తిరువణ్ణామలై
తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా లోని నగరం. From Wikipedia, the free encyclopedia
Remove ads
తిరువణ్ణామలై (బ్రిటీష్ రికార్డులలో త్రినోమలి లేదా త్రినోమలీ [2]) భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా లోని ఒక నగరం. ఇది తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ముఖ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా, తిరువణ్ణామలై జిల్లాకు పరిపాలనా కేంద్రంగా కూడా ఉంది. నగరంలో ప్రసిద్ధ అన్నామలైయార్ ఆలయం, అన్నామలై కొండ ఉన్నాయి. గిరివలం, కార్తికదీప ఉత్సవాలు ఈ నగరంలో జరుగుతాయి. ఇది భారతదేశం లోనే గణనీయమైన విదేశీ సందర్శకులను ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక కేంద్రం.[3] లోన్లీ ప్లానెట్‌లో ఉన్న నగరాలలో ఈ నగరం ఒకటి.[4] నగరం పరిధిలో చిల్లర వ్యాపార దుకాణాలు, విశ్రాంతి మందిరాలు, వినోద కార్యకలాపాలతో సహా అభివృద్ధి చెందుతున్న సేవా రంగ పరిశ్రమను కలిగిఉంది. సేవా రంగం కాకుండా, చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ [5] [6] స్పిన్నింగ్ మిల్లులు, ప్రధాన విద్యాసంస్థలతో సహా అనేక పారిశ్రామిక సంస్థలకు నగరం కేంద్రంగా ఉంది.[7] [8]ఈ నగర పరిపాలనను తిరువణ్ణామలై పురపాలక సంఘం నిర్వహిస్తుంది.దీని పురపాలక సంఘం 1886లో ఏర్పడింది.[9] ఈ నగరం రహదారులు, రైల్వే ప్రయాణ సౌకర్యం లాంటి మంచి సదుపాయాలు కలిగిఉంది.
Remove ads
వ్యుత్పత్తి శాస్త్రం, పురాణ కథనం
హిందూపురాణాల ప్రకారం, శివుని భార్య పార్వతి కైలాస పర్వతం మీద వారి నివాసంలో ఉన్న పూల తోటలో ఒకసారి సరదా కోసం తనభర్త కళ్ళు మూసింది. దేవతలకు ఒక్క క్షణం మాత్రమే అయినప్పటికీ, విశ్వం అంతా కాంతి క్షీణించి భూమి కొన్ని సంవత్సరాలు చీకటిమయమైంది. దాని నివారణ కోసం పార్వతి ఇతర శివ భక్తులతో కలిసి తపస్సు చేసింది. ఆమె భర్త అన్నామలై కొండల పైభాగంలో పెద్ద అగ్నిస్తంభంలా కనిపించి, ప్రపంచానికి తిరిగి వెలుగునిచ్చాడు.[10] అతను పార్వతితో కలిసి అర్ధనారీశ్వరుడుగా సగం స్త్రీ, సగం పురుషుడుగా శివుని రూపాన్ని ఏర్పరచాడు.[11] అన్నామలై, లేదా ఎర్రని పర్వతం, అన్నామలైయార్ దేవాలయం వెనుక ఉంది. దాని పేరుగల ఆలయంతో సంబంధం కలిగి ఉంది.[12] ఈ కొండ చాలాపవిత్రమైంది. లింగం లేదా శివుని రూప ప్రతిమ ప్రాతినిధ్యంగా పరిగణించబడుతుంది.[13]
మరొక పురాణం కథనం ప్రకారం ఒకసారి, విష్ణువు, బ్రహ్మ ఆధిపత్యం కోసం పోటీ పడుతుండగా, శివుడు జ్వాలగా కనిపించాడు. తన మూలాన్ని కనుగొనమని వారికి సవాలు విసిరాడు.[14] [15] బ్రహ్మ హంస రూపాన్ని ధరించి, జ్వాల పైభాగాన్ని చూడడానికి ఆకాశానికి వెళ్లాడు. విష్ణువు వరాహవతారముతో పాతాళంలో జ్వాల దిగువభాగానికి దాని స్థావరం కనుగొనటానికి వెళ్లాడు. ఈ దృశ్యాన్ని లింగోద్భవం అని పిలుస్తారు. చాలా శివాలయాల గర్భగుడి వద్ద పశ్చిమ గోడలో ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మ, విష్ణువు ఇరువురూ శివుని మూలాన్ని కనుగొనలేదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించగా, బ్రహ్మ శివుని శిఖరం కనుగొనినట్లు అబద్ధం చెప్పాడు. శివుడు దానికి శిక్షగా, బ్రహ్మకు భూమిపై దేవాలయాలు ఉండకూడదని ఆదేశించాడు. ఇది ఒక పురాణ కథనం.[14]
తమిళంలో అరుణం అనే పదానికి ఎరుపు లేదా అగ్ని అని అర్ధం.అచలం అంటే కొండ అని అర్థం.ఈ ప్రదేశంలో శివుడు అగ్ని రూపంలో వెలిశాడు కాబట్టి, అన్నామలై కొండ అని, ఆలయ క్షేత్రానికి అరుణాచలం అనే పేరు వచ్చింది.[15] అన్నామలై మొదటి ప్రస్తావన ఇది ఏడవ శతాబ్దపు అప్పర్, తిరుజ్ఞానసంబందర్లచే తమిళ శైవ కానానికల్ రచన తేవరంలో కనుగొనబడింది.[16]
Remove ads
చరిత్ర
తిరువణ్ణామలై చరిత్ర అన్నామలైయార్ ఆలయం చుట్టూ తిరుగుతుంది. ఆలయంలోని చోళ శాసనాలలో నమోదు చేయబడిన చరిత్ర ప్రకారం తిరువణ్ణామలై నగరం తొమ్మిదవ శతాబ్దానికి చెందిందని తెలుస్తుంది.[15] [17] తొమ్మిదవ శతాబ్దానికి ముందు చేసిన మరిన్ని శాసనాలు పల్లవ రాజుల పాలనను సూచిస్తాయి. దీని రాజధాని కాంచీపురం.[18] ఏడవ శతాబ్దపు నాయనార్ సాధువులు సంబందర్, అప్పర్ వారి కవితా రచన తేవారంలో ఈ దేవాలయం గురించి రాశారు. 'పెరియపురాణం రచయిత సెక్కిజార్, అప్పర్ సంబందర్ ఇద్దరూ ఆలయంలో అన్నామలైయార్‌ను పూజించారని రాసారు.[16] చోళ రాజులు సా.శ. 850 నుండి సా.శ.1280 వరకు నాలుగు శతాబ్దాలకు పైగా ఈ ప్రాంతాన్ని పాలించారు. వారే ఈ ఆలయ పోషకులుగా పనిచేసారు. చోళరాజు నుండి వచ్చిన శాసనాలు రాజవంశం, వివిధ విజయాలను గుర్తుచేస్తూ ఆలయానికి భూమి, గొర్రెలు, ఆవులు, నూనె వంటి వివిధరకాలైన సామాగ్రి, బహుమతులుగా ఇచ్చినట్లు నమోదు చేసారు.[14]
హొయసల రాజులు 1328లో తిరువణ్ణామలైని తమ రాజధానిగా చేసుకుని పాలించారు, కర్ణాటకలో వారి సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానులచే విలీనం చేయబడింది. సా.శ.1346 వరకు దక్కన్‌లోని మదురై సుల్తానులు, సుల్తానేట్ గవర్నర్‌ల దండయాత్రలను ఎదుర్కొన్నారు.[15] [19] సంగమ రాజవంశం (1336-1485) నుండి 48 శాసనాలు, సాళువ రాజవంశం (1485-1405) నుండి రెండు శాసనాలు,విజయనగర సామ్రాజ్యంలోని తుళువ రాజవంశం (1505-1571) నుండి 55 శాసనాలు ఉన్నాయి. ఇవి వారి పాలకుల నుండి ఆలయానికి బహుమతులు అందించినట్లు తెలుపుచున్నాయి.[20] అత్యంత శక్తివంతమైన విజయనగర చక్రవర్తి కృష్ణదేవ రాయలు (1509–1529) పాలనలోని శాసనాలు ఉన్నాయి. ఇవి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు సూచిస్తున్నాయి. [18]Mack 2008, pp. 88–90</ref> విజయనగర శాసనాలు చాలా వరకు తమిళంలో రాసిఉన్నాయి. కొన్ని కన్నడం, సంస్కృతంలో రాసి ఉన్నాయి.[21] విజయనగర రాజుల నుండి వచ్చిన ఆలయంలోని శాసనాలు పరిపాలనా వ్యవహారాలు, స్థానిక సమస్యలపై ప్రాధాన్యతని సూచిస్తాయి. ఇవి తిరుపతి వంటి ఇతర దేవాలయాలలో అదే పాలకుల శాసనాలకు భిన్నంగా ఉన్నాయి. బహుమతికి సంబంధించిన శాసనాలలో ఎక్కువ భాగం భూదానాలకు సంబంధించినవి, ఆ తర్వాత వస్తువులు, నగదు దానం, ఆవులు, దీపాలను వెలిగించడానికి నూనె ఉన్నాయి.[18] విజయనగర సామ్రాజ్యం సమయంలో తిరువణ్ణామలై నగరం ఒక వ్యూహాత్మక కూడలిలో ఉంది. ఇది పవిత్ర యాత్రా కేంద్రాలను, సైనిక మార్గాలను కలిపేనగరంగా పనిచేసింది.[22] మదురై వంటి నాయక్ పాలించిన నగరాల మాదిరిగానే ఆలయం చుట్టూ నగరం అభివృద్ధి చెందడంతో, పూర్వకాలానికి ముందు ఈ ప్రాంతాన్ని పట్టణ కేంద్రంగా చూపించే శాసనాలు ఉన్నాయి.[22] [23]
సా.శ.18వ శతాబ్దంలో తిరువణ్ణామలై కర్ణాటక నవాబు ఆధీనంలోకి వచ్చింది. మొఘల్ సామ్రాజ్యం ముగియడంతో, 1753 తర్వాత గందరగోళం ఏర్పడి, నవాబ్ నగరంపై పట్టు [10] కోల్పోయాడు.ఫ్రెంచ్ వారు 1757లో నగరాన్ని ఆక్రమించారు. 1760 [14] లో బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. 1782 నుండి 1799 వరకు పాలించిన టిప్పుసుల్తాన్ 1790లో తిరువణ్ణామలై నగరాన్నిస్వాధీనం చేసుకున్నాడు.[10] 19వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో నగరం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. [14]
Remove ads
భౌగోళిక శాస్త్రం

తిరువణ్ణామలై నగరం రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 196 కి.మీ. (122 మై.), బెంగళూరు నుండి 210 కి.మీ. (130 మై.) దూరంలో ఉంది. అన్నామలై కొండ సుమారు 2,669 అ. (814 మీ.) ఎత్తు ఉంది.[24] తిరువణ్ణామలై నగరం సగటున సముద్ర మట్టానికి 200 మీటర్లు (660 అ.) ఎత్తులో, 12°N 79.05°E అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది. ఈ నగరం తూర్పు కనుమలకు తూర్పున ఉంది. తిరువణ్ణామలై స్థలాకృతి పశ్చిమం నుండి తూర్పుకు దాదాపు సాదావాలుగా ఉంటుంది. ఉష్ణోగ్రత కనిష్టంగా 20 °C (68 °F) నుండి గరిష్టంగా 40 °C (104 °F) వరకు ఉంటుంది.రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే, ఏప్రిల్ నుండి జూన్ వరకు వేడిగానూ, డిసెంబరు నుండి జనవరి వరకు చలిగానూ ఉంటుంది. తిరువణ్ణామలైలో ఏడాదికి సగటున 815 mమీ. (32.1 అం.) వర్షపాతం ఉంటుంది. ఇది రాష్ట్ర సగటు 1,008 mమీ. (39.7 అం.) కంటేతక్కువ.నైరుతి రుతుపవనాలు జూన్‌లో ప్రారంభమై ఆగస్టు వరకు తక్కువ వర్షపాతం ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల సమయం అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. నగరం సగటు తేమ 77% ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు వేసవి నెలలలో, తేమ 47% నుండి 63% వరకు ఉంటుంది. పురపాలక సంఘ పరిధి 16.3 కి.మీ2 (1,630 హె.) విస్తీర్ణం కలిగిఉంది.[25] [26]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తిరువణ్ణామలైలో 1,45,278 జనాభా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 1,006 స్త్రీల లింగనిష్పత్తి ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ [27] మొత్తం జనాభాలో 15,524 మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు. వారిలో 7,930 మంది పురుషులు కాగా, 7,594 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 12.37% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 1.22% ఉన్నారు. నగర సగటు అక్షరాస్యత 78.38% ఉంది. ఇది జాతీయ సగటు 72.99% కంటే ఎక్కువ ఉంది.[27] నగరంలో మొత్తం 33,514 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 50,722 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 583 మంది సాగుదారులు, 580 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 994 మంది గృహ పరిశ్రమలు, 44,535 మంది ఇతర కార్మికులు, 4,030 సన్నకారు కార్మికులు, 84 సన్నకారు రైతులు, 105 మంది ఉపాంత వ్యవసాయదారులు, 40 మంది సామాన్య కార్మికులు, 42 మంది ఉపాంత కార్మికులు, 4 మంది ఇతర కార్మికులు ఉన్నారు.[28] 2011 మతగణన ప్రకారం, తిరువణ్ణామలైలో 82.57% హిందువులు, 14.07% ముస్లింలు, 2.79% క్రైస్తవులు,0.01% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.4% జైనులు, 0.13% మంది ఇతర మతాలను అనుసరించేవారు, 0.1% మంది మత ప్రాధాన్యత అనుసరించనివారు ఉన్నారు.[29]
Remove ads
ఆర్థిక వ్యవస్థ
నగర పరిసర ప్రాంతాలకు వాణిజ్య కార్యకలాపాలకు తిరువణ్ణామలై సేవా నగరం. తిరువణ్ణామలై జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం కావడంతో నగరంలో తృతీయ రంగ కార్యకలాపాలు చాలాఉన్నాయి. వాణిజ్యం, వాణిజ్య సేవా కార్యకలాపాలు నగర ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడుతున్నాయి. 1991లో జనాభాలో 7.93% ప్రాథమిక రంగంలో, 21.34% ద్వితీయరంగంలో, 70.73% తృతీయరంగ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. నగరంలో 11% మహిళల పని భాగస్వామ్యం ఉంది. 1971 నుండి పట్టణీకరణ కారణంగా, ప్రాథమిక రంగ కార్యకలాపాలు తగ్గిపోయాయి. తృతీయ రంగ కార్యకలాపాలలో దామాషా పెరుగుదల ఉంది. నగర పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు పరిమితంగా ఉన్నాయి. ద్వితీయ రంగం తయారీ, నిర్మాణాన్ని కలిగిఉంది. దీని వృద్ధి దశాబ్దాలు నుండి స్థిరంగా ఉంది. తిరువణ్ణామలై నగర పరిధిలో అనేక చమురు మిల్లులు, బియ్యం మిల్లులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. నగరానికి పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య కారణంగా వాణిజ్యం, రవాణా, సరుకు నిల్వ, సమాచార సౌకర్యాలు, ఇతర సేవలు తృతీయ రంగ కార్యకలాపాలు పెరిగాయి. నగరంలోని అరుణాచల గిరిప్రదక్షిణ ఆదరణకు, నగరం చుట్టూ అనధికారిక ఆర్థిక కార్యకలాపాలను పెంచింది. [30] [31] [32]ప్రధాన వాణిజ్య కార్యకలాపాలు కార్ బజారు, తిరువూడల్ బజారు,కాదంబరాయన్ బజారు, అసలియమ్మన్ కోయిల్ బజారు, శివన్‌పాద బజారు, పోలూరు మార్గం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. [33]
Remove ads
సంస్కృతి

అన్నామలైయార్ ఆలయం తిరువణ్ణామలైలో అత్యంత ప్రముఖమైన మైలురాయి. ఆలయ సముదాయం 10 హెక్టార్ల (25 ఎకరాలు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ఇది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. [34] ఇది గోపురాలు అని పిలువబడే నాలుగు ప్రధాన దర్వాజా బురుజులను కలిగిఉంది. అందులో తూర్పు గోపురం, 11 అంతస్తులతో 66 మీ (217 అడుగులు) ఎత్తు కలిగి,భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురాలలో ఇది ఒకటిగా నిలిచింది.[34] ఆలయ సముదాయంలో అనేక మందిరాలు ఉన్నాయి. ఇందులో అన్నామలైయార్, ఉన్నములై అమ్మన్ అత్యంత ప్రముఖమైన దేవాలయాలు. విజయనగర కాలంలో నిర్మించిన వేయిస్తంభాల మందిరం చాలా ముఖ్యమైంది.[35] [36]

అన్నామలైయార్ ఆలయం పంచభూత స్థలాలలో ఒకటి. ఇవి ప్రతి ఒక్కటి సహజ మూలకం అభివ్యక్తికి సూచికలు. అవి భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని.[37] అన్నామలైయార్ ఆలయంలో శివుడు తనను తాను ఒక భారీ అగ్నిస్తంభముగా అభివర్ణించాడని చెబుతారు. దీని కిరీటం,పాదాలను హిందూ దేవతలు బ్రహ్మ,విష్ణువు కనుగొనలేకపోయారు.[38]ఆతర స్థల శివాలయాలు, ఇవి మానవ శరీర నిర్మాణ శాస్త్రం తాంత్రిక చక్రాల ప్రతిరూపాలుగా పరిగణించబడతాయి.అన్నామలైయార్ ఆలయాన్ని మణిపూరగ స్ధలం అని కూడా అంటారు.[39]మణిపూరక చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది.[40] ఈ ఆలయం తమిళ శైవ కానాన్ "తేవరం"లో గౌరవించబడింది.శైవ శాసనంలో ప్రస్తావించబడిన 276 దేవాలయాలలో ఇది ఒకటిగా పాదల్ పెట్ర స్థలంగా వర్గీకరించబడింది. [41]
అన్నామలైయార్ దేవాలయం అతి ముఖ్యమైన ఉత్సవం తమిళ మాసం కార్తికైలో జరుగుతుంది. ఈ ఉత్సవం నవంబరు, డిసెంబరు మధ్య కార్తీకదీపం వేడుకతో ముగుస్తుంది. దీపం సమయంలో అన్నామలై కొండల పైభాగంలో మూడు టన్నుల నెయ్యితో కూడిన జ్యోతిలో భారీ దీపం వెలిగిస్తారు.[42] [43] [44] ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, అన్నామలైయార్ ఉత్సవ దేవత పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తారు. చోళుల కాలం (850–1280) నాటికే ఈ పండుగను జరుపుకున్నారని, ఇరవయ్యవ శతాబ్దంలో పదిరోజులకు విస్తరించారని శాసనాలు సూచిస్తున్నాయి.[45]
ప్రతి పౌర్ణమికి, వేలాదిమంది యాత్రికులు అన్నామలై కొండపై చెప్పులు లేకుండా అరుణాచల కొండ ప్రదక్షిణలు చేస్తూ అన్నామలైయార్‌ను పూజిస్తారు.[42] ప్రదక్షిణ మార్గం 14 కిలోమీటర్లు (8.7 మై.) దూరం కలిగి ఉంది. దీనిని గిరివాలం అని సూచిస్తారు. [46] [47] హిందూ పురాణాల ప్రకారం, నడక పాపాలను తొలగిస్తుందని, కోరికలను నెరవేరుస్తుందని, జన్మ, పునర్జన్మ చక్రం నుండి స్వేచ్ఛను సాధించడంలో సహాయపడిందని నమ్మకం. [16] కొండచుట్టూ ఉన్న పుష్కరణిలు, పుణ్యక్షేత్రాలు, స్తంభాల ధ్యాన మందిరాలు, నీటి బుగ్గలు గుహల వరుసలో భక్తులుచే నైవేద్యాల సమర్పించబడతాయి.[12]
తమిళనాడులోని తిరుమలై అనేది తిరువణ్ణామలై శివార్లలో ఉన్న ఒక పురాతన జైన దేవాలయ సముదాయం. ఇందులో మూడు జైనగుహలు, నాలుగు జైనదేవాలయాలు, 12వ శతాబ్దానికి చెందిన 16 అడుగుల (4.9 మీ) ఎత్తైన నేమినాథ శిల్పం, ఎత్తైన జైన విగ్రహాలు ఉన్నాయి.[48]
అన్నామలై కొండచుట్టూ ఉన్న రమణాశ్రమం, యోగి రాంసురత్‌కుమార్ ఆశ్రమం తిరువణ్ణామలై ప్రసిద్ధ సందర్శకుల ఆకర్షణలు. నగరానికి నైరుతి దిశలో 20 కిమీ (12 మై) దూరంలో ఉన్న తెన్పెన్నై నదిపై ఉన్న సాథనూర్ ఆనకట్ట ఒక ప్రముఖ విహార ప్రదేశం. ఈ ఆనకట్ట ప్రక్కనే ఒక సుందరమైన ఉద్యానవనం ఉంది. తిరువణ్ణామలైకి దక్షిణంగా 36 కిమీ (22 మై) దూరంలో ఉన్న తిరుకోయిలూర్‌లోని ఉలగలంత పెరుమాళ్ ఆలయం, తిరువరంగం తిరువణ్ణామలై చుట్టూ ఉన్న ప్రముఖ విష్ణు దేవాలయాలు.[47]
Remove ads
రవాణా

దిండివనం – కృష్ణగిరి జాతీయ రహదారి, జాతీయ రహదారి 77 వెల్లూర్-తూత్తుకుడి నౌకాశ్రయం జాతీయ రహదారి 38 తిరువణ్ణామలై గుండా వెళుతుంది. నగరంలో ఎనిమిది అంతర్గత రహదారులు ఉన్నాయి. ఇవి ఇతర పట్టణాలను కలుపుతాయి.[26] తిరువణ్ణామలై పురపాలక సంఘం పరిధిలో 75.26 కి.మీ. (46.76 మై.) మొత్తం పొడవుగల రహదారులు,నగరంలో 9.068 కి.మీ. (5.635 మై.) రహదారులు ఉన్నాయి. కంకర రోడ్లు,50.056 కి.మీ. (31.103 మై.) బి.టి. రహదారులు, 7.339 కి.మీ. (4.560 మై.) డబ్లు.బి.ఎం రహదారులు,8.797 కి.మీ. (5.466 మై.) మట్టి రోడ్లు ఉన్నాయి.[49]
తిరువణ్ణామలై నగరంలో తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా నిర్వహించబడే సిటీ బస్ సర్వీస్ ద్వారా సేవలు అందిస్తోంది. ఇది నగరం, శివారు ప్రాంతాలతో అనుసంధానం అందిస్తుంది. నగరంలో స్థానిక రవాణా అవసరాలను తీర్చే ప్రైవేట్ మినీ-బస్ సర్వీసులు ఉన్నాయి. ప్రధాన బస్ స్టాండ్ 2 ఎకరం (8,100 మీ2) విస్తీర్ణంలో నగరం నడిబొడ్డున ఉంది.[50] తిరువణ్ణామలైకి నిరంతర అంతర్గత సిటీ బస్సు సర్వీసులు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ తిరువణ్ణామలైకి వివిధ నగరాలను కలుపుతూ రోజువారీ సేవలను నిర్వహిస్తోంది.[51]
కాట్పాడి నుండి విల్లుపురం వెళ్లే రైలు మార్గంలో తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ ఉంది. ఇది దక్షిణ రైల్వేలోని తిరుచ్చిరాపల్లి విభాగం పరిధిలోకి వస్తుంది .రామేశ్వరం నుండి తిరుపతి నగరానికి వారానికి ఒకసారి ఎక్స్‌ప్రెస్ సర్వీసు తిరువణ్ణామలై నుండి మధురై, తిరుపతి నగరాలను ఇరువైపులా కలుపుతుంది. కాట్పాడి నుండి విల్లుపురం వరకు ఇరువైపులా సాధారణ రైళ్లు నడుస్తాయి.[52] [53] [54] [55] సమీప విమానాశ్రయం చెన్నైలో ఉంది. ఇది తిరువణ్ణామలై నగరం 172 కి.మీ. (107 మై.) దూరంలో ఉంది.[53]
Remove ads
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads