్, ఎల్టన్ చిగుంబురాలు మ్యాచ్‌ను మలుపుతిప్పిన భాగస్వామ్యం సాధించారు. వాలెర్ 99 * స్కోర్ చేసి, వన్‌డే చరిత్రలో గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. తన జట్టును గెలుపు గీతను దాటించే క్రమంలో, చివరికి, అతను తన సెంచరీ గురించి ఆలోచించలేదు. అతని నిస్వార్థమైన ఆట జింబాబ్వేకు చాలా అవసరమైన విజయాన్ని తెచ్చిపెట్టింది. అతని భాగస్వామి చిగుంబురా చురుగ్గా 47 పరుగులు చేసి ఔటయ్యాడు. కీగన్ మెత్ రెండు బంతుల తర్వాత డకౌట్ అయినా, వాలెర్ మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లకు చక్కటి మార్గనిర్దేశం చేసాడు. కొత్త ఆటగాడు న్జాబులో ఎన్‌క్యూబ్‌కు వాలర్, "'బ్యాటంటూ బంతికి తగిలితే చాలు, పరుగు తీసేద్దాం' అని సలహా ఇచ్చినట్లు చెబుతారు. వాళ్ళు చేసిన ఆ పరుగు, జింబాబ్వేకు ఐతిహాసిక విజయాన్ని అందించింది. అద్భుతమైన ఆటతీరుతో వాలర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కాగా, బ్రెండన్‌ టేలర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. [36] [37] [38]

న్యూజీలాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో జింబాబ్వే, విజయానికి చేరువగా వచ్చింది. తమ రెండో ఇన్నింగ్స్‌లో గెలవడానికి 366 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తున్న జింబాబ్వే, 3 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. టేలర్ 117 పరుగులు చేసాడు. కానీ ఇతర బ్యాటర్లు ఔఅటవడంతో న్యూజిలాండ్, 34 పరుగుల విజయాన్ని అందుకుంది. [39]

జింబాబ్వే 2012 జనవరి, ఫిబ్రవరిలలో న్యూజిలాండ్‌లో ఒక టెస్టు, మూడు-వన్‌డేలు, రెండు-T20I ల సిరీస్‌ కోసం పర్యటించింది. అయితే మొత్తం ఆరు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. [40] టెస్టులో మూడో రోజున రెండుసార్లు ఆలౌటయ్యారు - 51 (వారి అత్యల్ప టెస్ట్ స్కోరు), 143 పరుగులకు. ఇన్నింగ్స్, 301 పరుగుల తేడాతో ఓడిపోయారు. [41]

ఈ కాలంలో జింబాబ్వే ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. ICC రంగంలోకి దిగి ఆర్థిక సహాయం అందించాల్సి వచ్చింది. కానీ ద్రవ్య వినియోగం చర్చనీయాంశమైంది. [42] [43] జింబాబ్వే ఆటగాళ్లు చాలాసార్లు బహిష్కరిస్తామని బెదిరించారు. ఆటగాళ్ళ యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. [44] [45] జింబాబ్వే జట్టు స్పాన్సర్‌లను ఆకర్షించడానికి చాలా కష్టపడింది. ఇది దాని దేశీయ క్రికెట్‌ నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. Pro40 వంటి అనేక టోర్నమెంట్‌లను రద్దు చేయాల్సి వచ్చింది. అనేక ఫ్రాంచైజీలను రద్దు కూడా చేసారు. అనేక పర్యటనలను వాయిదా వేయడమో, రద్దు చేయడమో, లేదా టెలివిజన్ ప్రసారాలేమీ లేకుండా జరగడమో జరిగింది.[46][47]

2022 నుండి

గ్రూప్ Aలో, యునైటెడ్ స్టేట్స్, జింబాబ్వే రెండూ తమ మొదటి రెండు మ్యాచ్‌లలో గెలిచి టోర్నమెంట్ సెమీ-ఫైనల్‌లో తమ స్థానాలను భద్రపరచుకున్నాయి. 2022 ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించేందుకు నెదర్లాండ్స్, జింబాబ్వే టోర్నీ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆతిథ్య జింబాబ్వే ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను 37 పరుగుల తేడాతో ఓడించి టోర్నీని గెలుచుకుంది.

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 2022 జూలై, ఆగస్టుల్లో జింబాబ్వేలో పర్యటించి మూడు వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), మూడు ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌లు ఆడింది. తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. T20Iలలో జట్టుకు ఇది వరుసగా ఆరో విజయం. ఈ ఫార్మాట్‌లో వారి అత్యుత్తమ విజయం. జింబాబ్వే మూడవ T20Iని 10 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇది బంగ్లాదేశ్‌పై వారి మొదటి T20I సిరీస్ విజయం. వన్‌డే మ్యాచ్‌లలో కూడా 2-1 తేడాతో గెలిచింది. సికందర్ రాజా రెండు సిరీస్‌లలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ర్యాన్ బర్ల్ కూడా నసుమ్ అహ్మద్‌ వేసిన ఒక ఓవర్‌లో 34 పరుగుల రికార్డు చేసి, షకీబ్ అల్ హసన్ 2019లో చేసిన 30 పరుగుల రికార్డును మెరుగుపరిచాడు.

సిరీస్‌ను 3-0తో కోల్పోయినప్పటికీ, 3వ వన్‌డేలో భారత్‌పై మంచి పోరాటం చేసింది.

ఆస్ట్రేలియాతో జింబాబ్వే, 2-0తో మొదటి రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. అయితే 3వ చివరి వన్‌డేలో విజయం సాధించి ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరిచింది. ర్యాన్ బర్ల్ వన్‌డేలలో ఆస్ట్రేలియాపై జింబాబ్వే ఆటగాడు చేసిన అత్యుత్తమ బౌలింగ్‌తో 5/10 మళ్లీ సాధించాడు. ఇది యాదృచ్ఛికంగా ఆస్ట్రేలియా గడ్డపై వారి మొట్టమొదటి విజయం. సిరీస్‌ను 2-1తో ముగించింది. జింబాబ్వే కోచ్ డేవ్ హాటన్ జట్టు ప్రదర్శనకు సంతోషించాడు.

స్కాట్లాండ్, ఐర్లాండ్‌లపై విజయం, వెస్టిండీస్‌తో ఓటమి తర్వాత జింబాబ్వే 2022 T20 ప్రపంచ కప్‌లో సూపర్ 12కి అర్హత సాధించింది. సూపర్ 12 మొదటి గేమ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫలితం లేదు. రెండో గేమ్‌లో పాకిస్థాన్‌పై 1 పరుగు తేడాతో విజయం సాధించింది. [48]

Remove ads

అంతర్జాతీయ మైదానాలు

Thumb
బులవాయో అథ్లెటిక్ క్లబ్
బులవాయో అథ్లెటిక్ క్లబ్
ఓల్డ్ హరారియన్స్
ఓల్డ్ హరారియన్స్
హరారే స్పోర్ట్స్ క్లబ్
హరారే స్పోర్ట్స్ క్లబ్
క్వెక్వే స్పోర్ట్స్ క్లబ్
క్వెక్వే స్పోర్ట్స్ క్లబ్
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
Locations of all stadiums which have hosted an international cricket match within Zimbabwe
మరింత సమాచారం వేదిక, నగరం ...
Remove ads

ప్రస్తుత స్క్వాడ్

ఇది గత 12 నెలల్లో జింబాబ్వే తరపున ఆడిన లేదా ఇటీవలి టెస్ట్, వన్‌డే లేదా T20I జట్టులో తబ పేరు ఉన్న ఆటగాళ్ల జాబితా. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల పేర్లను వాలుగా ఇచ్చాం. 2023 ఫిబ్రవరి 12 నాటి డేటా.

మరింత సమాచారం పేరు, వయస్సు ...
Remove ads

కోచింగ్ సిబ్బంది

మరింత సమాచారం స్థానం, పేరు ...

ప్రముఖ ఆటగాళ్లు

అత్యుత్తమ విజయాలు లేదా మరొక ప్రాముఖ్యత/ప్రసిద్ధి కారణంగా ఆటగాళ్ళు ఇక్కడ చేర్చబడ్డారు. జింబాబ్వే క్రికెటర్ల పూర్తి జాబితా కోసం, వర్గం: జింబాబ్వే క్రికెటర్లు చూడండి.

Thumb
ఆండీ ఫ్లవర్
  • ఎడ్డో బ్రాండ్స్ – ఫాస్టు బౌలర్; వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి జింబాబ్వే. నిజానికి కోళ్ల రైతు; తర్వాత ఆస్ట్రేలియాలో కోచ్ అయ్యాడు.
  • అలిస్టర్ కాంప్‌బెల్ – మాజీ జాతీయ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్; తరువాత సెలెక్టర్ల నిర్వాహకుడు, కన్వీనర్.
  • కెవిన్ కుర్రాన్ – మాజీ ఆల్ రౌండర్, జింబాబ్వే కోచ్ (2005–2007). టామ్ కుర్రాన్, బెన్ కుర్రాన్, సామ్ కుర్రాన్ తండ్రి.
  • సీన్ ఎర్విన్ – క్రెయిగ్ అన్నయ్య. ప్రస్తుతం హాంప్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతోంది.
  • ఆండీ ఫ్లవర్ – వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, మాజీ జాతీయ కెప్టెన్, బ్లాక్ ఆర్మ్-బ్యాండ్ ప్రదర్శనకారుడు. ఒకప్పుడు టెస్టు క్రికెట్‌లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2009 నుంచి 2014 వరకు ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.
  • గ్రాంట్ ఫ్లవర్ – కౌంటీ క్రికెట్‌ను లీసెస్టర్‌షైర్, ఎసెక్స్‌ల తరపున ఆడాడు, రెండోది అన్నయ్య ఆండీతో కలిసి. 2010లో ఆడటం నుండి రిటైర్ అయ్యాడు. మొదట జింబాబ్వే, తరువాత పాకిస్తాన్‌కు, ప్రస్తుతం శ్రీలంకకు బ్యాటింగ్ కోచ్ అయ్యాడు.
  • డంకన్ ఫ్లెచర్ - మాజీ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అతను 1999-2007 వరకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కోచ్‌గా ఉన్నాడు. 2000ల ప్రారంభంలో టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు పునరుజ్జీవింపబడిన ఘనత పొందాడు.
  • ముర్రే గుడ్విన్ – సాలిస్‌బరీ (ఇప్పుడు హరారే)లో జన్మించాడు, అతను 1994లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. సస్సెక్స్, గ్లామోర్గాన్‌ల కోసం కౌంటీ క్రికెట్ ఆడాడు; 2014లో 71 ఫస్టు క్లాస్ సెంచరీలు చేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ససెక్స్‌కు బ్యాటింగ్ కోచ్.
  • గ్రేమ్ హిక్ – 17 సంవత్సరాల వయస్సులో 1983 ప్రపంచ కప్ జట్టు సభ్యుడు. 1986 వరకు జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్‌కు అర్హత సాధించాడు. 1991 నుండి 2001 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. వోర్సెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ లెజెండ్, అతని కోసం అతను తన 106 వందల 136 మొదటి తరగతులను సంకలనం చేశాడు.
  • డేవిడ్ హౌటన్ – మాజీ జాతీయ కెప్టెన్, జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు (266) సాధించాడు. తర్వాత డెర్బీషైర్‌కు శిక్షణ ఇచ్చాడు; ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్నాడు.
  • కైల్ జార్విస్ – మాల్కం కుమారుడు, ప్రతిభావంతుడైన ఫాస్టు బౌలరు. 2009 నుండి 2013 వరకు జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించాడు; 2017 సెప్టెంబరులో జింబాబ్వేకు తిరిగి రావడానికి ముందు కోల్‌పాక్ ఒప్పందంపై సంతకం చేసి లాంకషైర్‌కు ఆడాడు
  • నీల్ జాన్సన్ – శాలిస్‌బరీలో (ఇప్పుడు హరారే) జన్మించాడు. 1999 ప్రపంచ కప్‌లో తన దేశం కోసం బ్యాటింగు, బౌలింగూ రెండింటినీ ప్రారంభించిన ఆల్ రౌండరు. అతను మూడు మ్యాన్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. టోర్నమెంట్ యొక్క సూపర్ 6 దశకు జింబాబ్వే అర్హత సాధించడంలో ప్రభావం చూపాడు.
  • హామిల్టన్ మసకద్జా - ప్రతిభావంతులైన బ్యాట్స్‌మన్, మాజీ జాతీయ కెప్టెన్. 2001లో 17 ఏళ్ల వయసులో తన టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు; ఫస్ట్-క్లాస్ సెంచరీ చేసిన మొదటి నల్లజాతి జింబాబ్వే ఆటగాడు. ఒకే వన్‌డే సిరీస్‌లో (2009లో కెన్యాపై) 150 లేదా అంతకంటే ఎక్కువ రెండు స్కోర్లు చేసిన మొదటి బ్యాట్స్‌మన్.
  • హెన్రీ ఒలోంగా – త్వరిత బౌలర్, సంగీతకారుడు, బ్లాక్ ఆర్మ్-బ్యాండ్ ప్రదర్శనకారుడు. ఒలోంగా 1995లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి నల్లజాతి జింబాబ్వే.
  • ట్రెవర్ పెన్నీ – 1992 నుండి 2005 వరకు వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో అగ్రగామిగా మారడానికి ముందు జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించాడు. పదవీ విరమణ చేసినప్పటి నుండి, ఫీల్డింగ్ కోచ్‌గా (అతను రాణించిన కళ) అతనికి మంచి డిమాండు ఉంది. ప్రస్తుతం భారత జాతీయ జట్టుతో పనిచేస్తున్నాడు.
  • రే ప్రైస్ – స్పిన్ బౌలర్; 2004 తిరుగుబాటుకు ముందు, తరువాతా జింబాబ్వేకు క్రమం తప్పకుండా ప్రాతినిధ్యం వహించే కొద్దిమంది శ్వేతజాతీయుల ఆటగాళ్లలో ఒకరు. వోర్సెస్టర్‌షైర్ తరపున కౌంటీ క్రికెట్ కూడా ఆడారు.
  • పాల్ స్ట్రాంగ్ – బ్రయాన్ అన్నయ్య. స్పిన్ బౌలర్, ఆల్ రౌండర్, 1990ల మధ్య నుండి చివరి వరకు జింబాబ్వే ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు; ఆక్లాండ్ ఏసెస్ ప్రస్తుత కోచ్.
  • హీత్ స్ట్రీక్ – మాజీ జాతీయ కెప్టెన్. టెస్టులు, వన్‌డే క్రికెట్‌లో జింబాబ్వే తరపున ప్రముఖ వికెట్ టేకర్. తర్వాత జింబాబ్వే, బంగ్లాదేశ్‌లకు బౌలింగ్ కోచ్‌గా మారాడు.
  • తాటెండ తైబు – ప్రతిభావంతులైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్; 2004లో జింబాబ్వే యొక్క మొట్టమొదటి నల్లజాతి జాతీయ కెప్టెన్ అయ్యాడు. 20 ఏళ్ళ వయసులో అత్యంత పిన్న వయస్కుడైన టెస్టు కెప్టెన్, అతను 2016 నాటికి రికార్డును కలిగి ఉన్నాడు. 2012లో చర్చి కోసం క్రికెట్‌ను విడిచిపెట్టాడు గానీ 2016 లో సెలెక్టర్ల కన్వీనరుగా, డెవలప్‌మెంట్ ఆఫీసరుగా తిరిగి వచ్చాడు.
  • బ్రెండన్ టేలర్ – జింబాబ్వే ఒంటరైన తరువాతి కాలంలో, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడ్డాడు. వన్డే ఇంటర్నేషనల్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో సెంచరీలు కొట్టిన మొదటి జింబాబ్వే బ్యాట్స్‌మన్. మూడు మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌లో 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మన్. అతను 2015 ప్రపంచ కప్ తర్వాత నాటింగ్‌హామ్‌షైర్‌తో కోల్‌పాక్ ఒప్పందాన్ని ఎంచుకున్నాడు. 2017 సెప్టెంబరులో జింబాబ్వేకు తిరిగి వచ్చాడు.
  • చార్లెస్ కోవెంట్రీ – 2009లో బులవాయోలో బంగ్లాదేశ్‌తో జరిగిన 194ను సమం చేసిన తర్వాత, సచిన్ టెండూల్కర్ 2010లో దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా సచిన్ టెండూల్కర్ 200*తో అధిగమించే వరకు సయీద్ అన్వర్‌తో కలిసి కోవెంట్రీ వన్‌డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు.
  • జాన్ ట్రయికోస్ – గ్రీకు సంతతికి చెందినవాడు. ఈజిప్ట్‌లో జన్మించాడు. 1970లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. 1992లో జింబాబ్వే అరంగేట్రం చేసినప్పుడు ఎక్కువకాలం టెస్టులు ఆడిన రికార్డులను బద్దలు కొట్టిన ఖచ్చితమైన ఆఫ్-స్పిన్ బౌలర్. అంతర్జాతీయంగా రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించాడు గానీ, పుట్టినది ఆ రెండు దేశాల్లోనూ కాదు.
  • ప్రోస్పర్ ఉత్సేయ – స్పిన్ బౌలరు, మాజీ జాతీయ కెప్టెన్. వన్‌డేలలో రెండవ అత్యధిక వన్‌డే వికెట్లు తీసిన రెండో బౌలరు, వన్‌డేలో హ్యాట్రిక్ సాధించిన రెండవ జింబాబ్వే.
  • గై విట్టాల్ – ఆండీ విట్టాల్ బంధువు. ఆల్ రౌండరు, మాజీ కెప్టెన్.
  • గ్రేమ్ క్రీమర్ - లెగ్ స్పిన్ బౌలరు, కెప్టెన్. జింబాబ్వే తరపున టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో వికెట్ టేకర్.
  • స్టువర్ట్ కార్లిస్లే – మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్. అతను 10 సంవత్సరాలు జింబాబ్వే జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 111 వన్‌డేలు, 37 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.
  • ఎల్టన్ చిగుంబురా - ఫాస్టు బౌలింగ్ ఆల్ రౌండర్. జింబాబ్వే తరఫున వన్డేల్లో 100కి పైగా వికెట్లు, 4000కుపైగా పరుగులు సాధించాడు. జట్టుకు రెండుసార్లు కెప్టెన్‌గా ఉన్నాడు - మొదట 2010లో, తర్వాత 2014 నుండి 2016 వరకు. అలాగే 2 ప్రపంచ కప్‌లలో U19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే, అధిక స్ట్రైక్ రేట్‌తో ఆడే T20 బ్యాట్స్‌మన్
  • గ్యారీ బ్యాలెన్స్ - 2013 నుండి ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించే ముందు జింబాబ్వే U19 కోసం ఆడాడు. యార్క్‌షైర్ CCC కెప్టెన్.
  • కొలిన్ డి గ్రాండ్‌హోమ్ - న్యూజిలాండ్‌కు వెళ్లే ముందు 2004 ప్రపంచ కప్‌లో జింబాబ్వే U19కి ప్రాతినిధ్యం వహించాడు. అతను 2019 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడాడు. IPLలో కోల్‌కతా నైట్ రైడర్స్ & రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.
  • శామ్ కుర్రాన్ - ఇంగ్లండ్‌కు వెళ్లడానికి ముందు జింబాబ్వే U13కి ప్రాతినిధ్యం వహించాడు.
Remove ads

టోర్నమెంట్ చరిత్ర

ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్

మరింత సమాచారం క్రికెట్ ప్రపంచకప్ రికార్డు, సంవత్సరం ...

ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్

మరింత సమాచారం ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ రికార్డు, సంవత్సరం ...

ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్

1979 నుండి 2005 వరకు ఐసిసి ట్రోఫీ అని పిలుస్తారు.

మరింత సమాచారం ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ రికార్డు, సంవత్సరం ...

ఐసిసి పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ

మరింత సమాచారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డు, సంవత్సరం ...

పురుషుల కామన్వెల్త్ గేమ్స్

మరింత సమాచారం కామన్వెల్త్ గేమ్స్ రికార్డు, సంవత్సరం ...
Remove ads

రికార్డులు

అంతర్జాతీయ మ్యాచ్‌ల సారాంశం [49] [50] [51]

మరింత సమాచారం రికార్డ్ ప్లే చేస్తోంది, ఫార్మాట్ ...

చివరిగా అప్‌డేట్ చేయబడింది: 2023 జూలై 4

టెస్టు మ్యాచ్‌లు

  • అత్యధిక జట్టు మొత్తం: 563/9 డిక్లేర్డ్ v. వెస్టిండీస్, 27–31 జూలై 2001 హరారేలో [52]
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 266, డేవ్ హౌటన్ v. శ్రీలంక, 20–24 అక్టోబరు 1994 బులవాయోలో [53]
  • ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు: 341, ఆండీ ఫ్లవర్ (142, 199 నాటౌట్) v. దక్షిణాఫ్రికా, 7–11 సెప్టెంబరు 2001 హరారేలో
  • ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు: 8/109, పాల్ స్ట్రాంగ్ v. న్యూజిలాండ్, 12–16 సెప్టెంబరు 2000 బులవాయోలో [54]
  • ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు: 11/255, ఆడమ్ హకిల్ (6/109, 5/146) v. న్యూజిలాండ్, 25–29 సెప్టెంబరు 1997 బులవాయోలో [55]
మరింత సమాచారం ఆటగాడు, పరుగులు ...

ఇతర దేశాలతో పోలిస్తే టెస్టు రికార్డు

మరింత సమాచారం ప్రత్యర్థి, మ్యాచ్‌లు ...

వన్డే ఇంటర్నేషనల్‌లు

  • అత్యధిక జట్టు మొత్తం: 408/6 v. యునైటెడ్ స్టేట్స్, 2023 జూన్ 26 హరారేలో [59]
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 194 *, చార్లెస్ కోవెంట్రీ v. బంగ్లాదేశ్, 2009 ఆగస్టు 16 బులవాయోలో [60]
  • ఉత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు: 6/19, హెన్రీ ఒలోంగా v. ఇంగ్లాండ్, 2000 జనవరి 28 కేప్ టౌన్ వద్ద [61]
మరింత సమాచారం ఆటగాడు, పరుగులు ...

ఇతర దేశాల జట్లతో వన్‌డే రికార్డు

మరింత సమాచారం ప్రత్యర్థి, మ్యాచ్‌లు ...

ట్వంటీ20 ఇంటర్నేషనల్స్

  • అత్యధిక జట్టు మొత్తం: 236/5 v. సింగపూర్, 2022 జూలై 11 క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలో . [65]
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 94, సోలమన్ మిరే v. పాకిస్తాన్, 2018 జూలై 4 హరారేలో . [66]
  • ఉత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు: 4/8, సికందర్ రజా v. నెదర్లాండ్స్, 2022 జూలై 17 బులవాయోలో . [67]
మరింత సమాచారం ఆటగాడు, పరుగులు ...

ఇతర దేశాల జట్లతో టి20ఐ రికార్డు

మరింత సమాచారం ప్రత్యర్థి, మ్యాచ్‌లు ...

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads