తూర్పు గాంగులు

From Wikipedia, the free encyclopedia

తూర్పు గాంగులు
Remove ads

తూర్పు గాంగులు మధ్యయుగ భారతదేశానికి చెందిన సామ్రాజ్య పాలకులు. వీరి స్వతంత్ర పాలన 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్ద ప్రారంభం వరకూ, ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రముతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బంగ లోని అనేక ప్రాంతాలలోకి విస్తరించి, సాగినది.[1] వారి రాజధాని కళింగ నగరం లేదా ముఖలింగం (శ్రీకాకుళం జిల్లా). కోణార్క సూర్య దేవాలయం (ప్రపంచ వారసత్వ ప్రదేశం) నిర్మాతలుగా ప్రపంచ ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటారు.

త్వరిత వాస్తవాలు తూర్పు గంగ సామ్రాజ్యం, రాజధాని ...
Thumb
అనంతవర్మన్ చోళగాంగునిచే నిర్మించబడిన పూరీ జగన్నాధ ఆలయం
Thumb
కామార్ణవునిచేత నిర్మించబడిన ముఖలింగేశ్వర ఆలయం, శ్రీముఖలింగం, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్
Thumb
నరసింహదేవ - 1 నిర్మింపజేసిన కోణార్క సూర్య దేవాలయం, కోణార్క్, ఒరిస్సా ప్రస్తుతం, ప్రపంచ వారసత్వ ప్రదేశం

పశ్చిమ గాంగుల సంతతి వాడైన, అనంత వర్మన్ చోడగాంగునిచే ఈ రాజ్యం స్థాపించబడింది.[2] తూర్పు చాళుక్యులు, చోళులతో సంబంధ బాంధవ్యాలు కలిగిన తూర్పు గాంగులు, తమ దక్షిణ దేశ సంస్కృతిని ఒరిస్సా ప్రాంతానికి వ్యాపింపజేశారు.[3] వీరి కాలంలో 'ఫణం' అని పిలువబడిన నాణేలు, చెలామణీలో ఉండేవి.[3] రాజ్యస్థాపికుడైన అనంతవర్మ చోళగాంగుడు, హైందవ మతాభిమాని, లలిత కళల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాధ ఆలయాన్ని నిర్మించాడు.[4][5] అనంత వర్మ అనంతరం అనేకమంది గాంగ రాజులు కళింగని పరిపాలించారు. వారిలో చెప్పుకోదగినవారిలో నరసింహదేవ వర్మ - 2 (1238–1264), ముఖ్యుడు. నరసింహదేవ వర్మ - 2 నిర్మింపజేసిన ఆలయాల్లో కోణార్క సూర్య దేవాలయం, శ్రీ కూర్మనాధుని దేవాలయం (శ్రీకూర్మం), వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, సింహాచలం ముఖ్యమైనవి.

బెంగాల్ ప్రాంతంనుండి, ఉత్తరాది నుండి నిరంతరం సాగిన ముస్లిం దండయాత్రల నుండి తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సామ్రాజ్యం వర్తకవాణిజ్యాలలో పురోగమించింది. సామ్రాజ్యాధినేతలు, తమ ధనాన్ని ఆలయనిర్మాణంలో వెచ్చించారు. చివరి రాజు భానుదేవ-4 (1414-34) కాలంలో ఈ సామ్రాజ్యం అంతమైంది.[6]

Remove ads

ఉన్నతి, పతనం

మహామేఘవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత, కళింగ ప్రాంతం అనేక స్థానిక నాయకుల పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ స్థానిక నాయకులంతా కళింగాధిపతి బిరుదుని ధరించినవారే. తూర్పు గాంగుల మొదటగా గురించి తెలిసినది, ఇంద్రవర్మ - 1 నుండి మాత్రమే. ఇంద్ర వర్మ - 1 విష్ణుకుండిన రాజైన ఇంద్రభట్టారకుని ఓడించి శ్రీముఖలింగం రాజధానిగా తన స్వతంత్ర పాలనని ప్రారంభించాడు. తూర్పు గాంగులు 'త్రికళింగాధిపతి', 'సకల కళింగాధిపతి' బిరుదుని ధరించారు.[7]

తూర్పు గాంగులు, తొట్టతొలి పాలకుల అనంతర రాజులు వేంగి చాళుక్యుల ఆధిపత్యాన్ని అంగీకరించారు. అయితే వేంగి చాళుక్యుల అంతర్గత తగాదాలను అదునుగా తీసుకుని వజ్రహస్త - 1, స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఈ కాలంలో బౌద్ధ, జైన మతాల స్థానాన్ని శైవ మతం ఆక్రమించింది. 8వ శతాబ్దానికి చెందిన తూర్పు గంగరాజు కామార్ణవుని కాలంలో శ్రీముఖలింగంలోని మధుకేశ్వరాయం లేదా ముఖలింగేశ్వరాయం నిర్మించబడింది.

11వ శతాబ్దంలో, తూర్పు గంగ రాజ్యం, చోళసామ్రాజ్య నియంత్రణలో సామంత రాజ్యంగా ఉండింది.[7]

వజ్రహస్త-3 కుమారుడైన దేవేంద్ర వర్మ రాజరాజ దేవుడు - 1, చోళులతోను, తూర్పు చాళుక్యులతోనూ యుద్ధాలు చేస్తూ, రాజ్యానికి పటిష్ఠపరుచుకునేందుకు, చోళ రాజకుమారి, రాజసుందరిని వివాహం చేసికున్నాడు. ఈమె చోళ చక్రవర్తి అయిన వీరరాజేంద్ర చోళుని కుమార్తె, మొదటి కులోత్తుంగ చోళుని సోదరి.

వీరి కుమారుడైన అనంతవర్మన్ చోడగాంగ, గంగా - గోదావరి నదీముఖద్వారాల మధ్యనున్న ప్రదేశాన్నంతటినీ పరిపాలించి 11వ శతాబ్దంలో తూర్పు గాంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శైవునిగా పుట్టిన అనంతవర్మ, రామానుజాచార్యుని ప్రభావంతో వైష్ణవునిగా మారి పూరి వద్దనున్న జగన్నాధ ఆలయం నిర్మింపజేశాడు. చోళుల, గాంగుల వంశాన్ని సూచింపజేస్తూ చోడగాంగ అనే పేరుని ధరించాడు. త్రికళింగాధిపతి బిరుదును మొదటిగా ధరించినది, అనంతవర్మే. తన రాజధానిని శ్రీముఖలింగంనుండి సామ్రాజ్య మద్యంలో ఉన్న కటకానికి మార్చాడు

సా.శ.. 1198లో రాజ్యానికి వచ్చిన రాజరాజు-3, సా.శ.. 1206లో కళింగ పై సాగిన బెంగాల్ ముస్లింల దండయాత్ర నియంత్రించలేకపోయాడు. వీరి దండయాత్రనిని నిరోధించిన, అతని కుమారుడు అనంగభీమ -3, తన విజయానికి సంకేతంగా భవనేశ్వరం వద్ద మేఘేశ్వరాలయాన్ని నిర్మించాడు. అతని కుమారుడు నరసింహదేవ వర్మ-1, దక్షిణ బెంగాలుపై దండెత్తి వారి రాజధాని గౌర్ని ఆక్రమించాడు. ఆ విజయానికి గుర్తుగా కోణార్క్ వద్ద సూర్యదేవాలయాన్ని నిర్మించాడు.

సా.శ.. 1264 నరసింహదేవుని మరణం తర్వాత, తూర్పు గాంగుల శక్తి క్షీణించడం ఆరంభమైంది. సా.శ.. 1324లో ఢిల్లీ సుల్తానులు, సా.శ.. 1356లో విజయనగర ప్రభువులు కళింగ, ఓఢ్ర దేశాలపై దండెత్తి ఓడించారు. అయితే, చివరిపాలకుడైన నరసింహదేవ - 4 సా.శ.. 1425లో మరణించేవరకు కళింగ-ఓఢ్ర ప్రాంతంపైన తూర్పు గాంగుల ఆధిపత్యం కొనసాగింది. సా.శ.. 1434-35లో పిచ్చి రాజైన భానుదేవ-4 ని గద్దె దించి, మంత్రి అయిన ఓఢ్ర కపిలేంద్ర సింహాసనాన్ని అధిష్టించి, సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు గాంగులు మతానికి, కళలకి ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంనాటి ఆలయాలు భారతీయ శిల్పకళ యొక్క గొప్పదనాన్ని చాటుతూ ఉన్నాయి.[8]

Remove ads

పరిపాలకులు

  1. ఇంద్ర వర్మ (496-535) [7]
  2. దేవేంద్ర వర్మ - 4 (893-?)
  3. వజ్రహస్త అనంతవర్మన్ (1038-?)
  4. రాజరాజ - 1 (గంగరాజు) (?-1078)
  5. అనంతవర్మన్ చోడగాంగ (1078–1150) [7]
  6. అనంగ భీమదేవ - 2 (1178–1198)
  7. రాజరాజు - 2 (1198 - 1211)
  8. అనంగ భీమదేవ - 3 (1211–1238)
  9. నరసింహ దేవ - 1 (1238–1264) [7]
  10. భాను దేవ - 1 (1264–1279)
  11. నరసింహ దేవ - 2 (1279–1306) [7]
  12. భాను దేవ - 2 (1306–1328)
  13. నరసింహ దేవ - 3 (1328–1352)
  14. భాను దేవ - 3 (1352–1378)
  15. నరసింహ దేవ - 4 (1379–1424) [7]
  16. భాను దేవ - 4 (1424–1434)
Remove ads

భాష, సాహిత్యం

తూర్పు గాంగులు, తమ రాజ్యంలోని అన్ని మతాలనీ, భాషలని సమానంగా చూసారు. వీరి రాజ్యంలో తెలుగు, ఒరియా, సంస్కృతం, అపభ్రంశ భాషలను మాట్లాడే ప్రజలున్నారు. సంస్కృత భాష రాజభాషగా ఉండినది. అన్ని ప్రాంతాలలోనూ తెలుగు, సంస్కృత, ఒరియా శాసనాలు వేయించారు. పరిపాలనాభాషగా ఒరియా భాషకి స్థానం కల్పించినది, తూర్పు గాంగులే. అయితే, తమ ఆస్థానాలలో తెలుగు, ఒరియా కవులను పోషించిన దాఖలాలు లేవు.[9]

రాజ్యవిస్తరణ అనంతరం కటకానికి రాజధాని మార్చినప్పటికీ స్థానికేతరులైన కారణంచేత, స్థానిక నాయకులకి అసంతృప్తి ఉండినట్టు పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని జాతులకి, భాషలకి అతీతంగా తమ రాజ్యాన్ని “పురుషోత్తమ సామ్రాజ్యం”గా పేర్కొన్నారు. కళింగ రాజ్యం లేదా ఓఢ్రరాజ్యం అని ఏ శాసనాలలోనూ పేర్కొనలేదు.[9]

వీరి అనంతరం వచ్చిన సూర్యవంశ గజపతులు, భువనేశ్వర్-కటక్ లలో వేయించిన శాసనాలలో రాజధాని ప్రాంతాన్ని'స్వతంత్ర ఓఢ్ర దేశం'గా ప్రకటించుకున్నారు. అది స్థానిక అసంతృప్తి కారణంగానే అని పరిశోధకుల అభిప్రాయం.

శ్రీకాకుళం, టెక్కలి, సంతబొమ్మాళి, వంటి ప్రాంతాలలో లభించిన వీరి దానశాసనాలలో ‘కోల’, ‘మూర’, ‘మాడ’, ‘పుట్టి’, ‘తూము’, ‘కుంట’ వంటి వంటి తెలుగు కొలమానాలు కనిపిస్తాయి.[10]

వీరి కాలానికి చెందిన కొందరు ప్రముఖులు

  • శ్రీకాంతకృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య. 13వ శతాబ్దానికి చెందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు. సింహాచలం నరసింహస్వామిని స్తుతిస్తూ కీర్తనలు రచించాడు.
  • జయదేవ 13వ శతాబ్దానికి చెందిన సంస్కృత పండితుడు. ‘గీత గోవిందం’అనే సుప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు.

తూర్పు గాంగరాజుల దేవేరులు

  • మాసమదేవి-కామర్ణవుడు (సా.శ.. 1147-1156) - ఆధారము ముఖలింగ శాసనము.
  • సురమాదేవి-ఇమ్మడి రాజరాజు (సా.శ.. 1170-1190) - ఆధారము భువనేశ్వర శిలాశాసనము.
  • వాఘలదేవి-ఇమ్మడి అనియంకభీముడు (సా.శ.. 1190-1198)
  • మంకుణదేవి-మమ్మడి రాజరాజు (సా.శ.. 1198-1211)
  • సోమలదేవి, కస్తూరీదేవీ, గంగాదేవీ-మమ్మడి ఆనియంకభీముడు (సా.శ.. 1211-1238) - ఆధారము కాంచీపుర శిలాశాసనము.
  • సీతాదేవీ-మొదటి నరసింహుడు (సా.శ.. 1238-1263)
  • అన్నమాంబ-మొదటి భానుదేవుడు (సా.శ.. 1263-1278) - ఆధారము ద్రాక్షారామ సంస్కృత శాసనము.
  • చోడమహాదేవి-ఇమ్మడి నరసింహుడు (సా.శ..1278-1305)
  • లక్ష్మీదేవి-ఇమ్మడి భానుదేవుడు (సా.శ..1305-1327)
  • గంగాదేవి, కొమ్మిదేవి, బిరుజాదేవి, కమలాదేవి-ముమ్మడి నరసింహుడు (సా.శ..1327- 1353) -శ్రీకూర్మం, సింహాచలం శిలాశాసనములు.
  • తారాదేవి, హీరాదేవి-ముమ్మడి భానుదేవుడు (సా.శ..1353-1378)
  • తారాదేవి, ఉత్తమదేవి, పార్వతీదేవి, కమలాదేవి-నాల్మడి నరసింహుడు (సా.శ..1378-1409)
  • రాజలదేవి, తల్లమదేవి, ఎల్లమదేవి, చోండమహాదేవి-నాల్మడి భానుదేవుడు (సా.శ..1409-1434)
Remove ads

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads