శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
Remove ads
శ్రీకాకుళం జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య దిక్కులో గల చిట్టచివరి జిల్లా. జిల్లా కేంద్రం శ్రీకాకుళం.దీనిని కళింగపట్నం అని కూడా అంటారు. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, కొన్ని మండలాలను పార్వతీపురం మన్యం జిల్లాలో, విజయనగరం జిల్లాలలో చేర్చారు.
శ్రీకాకుళం లోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి, శ్రీకూర్మంలో కూర్మావతార మందిరం, శాలిహుండంలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు, ముఖలింగంలోని శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం, కళింగపట్నంలోని దీప స్తంభం, తేలినీలాపురంలోని తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.
Remove ads
పేరు వ్యుత్పత్తి
బ్రిటిషు వారు శ్రీకాకుళం పేరును పలకలేక "చికాకోల్" అనేవారు. చికాకోల్ కు సంబంధించిన మరో కథనం ప్రకారం ఈ ప్రాంతం నైజాం ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసి, మూటకట్టి, ఆమూటను తీసికొనివచ్చి ఖుద్దున సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలన, ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్" అయి, శ్రీకాకుళంగా స్థిరపడింది అని అంటారు. ఈ పట్టణం పేరుతోనే జిల్లా ఏర్పడింది.
Remove ads
జిల్లా చరిత్ర


ఈ జిల్లా తొలిగా విశాఖపట్నం జిల్లానుండి ఏర్పడినందున, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చరిత్రే దీనికి ఆధారం. ఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్యస్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ వంటి బౌద్ధారామాలు ఇక్కడ కనుగొన్నారు. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుడు కాలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించాడు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం శ్రీకాకుళం జిల్లాలోనే ప్రారంభమయింది.
జిల్లా పరిధి మార్పులు
విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగస్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. 1969లో ఈ జిల్లానుండి సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలి తాలూకాలోని 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పరచిన గజపతి నగరం తాలూకాకు బదలాయించారు. మళ్ళీ 1979 మేలో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పరచినపుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను కొత్తజిల్లాలో విభాగాలుగా చేశారు.

జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ, జిల్లా జనాభా 2699471. జిల్లా శ్రీకాకుళం రెవెన్యూ డివిజను, టెక్కలి రెవెన్యూ డివిజను, పాలకొండ రెవెన్యూ డివిజను అనే మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజింపబడింది. జిల్లాలో మొత్తం 38 మండలాలు, 1865 రెవెన్యూ గ్రామాలు ఉండేయి.[2] 1 నగరం, 5 పట్టణాలు ఉండేయి.[3]
2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో ఉన్న 38 మండలాల నుండి కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 4 మండలాలు విలీనమయ్యాయి.[1] పర్యవసానంగా, పట్టణాలలో పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలో చేరగా, రాజాం పట్టణం విజయనగరం జిల్లాలో చేరింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన మండలాలు
విజయనగరం జిల్లాలో చేరిన మండలాలు
Remove ads
జనాభా గణాంకాలు
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,703,114, అందులో పురుషులు 1,341,738 కాగా, మహిళలు 1,361,376. 2001 జనాభా లెక్కల ప్రకారం, శ్రీకాకుళం జనాభా 2,537,593, అందులో పురుషులు 1,260,020, స్త్రీలు 1,277,573. 2001 జనాభాతో పోలిస్తే జనాభాలో 6.52 శాతం మార్పు ఉంది. భారతదేశం మునుపటి 2001 జనాభా లెక్కల ప్రకారం, శ్రీకాకుళం జిల్లా 1991తో పోల్చితే దాని జనాభాలో 9.33 శాతం పెరిగింది.[4]
- 2001-2011 దశకంలో జనాభా వృద్ధి రేటు: 6.52% (మొత్తం రాష్ట్రం వృద్ధి రేటు 14.44%)
- జనసాంద్రత: చ.కి.మీ.కు 463 మంది (రాష్ట్రం జనసాంద్రత 308)
- అక్షరాస్యులు మగవారిలో 8,57,824 (71.61%), ఆడువారిలో 6,37,557 (52.08%)
- పట్టణ ప్రాంతాల జనాభా 4,36,703 లేదా 16.16% (రాష్ట్రం మొత్తంలో పట్టణ జనాభా 27.35%)
- శ్రామికులు: 48.6% (ఇందులో 78% వ్యవసాయం, 15% సేవల రంగం)
కేటగిరీ | మగ | ఆడ | మొత్తం | %మగ | %ఆడ |
అందరు | 13,41,738 | 13,61,376 | 27,03,114 | 49.64% | 50.36% |
ఎస్సీ | 113730 | 115879 | 229609 | 9.02% | 9.07% |
ఎస్టీ | 75284 | 75965 | 151249 | 5.97% | 5.94% |
మైనారిటీస్ | 21706 | 23641 | 44223 | 1.73% | 1.88% |
2022 పునర్వ్యవస్థీకరణ తరువాత జనాభా గణాంకాలు
2011 జనగణన ప్రకారం, 2022 లో సవరించిన పరిధిలో జిల్లా జనాభా 21.914 లక్షలు [1]
భౌగోళిక స్వరూపం
జిల్లాకు ఉత్తరాన పార్వతీపురం మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్రం, తూర్పున ఒడిశా గజపతి జిల్లా, బంగాళాఖాతం,, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన విజయనగరం జిల్లా, ఉన్నాయి. జిల్లాకు కొంత భాగం హద్దులుగా కందివలస గెడ్, వంశధార, బహుదా నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా వైశాల్యం 4,591 చ.కి.మీ.[1] జిల్లాకు 193 కి.మీ. సముద్ర తీరం ఉంది. తూర్పు కనుమలు ఈశాన్యం నుండి కొంతభాగం విస్తరించి ఉన్నాయి.
- నదులు
నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగడ్ ఇవి జిల్లాలలో ముఖ్యమైన నదులు. ఇవి తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
- వాతావరణం
సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు -నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సం.లో వర్షపాతం 937.6 మి.మీ.)
శ్రీకాకుళం పట్నం, జిల్లాలోని పలు ప్రాంతాలు పచ్చికబయల్లు, అడవులు, సశ్యస్యామలమైన పంట పొలాలతో ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో ఊటీని పోలి ఉంటుంది. ఈ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కాస్టాఫ్ లివింగ్ చాలా తక్కువ. అందుకే దీనిని పేదవాని స్వర్గమని పిలుస్తారు. [మూలం అవసరం]
- సస్య సంపద
జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.
- దక్షిణ భారత తేమ ఆకురాల్చే అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు.
- దక్షిణ భారత సతత హరిత అడవులు [6]
- జంతు సంపద
జిల్లాలో మాంసాహార మృగాలలో పులి దాదాపు అంతరించింది. చిరుత పులి, హైనా (దుమ్ములగొండి), తోడేలు వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో ఎక్కువుగా మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, ఎలుగుబంట్లు సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా కౌజుపిట్టలు, బాతులు, పావురాలు వంటివి అధికంగా ఉన్నాయి. [మూలం అవసరం]
Remove ads
పాలనా విభాగాలు
రెవెన్యూ డివిజన్లు
జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లున్నాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజను, టెక్కలి రెవెన్యూ డివిజన్లు గతంలో ఉన్నవి కాగా, పలాస రెవెన్యూ డివిజను కొత్తగా ఏర్పడింది.[7]
మండలాలు
పలాస రెవెన్యూ డివిజను
టెక్కలి రెవెన్యూ డివిజను
శ్రీకాకుళం రెవెన్యూ డివిజను
రెవెన్యూ గ్రామాలు
1468 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. [మూలం అవసరం]
నగరాలు, పట్టణాలు
1 నగరం, 3 పట్టణాలున్నాయి.
- నగరం: శ్రీకాకుళం
- పట్టణాలు: ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస కాశీబుగ్గ
Remove ads
నియోజక వర్గాలు
లోక్‌సభ నియోజకవర్గం
- శ్రీకాకుళం
- విజయనగరం (పాక్షికం), మిగతా విజయనగరం జిల్లాలో గలదు.
శాసనసభ నియోజకవర్గాలు
రవాణా వ్వవస్థ
ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర రహదారుల నిడివి 959 కి.మీ. (596 మై.).[8] జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి 10 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషను ఉంది. జిల్లాలోని ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లు ఆమదాలవలస, పలాస, నౌపాడ, సోంపేటలో ఉన్నాయి. జిల్లాకు సమీప విమానాశ్రయం విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.
విద్యాసంస్థలు
ఉమ్మడి జిల్లా ఆర్ధిక స్థితి గతులు
వ్యవసాయం
జిల్లాలో ముఖ్య పంటలు- వరి, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు, చెరకు, జనుం, వేరుశనగ, నువ్వులు, మిరప, పసుపు, నీరుల్లి. [మూలం అవసరం]
నీటివనరులు
శ్రీకాకుళం జిల్లాలో బాహుద, ఉత్తర మహేంద్ర, తనయ, బెంజిగడ్డ, వరహాలు గడ్డ, వంశధార, నాగావళి, పెద్దగడ్డ, కందివలస అనే 9 నదులు ఉన్నాయి. వీటిలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ ముఖ్యమైన నదులు. జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 26.47%, నైఋతి ఋతుపవనాల ద్వారా 62.61% వర్షాలు లభిస్తాయి. మూడు ముఖ్య నదుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగం: నాగావళి 371 మి.క్యూ.మీ. (మిలియన్ క్యూబిక్ మీటర్లు) (36%), వంశధార 121 మి.క్యూ.మీ. (12%), మహేంద్ర తనయ 81 మి.క్యూ.మీ. (8%), చిన్న చెరువులు 140 మి.క్యూ.మీ. (14%), భూగర్భ జలాలు 300 మి.క్యూ.మీ. (30%). మొత్తం 1,013 మి.క్యూ.మీ. రాష్ట్రంలో రెండు ప్రధాన జలాశయాలు సుమారు 140 మి.క్యూ.మీ. నీటిని వ్యవసాయ నిమిత్తం సమకూరుస్తున్నాయి. అవకాశం ఉన్న నీటిలో 91% (5,763 మి.క్యూ.మీ.) బంగాళాఖాతంలోకి వృధాగా పోతున్నదని అంచనా. 9% నీరు మాత్రమే భూగర్భంలోకి ఇంకుతుంది.
జిల్లాలో 3.3 లక్షల (0.33 మిలియన్) హెక్టేరులు భూమి సాగులో ఉంది. అందులో 1.9 లక్షల హెక్టేరులకు సాగునీటి వసతి ఉంది. కాలువల ద్వారా 91,946 హెక్టేరులు, చెరువుల ద్వారా 80,123 హెక్టేరులు, బోరు బావుల ద్వారా 6,923 హెక్టేరులు, ఇతర బావుల ద్వారా 8,866 హెక్టేరులు, ఇతర వనరుల ద్వారా 5,316 హెక్టేరులు భూమికి సాగునీరు లభిస్తుంది.
అనిశ్చితమైన వర్షపాతం జిల్లాలో ప్రధాన సమస్య. చాలా సంవత్సరాలు అనావృష్టి సంవత్సరాలుగా పరిగణింపబడుతున్నాయి. అలాగే త్రాగు నీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఫ్లోరోసిస్ సమస్య కూడా కొన్నిచోట్ల ఉంది. నీటి వనరులను పరిరక్షించే విధానాలు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతంలోని "పోడు" వ్యవసాయం ఇందుకు ముఖ్యమైన కారణాలు. జిల్లాలో ఎక్కువ భాగం నేల ఉపరితలం గట్టిగా ఉన్నందున నీరు ఇంకే అవకాశం తక్కువ. అందుకు తోడు అధిక భూభాగం వాలుగా ఉన్నది గనుక నీరు నిలవదు. వరి, చెరకు పంటలకు ఎక్కువ నీటిని వాడుతారు.
జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు: నారాయణపురం డాం (మద్దివలస రిజర్వాయిర్, నాగావళి), గొట్టా బారేజి (వంశధార), కళింగాంధ్ర ప్రాజెక్టు (మహేంద్ర తనయ) మచిలేశం, కళింగపట్నం, నువ్వలరేవు, భావనపాడు, బారువలు ముఖ్యమైన మత్స్య పరిశ్రమ కేంద్రాలు.[మూలం అవసరం]
పరిశ్రమలు
జిల్లాలో ముఖ్యపరిశ్రమలు: చక్కెర, నూనె, జీడిపప్పు, జనపనార, పేపర మిల్లు కర్మాగారాలు ఉన్నాయి. మాంగనీసు, గ్రాఫైటు, సున్నపు రాయి, మైకా, గ్రానైట్, జిల్లా తీరప్రాంతంలోని ఇసుకలో మోనజైట్, ఇతర ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. పైడిభీమవరం, రాజాం, మడపాం, ఆమదాలవలస, సంకిలి పట్టణాలలో పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. [మూలం అవసరం]
Remove ads
సంస్కృతి
ప్రధాన భాష తెలుగు. అయితే, ఒడిశా రాష్ట్రానికి సరిహద్దు కావడంచేత ఒడియా భాషను కొంతమంది అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు.
పర్యాటకం




శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం, బలగ ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో రెండు కోట్లమంది పైచిలుకు, 2016లో కోటీ అరవైలక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[9] పర్యాటకుల సంఖ్య విషయంలో 2017లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత రెండవ స్థానం పొందింది.
- శ్రీకాకుళం: శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి, కోటేశ్వరస్వామి ఆలయము (గుడివీధి), సంతోషిమాత ఆలయం (పాతశ్రీకాకుళం), వెంకటేశ్వరఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం, జమియా మసీదు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు.
- శ్రీకూర్మం: శ్రీకాకుళం నగరానికి 15 కి.మీ. దూరంలో ఉన్న శ్రీకూర్మం దేశంలో బహుశా ఒకే ఒక కూర్మావతార మందిరం. విశిష్టమైన శిల్పకళ కలిగిన ఈ మందిరంలో లభించిన శాసనాలు చారిత్రికంగా కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇక్కడ డోలోత్సవం ప్రధాన ఉత్సవం.
- శాలిహుండం: ఇది శ్రీకాకుళం పట్టణానికి 18 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ పురావస్తుశాఖ త్రవ్వకాలలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు బయటపడ్డాయి.
- శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం, ముఖలింగం
- కళింగపట్నం దీప స్తంభం, కళింగపట్నం
- కవిటి: సోంపేట, ఇచ్ఛాపురాల మధ్య ఉన్న కవిటిని 'ఉద్దానం' (ఉద్యానవనం) అని కూడా అంటారు. కొబ్బరి, జీడిమామిడి, పనస వంటి తోటలతో ఇది రమణీయంగా ఉండే ప్రదేశం. శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరం. ఇక్కడ చింతామణి అమ్మవారి, శ్రీ సీతారామ స్వామి ఆలయం ఉన్నాయి.
- బారువ: ఇది శ్రీకాకుళం పట్టణానికి 109 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహేంద్ర తనయ నది సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన ఓడరేవు. ఇది కొబ్బరి తోటలకు, కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్రం.
- తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం, తేలినీలాపురం: ఇది శ్రీకాకుళం పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఒక సంరక్షిత పక్షి ఆవాస కేంద్రం. సైబీరియా నుండి శీతకాలంలో పెలికన్ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి.
- దంతపురి: ఇది శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉంది. దీనిని బౌద్ధ జ్ఞానదంతపురి అని కూడా అంటారు. క్రీ.పూ.261లో అశోకుని కళింగ యుద్ధం తరువాత ఇది కళింగరాజులకు ప్రాంతీయ రాజధానిగా ఉంది. ఇక్కడ పురావస్తు శాఖవారి త్రవ్వకాలలో అనేక పురాతన వస్తువులు లభించాయి.
- సంగం: శ్రీకాకుళానికి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నాగావళి, వంశధార, సువర్ణముఖి నదులు కలుస్తున్నాయి. ఇక్కడ సంగమేశ్వర మందిరం ఐదు లింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధం. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది.
- పొందూరు: ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరు లోనే. ఇది జిల్లా కేంద్రానికి 21 కి.మీ. దూరంలో ఉంది.
- కొరసవాడ: ప్రఖ్యాతి గాంచిన మంచు తాతాయ్య చెనెత వస్త్రములు తయారయ్యేది జిల్లాలోని కొరసవాడ లోనే. ఇది శ్రీకాకుళానికి 55 కి.మీ. దూరంలో ఉంది.
- మందస: సోంపేటకు 26 కి.మీ. దూరంలో ఉంది. మహేంద్రగిరి కొండ దిగువున ఉన్న ఈ వూరిలో 700 సంవత్సరాల పురాతన వాసుదేవ ఆలయం ఉంది. ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా చెప్పబడుతుంది.
- రావివలస - ఎండలమల్లన్న దేవాలయం
- పాతపట్నం - నీలమణి అమ్మవారు దేవాలయం
Remove ads
ప్రముఖులు


సాహితీవేత్తలు
- గిడుగు రామమూర్తి పంతులు - వ్యావహారిక భాష వాడకాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలుపరచిన వైతాళికుడు
- గరిమెళ్ళ సత్యనారాయణ - కవి, స్వాతంత్ర్య సమర యోధుడు
- కాళీపట్నం రామారావు - కథా రచయిత
- దీర్ఘాసి విజయభాస్కర్ - నాటక రచయిత, కవి, కథకులు, (కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత)
- రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి)-రచయిత, సాహితీ వేత్త
- గెడ్డాపు సత్యం - పద్యకవి, సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త.
- పింగళి నాగేంద్రరావు (రచయిత)
- వడ్రంగి రామారావు (భావశ్రీ)- రచయిత, సాహితీవేత్త
- అట్టాడ అప్పలనాయుడు - రచయిత
- బలివాడ కాంతారావు - నవలా రచయిత
- ఛాయరాజ్ - రచయిత, సాహితీ పరిశోధకుడు
- మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి - రచయిత, సాహితీవేత్త
- దూసి ధర్మారావు - రచయిత, సాహితీకారుడు.
- కళాకారులు
- చట్టి పూర్ణయ్య పంతులు - నాటక రంగానికి ఎనలేని సేవ చేశాడు
- అమరపు సత్యనారాయణ - రంగస్థల కళాకారుడు
- యడ్ల గోపాలరావు - రంగస్థల కళాకారుడు
- దూసి బెనర్జీ భాగవతార్ - హరికథకుడు
- లోకనాథం నందికేశ్వరరావు - మిమిక్రీ కళాకారుడు
- శ్రీపాద పినాకపాణి - సంగీతకారుడు
- వడ్డాది పాపయ్య - చిత్రకారుడు
- జి.ఆనంద్ - (గాయకుడు)
- జె.వి.సోమయాజులు (తెలుగు చలనచిత్ర నటుడు)
- గజల్ శ్రీనివాస్
- మిమిక్రీ శ్రీనివాస్
- శరత్ బాబు (చలనచిత్ర నటులు)
- షకలక శంకర్ (జబర్దస్త్ ఫేమ్)
- రావి కొండలరావు
- జి.ఆనంద్,
- జె.వి.సోమయాజులు
- క్రీడాకారులు
- కోడి రామమూర్తి - పహిల్వాన్
- కరణం మల్లీశ్వరి - ఒలింపిక్ విజేత
- పూజారి శైలజ - క్రీడాకారిణి
- నీలంశెట్టి లక్ష్మి - క్రీడాకారిణి
- స్వాతంత్ర్య సమరయోధులు
- వీర గున్నమ్మ - స్వాతంత్ర్య సమర యోధులు
- జననాయక్. చౌదరి సత్యనారాయణ - స్వాతంత్ర్య సమర యోధులు
- గౌతు లచ్చన్న - స్వాతంత్ర్య సమర యోధులు,
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads