మీర్జా హామీదుల్లా బేగ్
భారతదేశం యొక్క 15 వ ప్రధాన న్యాయమూర్తి From Wikipedia, the free encyclopedia
Remove ads
మీర్జా హమీదుల్లా బేగ్ (ఎం. హెచ్. బేగ్) (22 ఫిబ్రవరి 1913 - 19 నవంబర్ 1988), జనవరి 1977 నుండి ఫిబ్రవరి 1978 వరకు భారతదేశ 15వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలను అందించాడు.
Remove ads
ప్రారంభ జీవితం, విద్య
ఇతడు దక్కనీ ముస్లిమ్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి మీర్జా సమీవుల్లా బేగ్ హైదరాబాద్ స్టేట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఈ కారణంగా, ఆయన హైదరాబాద్ రాష్ట్ర వ్యవహారాల్లో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. హెర్బల్ బ్యూటీ కేర్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన షహనాజ్ హుస్సేన్ కు ఇతడు స్వయానా మామ అవుతాడు.
ఆ సమయంలో హైదరాబాద్‌లోని చాలా మంది ధనికుల పిల్లల మాదిరిగానే, మీర్జా హమీదుల్లా బేగ్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో చదివాడు, అక్కడ ఇతను సీనియర్ కేంబ్రిడ్జ్ హెచ్.ఎస్.ఎల్.సి. పరీక్షలో మొదటి స్థానం కోసం బంగారు పతకాన్ని సాధించాడు.
భారతదేశం ఇంకా బ్రిటిష్ ప్రభావంలో ఉన్న సమయంలో, ముఖ్యంగా న్యాయశాస్త్రాన్ని అభ్యసించేందుకు, సంపన్న భారతీయులు ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్యను పొందడం సాధారణం అయ్యింది.
ఈ నేపథ్యంలో, బేగ్ 1931లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్‌లో చేరి, పురావస్తు శాస్త్రం, మానవశాస్త్రం, చారిత్రక అధ్యయనాలలో గౌరవ డిగ్రీలు పొందాడు.
ఇతడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో న్యాయశాస్త్రం, ఆర్థికశాస్త్రం, రాజకీయ శాస్త్రాలను అభ్యసించాడు. అనంతరం, హానరేబుల్ సొసైటీ ఆఫ్ లింకన్’స్ ఇన్ ద్వారా బార్‌కు చేరారు.
1941లో ఇతనికి ఇంగ్లాండ్‌లో బార్ ఎట్ లా హోదా లభించింది.
న్యాయవాద వృత్తి
ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న తర్వాత, మీర్జా హమీదుల్లా బేగ్ భారతదేశానికి తిరిగి వచ్చి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించాడు.
అక్కడి నుంచి, ఇతడు న్యాయవ్యవస్థలో అనుభవాన్ని కూడగట్టడం మొదలుపెట్టాడు. 1949లో, భారత ఫెడరల్ కోర్టు న్యాయవాదిగా నమోదు అయ్యాడు. చివరికి, ఇతడు భారత సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఎదిగాడు.
వివిధ కోణాల్లో విస్తృత న్యాయ అనుభవాన్ని సంపాదించుకున్న అనంతరం, ఇతడు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రధాన న్యాయవాదిగా (స్టాండింగ్ కౌన్సెల్) నియమితుడయ్యాడు. అలాగే, మున్సిపల్ సంస్థల తరఫున తరచుగా హాజరయ్యేవాడు.
కౌన్సెల్‌గా అనుభవం పొందిన అనంతరం, బేగ్ 11 జూన్ 1963న అలహాబాద్ హైకోర్టు న్యాయపీఠానికి నియమితుడయ్యాడు. న్యాయమూర్తిగా, ఇతడు క్రిమినల్, సివిల్, అలాగే పన్ను విభాగాల్లో న్యాయస్థానంలో సేవలందించాడు. అనంతరం, ఇతడు కంపెనీ న్యాయమూర్తిగా నియమించబడి, 1967 మధ్య నుంచి 1970 వరకు హైకోర్టులో వివాహ సంబంధ, వారసత్వ న్యాయ అధికార బాధ్యతలను నిర్వహించాడు. భూభాగాల పునర్వ్యవస్థీకరణ తరువాత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 1971 జనవరిలో ఎం.హెచ్. బేగ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా స్వల్ప కాలం పనిచేసిన తరువాత, బేగ్ 12 డిసెంబర్ 1971న భారత అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా పదోన్నతిని పొందాడు. ఇతడు సుప్రీం కోర్టులో పనిచేసిన కాలంలో, 194 తీర్పులను ఇవ్వడంతో పాటు 562 బెంచీలలో కూర్చొన్నాడు. [1]
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ఇతడు భారత ఆరో రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డికి పదవీ ప్రమాణ స్వీకారం చేయించాడు.
హెబియస్ కార్పస్ కేసు
హెబియస్ కార్పస్ కేసులో ఇతడు కూడా భాగం వహించాడు. భారత ప్రజాస్వామ్యంలో కీలకమైన ఈ కేసు, అడిషనల్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ ఆఫ్ జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా, 1975లో భారత అత్యవసర పరిస్థితి సమయంలో వెలుగులోనికి వచ్చింది. ఈ కేసులో ప్రధానంగా అత్యవసర పరిస్థితిలో అరెస్టులకు న్యాయపరమైన పరిశీలనకు పౌరునికి హక్కు ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యింది. సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ అయిదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించగా, నలుగురు న్యాయమూర్తులు ప్రభుత్వం వైపు తలొగ్గి, అత్యవసర పరిస్థితిలో జీవించే హక్కు కూడా నిలిపివేయబడుతుంది అని తీర్పు చెప్పారు (ఒక్క న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నా మాత్రమే విరుద్ధ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు).
కొద్ది నెలల తర్వాత, 1977 జనవరిలో, హెచ్.ఆర్. ఖన్నా కన్నా జూనియర్ అయిన ఎం.హెచ్. బేగ్ ను ఇందిరా గాంధీ ప్రభుత్వం భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. ఇది న్యాయపరమైన సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, ఇది ఎ.ఎన్. రే నియామకంతోనే ప్రారంభమయ్యింది.
న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యంపై ఈ తాక్షణికమైన ప్రభావాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. తదనంతరం, శాంతి భూషణ్ వంటి న్యాయశాఖ మంత్రులు, న్యాయమూర్తుల నియామక అధికారాన్ని ప్రధాన న్యాయమూర్తి పరిధిలోకి తీసుకురావడానికి (ప్రభుత్వం చేతుల్లో కాకుండా) పలు చర్యలను ప్రారంభించారు.
మొహమ్మద్ హిదాయతుల్లా తరువాత, బేగ్ భారతదేశంలో రెండవ ముస్లిం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఒక సంవత్సరం పదవీకాలం పూర్తి చేసిన తరువాత, బేగ్ 1978 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశాడు.
తరువాత ఇతడు భారత మైనారిటీ కమీషన్‌కు ఛైర్మన్‌గా సేవలను అందించాడు. [2][3]
అకడమిక్స్
న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఇతడు వివిధ విషయాలను బోధించే వివిధ అధ్యాపక పదవులను చేపట్టాడు:
- మీరట్ కాలేజీలో కాన్స్టిట్యూషనల్ లా, ఈక్విటీలలో ప్రొఫెసర్ (1943–1946)
- అలహాబాద్ విశ్వవిద్యాలయంలో సాక్ష్యాధారాల చట్టం, మానవ చట్టం, ప్రాచీన చట్టాలను బోధించాడు.(1946–1963)
- అలహాబాద్ విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సెల్
- అంతర్జాతీయ న్యాయ సంఘం, ప్రపంచ న్యాయమూర్తుల సంఘాల సభ్యుడు
పదవీవిరమణ తరువాత ఇతడు భారతదేశంలో ముస్లింల రాజకీయాల గురించి రెండు పుస్తకాలు వ్రాశాడు:
- ఇంపాక్ట్ ఆఫ్ సెక్యులరిజం ఆన్ లైఫ్ అండ్ లా, 1985లో ముద్రితం
- హ్యూమన్ రైట్స్ అండ్ ఏషియా , 1978లో ముద్రితం
పురస్కారాలు
- 1988: న్యాయ, ప్రజా వ్యవహారాలలో ఇతని సేవలకు గుర్తింపుగా భారతదేశపు రెండవ అత్యుత్తమ పౌరపురస్కారం పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేశారు.
Remove ads
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads