సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్

స్వాతంత్ర్య సమర యోధుడు, స్వరాజ్య ఏకీకరణ చేసినవారు From Wikipedia, the free encyclopedia

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
Remove ads

భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌ లోని నాడియార్‌లో జన్మించారు.[1] ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంuచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, భారత ఉప ప్రధాన మంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది.

త్వరిత వాస్తవాలు రాష్ట్రపతి, మునుపు ...
Remove ads

తొలినాళ్ళ జీవితం

బాల్యం, విద్యాభ్యాసం

Thumb
బాల్యంలో వల్లభ్‌భాయ్ పటేల్

ఈనాటి గుజరాత్‌లోని నడియాడ్‌లో వ్యవసాయదారుల కుటుంబంలో ఝవేరీభాయ్ పటేల్, లాడ్‌బా దంపతుల ఆరుగురు సంతానంలో నాలుగవవాడిగా వల్లభ్‌భాయ్ పటేల్ జన్మించాడు.[నోట్స్ 1] స్వరాజ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నవాడు అయిన విఠల్ భాయ్ పటేల్ ఇతని స్వంత అన్న. ఇతను పుట్టింది 1875 అక్టోబరు 31 అని రికార్డుల్లో నమోదైనా అసలు పుట్టిన తేదీ ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. వారి స్వగ్రామమైన కరమ్‌సాడ్‌లో గుజరాతీ మాధ్యమంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు. గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక చిన్ననాటి నుంచి ఉన్న వల్లభ్‌భాయ్, దానికి మార్గం ఇంగ్లీష్ విద్యాభ్యాసమేనని నమ్మాడు. అందుకోసం తండ్రిని కోరి, ఇబ్బందుల మధ్య ఆంగ్లమాధ్యమంలో చదువు ప్రారంభించి కరమ్‌సాడ్‌లో మూడవ తరగతి వరకూ, పెట్‌లాద్‌లో ఐదవ తరగతి వరకూ, నడియాడ్‌లో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు.[2] చదువుకుంటున్న దశలోనే పదహారో ఏట పెద్దల నిశ్చయం మేరకు పన్నెండేళ్ళ వయసున్న ఝవేర్‌బాని పెళ్ళిచేసుకున్నాడు, పెళ్ళి తర్వాత వల్లభ్‌భాయ్ స్థిరపడేదాకా ఆమె పుట్టింట్లోనే ఉండేది. మెట్రిక్యులేషన్ పూర్తయ్యేసరికే ఇరవై రెండేళ్ళు పూర్తికావడంతో త్వరగా ప్లీడర్ కావాలన్న ఆలోచనతో ఇంటివద్దే ఉంటూ స్వంతంగా చదువుకుని మూడేళ్ళలోనే డిస్ట్రిక్ట్ ప్లీడర్స్ కోర్స్ పరీక్షకు కూర్చుని విజయం సాధించాడు.[3]

న్యాయవాదిగా కెరీర్, వైవాహిక జీవితం

అప్పటికే తన అన్న విఠల్‌భాయ్ పటేల్ న్యాయవాదిగా గోధ్రాలో కొన్నాళ్ళు ప్రాక్టీసు చేసి, బోర్సాద్ వచ్చి స్థిరపడడంతో అతని ప్రాక్టీసు, పరిచయాలు తనకు పనికిరావచ్చని ప్రాక్టీసుకు గోధ్రాని ఎన్నుకున్నాడు. 1900 ప్రాంతంలో గోధ్రాకి భార్యతో సహా వెళ్ళి కాపురం పెట్టి, ప్రాక్టీసు ప్రారంభించాడు. దురదృష్టవశాత్తూ, కొద్దికాలానికే గోధ్రా ప్రాంతంలో ప్లేగ్ వ్యాధి వ్యాపించడంతో తనకు కూడా వ్యాధి సోకింది. కుటుంబ సభ్యులను నడియాడ్ పంపించి ఒక దేవాలయంలో ఐసోలేషన్‌లో ఉండి నయంచేసుకున్నాడు. 1902లో విఠల్‌భాయ్‌కి స్థానిక న్యాయశాఖాధికారులు, రెవెన్యూ అధికారితో వివాదాలు జరగడంతో వాటి విషయంలో సాయం చేసే ఉద్దేశంతో ప్రాక్టీసును గోధ్రా నుంచి బోర్సాద్ మార్చుకున్నాడు. చాకచక్యంతో ఆ సమస్యలను పరిష్కరించడమే కాకుండా బోర్సాద్‌లో మంచి ప్రాక్టీసు సంపాదించాడు.[4]

వల్లభ్‌భాయ్ పటేల్‌కి ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవాలని మొదటి నుంచి కోరిక ఉండేది, న్యాయవాది అయ్యాకా లండన్‌లో బారిస్టర్ చదవాలన్న ఆలోచన బలపడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి పెద్ద బాగుండకపోవడంతో విదేశాలకు వెళ్ళడానికి, చదువుకోవడానికి అవసరమయ్యే ఖర్చులకు డబ్బు తానే సంపాదించుకుని వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఇందుకోసం బాగా డబ్బు సంపాదించడానికి గాను త్వరగా తేలిపోయే క్రిమినల్ కేసుల్లోనే ప్రాక్టీసు చేసేవాడు, సివిల్ కేసులు అత్యంత అరుదుగా తప్ప తీసుకునేవాడు కాదు. క్రిమినల్ కేసుల్లో నిందితుల తరఫున సమర్థవంతుడైన డిఫెన్స్ లాయర్‌గా పేరుపొందాడు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్షుల నుంచి వాస్తవాలను రాబట్టడంలోనూ, ఆధారాలను సూక్ష్మంగా పరిశీలించి కేసును అనుకూలంగా తిప్పడంలోనూ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. వల్లభ్‌భాయ్ పటేల్ ప్రతీ ముఖ్యమైన క్రిమినల్ కేసులోనూ దాదాపుగా నిందితులను నిర్దోషులుగా నిరూపిస్తూ తీర్పులు సాధిస్తూండడంతో ఒక దశలో ప్రత్యేక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బెంచిని బోర్సాద్ నుంచి ఆనంద్ పట్టణానికి ప్రభుత్వం మార్చాల్సివచ్చింది. వల్లభ్‌భాయ్ తన ప్రాక్టీసును అక్కడికి మార్చుకోవడం ప్రయత్నం నిష్ఫలమై ఏడాదిలో మళ్ళీ బెంచ్‌ని బోర్సాద్ తీసుకువచ్చేశారు.[4] ఈ దశలోనే వల్లభ్‌భాయ్ పటేల్, ఝవేర్‌బా దంపతులకు కుమార్తె మణిబెన్ (1903), కుమారుడు దహ్యాభాయ్ (1905) జన్మించారు.[3]

Thumb
బోర్సాద్‌లో డిస్ట్రిక్ట్ ప్లీడరుగా పనిచేస్తున్నప్పుడు పటేల్

1905 నాటికి ఆర్థికంగానూ, కుటుంబపరంగానూ తాను అనుకున్నవన్నీ చక్కబరుచుకుని ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవడానికి ఏర్పాట్లు ప్రారంభించాడు. ఆ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్న థామస్ కుక్ అండ్ సన్ కంపెనీ వారు ప్రయాణపు వివరాలను వి.జె.పటేల్ (వల్లభ్‌భాయ్ ఝవేర్‌భాయ్ పటేల్) అన్న పేరిట సిద్ధంచేసి, అదే పేరుగల అడ్రస్‌కి పంపారు. అనుకోని విధంగా పోస్టల్ వారు వి.జె. పటేల్ అన్న పొడి అక్షరాల విషయంలో పొరబడి అన్న విఠల్‌భాయ్ ఝవేర్‌భాయ్ పటేల్‌కి ఆ లేఖ, కాగితాలు పంపించారు. తాను కూడా బారిస్టర్ చదవాలని అనుకుంటున్నాననీ, అన్న కన్నా ముందు తమ్ముడు ఇలా చదువుకోవడం సరికాదని మందలిస్తూ, ఆ అవకాశాన్ని తనకే వదిలివేయాలని వల్లభ్‌భాయ్‌ని విఠల్‌భాయ్ అడిగాడు. చట్టపరంగా, నైతికంగా తనకే హక్కు ఉన్నా, పెద్దల మాటను శిరసావహించే సంప్రదాయం అనుసరించి వల్లభ్‌భాయ్ అన్నయ్యకే అవకాశం ఇచ్చాడు. అంతేకాక, విఠల్‌భాయ్ విదేశీ విద్యకు అయ్యే ఖర్చు భరించి, అన్న భార్యాపిల్లలకు తన ఇంట్లో చోటు ఇచ్చి చూసుకున్నాడు. అన్న భార్యకు (వదిన), తన భార్యకు ఈ దశలో వివాదాలు రావడంతో తన భార్యను అన్న తిరిగివచ్చేవరకూ ఆమె పుట్టింట్లో ఉంచాడు. చివరకు విఠల్‌భాయ్ పటేల్ 1908లో మూడేళ్ళకు బారిస్టరుగా తిరిగి వచ్చి బొంబాయిలో ప్రాక్టీసు ప్రారంభించాడు.[4]

భార్య మరణం

1908 చివరిలో ఝవేర్‌బాకు పేగుల్లో అనారోగ్యం బయటపడింది. ఇది తీవ్రం కావడంతో వల్లభ్‌భాయ్ తమ మకాం బొంబాయికి మార్చి వైద్యులకు చూపిస్తూ చివరకు కామా ఆసుపత్రిలో చేర్చాడు. 1909 జనవరిలో వైద్యుల భరోసా మీద ఒక ముఖ్యమైన హత్యకేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం బోర్సాద్ వెళ్ళాడు. అదే సమయంలో ఆమెకు అత్యవసర పరిస్థితి ఎదురుకావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. మరుసటి రోజు జనవరి 11 తేదీన ఝవేర్‌బా మరణించింది. కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి బాధ దిగమింగుకుని తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. 33 ఏళ్ళ వయసులో భార్య మరణించగా ఇక మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. బంధుమిత్రులు ఎంతగా ఒత్తిడిచేసినా ఆ నిర్ణయానికే కట్టుబడి, కుటుంబసభ్యుల సహకారంతో తన పిల్లలను పెంచాడు. ఆ ఏడాదే విఠల్‌భాయ్ భార్యకు కూడా అనారోగ్యం చేయడంతో ఆమెకు నయం కావడానికి సాయం చేశాడు. కాని, ఆమె కూడా మరుసటి ఏడాదే చనిపోయింది.[4]

లండన్ ప్రయాణం, బారిస్టర్ చదువు

మొత్తానికి 1910 ఆగస్టులో 35-36 ఏళ్ళ వయసులో బారిస్టరు చదువుకోవడానికి ఏర్పాట్లు చేసుకుని, పిల్లలను బొంబాయిలోని బోర్డింగ్ స్కూల్లో చేర్చి లండన్ ప్రయాణం అయ్యాడు. సాధారణంగా మూడు సంవత్సరాలు పట్టే బారిస్టరు కోర్సును బాధ్యతలు, ఆర్థిక స్థితిగతుల రీత్యా తక్కువ ఖర్చుపెట్టి ఎంత వీలైతే అంత త్వరగా పూర్తిచేసుకుని వెనక్కిరావాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం, ఓడలో ఉండగానే ప్రిలిమినరీ కోర్సుకు సంబంధించిన రోమన్ లా చదువుకోవడం, లండన్‌లో సమయం వృధా చేయకుండా రోజులో అత్యధిక సమయం గ్రంథాలయంలోనే చదువుతూ గడపడం వంటివి చేసేవాడు. మిడిల్ టెంపుల్‌లో చేరిన వల్లభ్‌భాయ్ పటేల్ అక్కడ వివిధ పేపర్లలో, పరీక్షల్లో మొదటి స్థానాన్ని సంపాదించాడు. ఏడాదిన్నరలోనే ఫైనల్ పరీక్షల్లో కూర్చుని ఆనర్స్‌తో పాసైతే కొన్ని టర్ములు మినహాయింపుతో త్వరగా కోర్సు పూర్తిచేసుకునే అవకాశం లభిస్తుందని తెలిసి ఆ ప్రయత్నం చేశాడు. ఆనర్స్‌తోనే కాక ఫస్ట్‌క్లాసులో మొదటి స్థానాన్ని సంపాదించి 50 పౌండ్ల బహుమానాన్ని కూడా పొందాడు. దీనితో 36 నెలల కోర్సును 30 నెలల్లో పూర్తిచేసి, భారతదేశం నుంచి బయలుదేరిన రెండున్నర ఏళ్ళలోగానే 1913 ఫిబ్రవరి 13న బొంబాయికి బారిస్టరుగా తిరిగివచ్చాడు.[5]

బారిస్టరుగా ప్రాక్టీసు

Thumb
1913లో బారిస్టర్లుగా వల్లభ్‌భాయ్ పటేల్ (కుడి), విఠల్‌భాయ్ పటేల్ (ఎడమ)

ఆనాటి బొంబాయి ఛీఫ్ జస్టిస్ బాసిల్ స్కాట్‌కి ఇంగ్లాండులోని తమ బంధువు ద్వారా బారిస్టర్ చదువులో వల్లభ్‌భాయ్ పటేల్ ప్రతిభా విశేషాలు తెలిశాయి. అతను వల్లభ్‌భాయ్ భారతదేశానికి రాగానే బొంబాయిలో ప్రభుత్వోద్యోగిగా కానీ, బారిస్టరుగా కానీ స్థిరపడడానికి సహాయం చేస్తానని ముందుకువచ్చాడు. అయినప్పటికీ, తన ప్రాంతంలోని అహ్మదాబాద్‌లోనే బారిస్టరుగా ప్రాక్టీసు పెట్టడానికి వల్లభ్‌భాయ్ నిశ్చయించుకున్నాడు. ఇతను విదేశాల్లో ఉండగానే విఠల్‌భాయ్ పటేల్ ప్రాక్టీసు వదిలివేసి, రాజకీయాల్లోకి దిగి, బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి సభ్యునిగా ఎన్నికయ్యాడు. దానితో, అన్నదమ్ములు ఇద్దరూ చర్చించుకుని వల్లభ్‌భాయ్ ప్రాక్టీసు చేసి తమ ఇద్దరి అవసరాలకూ, కుటుంబానికి సరిపడా సంపాదించేట్టు, విఠల్‌భాయ్ రాజకీయాల్లో కొనసాగేట్టు నిర్ణయించుకున్నారు.[6]

అహ్మదాబాద్‌లో బారిస్టరుగా వల్లభ్‌భాయ్ పటేల్ కూడా అంతకుముందు బోర్సాద్‌లోలాగానే ఎక్కువగా క్రిమినిల్ కేసులే తీసుకునేవాడు. తమ మేనమామల పట్టణమైన నడియాడ్ ఉన్న ఖేడా జిల్లా నుంచి ఎక్కువ కేసులు వచ్చేవి. పెద్ద సంఖ్యలో నేరాలు అక్కడ నమోదు అవుతూ ఉండడంతో ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వంలో ఖేడా జిల్లాకు క్రిమినల్ జిల్లాగా ముద్ర ఉండేది. ఖేడా జిల్లాకు చెందిన నిందితులను కూడా నేరస్తులుగా ముందే భావించే పద్ధతి ఉండేది. దీనితో, ఆ నిందితుల కేసులు తీసుకుని తన ప్రతిభతో పాటుగా అవసరమైన మేరకు ముక్కుసూటితనం, ధైర్యాలను ప్రదర్శిస్తూ పనిచేసేవాడని వల్లభ్‌భాయ్‌కి పేరుండేది. ఎప్పటిలానే తన నిశితమైన దృష్టిని, క్రాస్ ఎగ్జామినేషన్‌లో ప్రతిభను నమ్మి కేసుల్లో నిందితుల పక్షాన తీర్పులు వచ్చేలా చేయగలిగేవాడు. ఫీజు ఎక్కువగా తీసుకుని, తక్కువ కేసులు చేస్తూ, అవసరమైన డబ్బు మాత్రం సంపాదిస్తూ మిగిలిన సమయాన్ని గుజరాత్ క్లబ్‌లో బ్రిడ్జి ఆట ఆడుతూ గడిపేవాడు.[6]

Remove ads

జాతీయ నేతగా

Thumb
1940, బాంబే, ఏ.ఐ.సి.సి. మీటింగులో గాంధీ, మౌలానా ఆజాద్ లతో పటేల్.

బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జరుగుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928లో బార్డోలీలో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది.

గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసారు.

1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు.

Remove ads

రాజ్యాంగ సభ సభ్యుడిగా

భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు.

కేంద్ర మంత్రిగా

Thumb
వల్లభాయి పటేల్ జాతీయ స్మారకమందిరం ప్రధాన హాలు.

దేశ స్వాతంత్ర్యం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను, ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు.

నెహ్రూతో విబేధాలు

భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ను గెలిపించారు.

Remove ads

భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మూడవ స్థానంలో ఎంపికైయ్యాడు.[7]

మరణం

Thumb
ఏకత్వ చిహ్నం

1950 డిసెంబరు 15 న వల్లబ్ భాయి పటేల్ కన్నుమూశాడు. ముంబాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర్య సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు, నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.

ఐక్యతా ప్రతిమ

భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబరు 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఎకత్వ చిహ్నము) అని పిలుస్తున్నారు.గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది.

ఈ విగ్రహన్ని, భారత ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మోడీ గారు, 2018 అక్టోబరు 31 న అత్యంత ఘనంగా ఆవిష్కరించారు.[8]

Remove ads

బిరుదులు:"సర్దార్,"

'భారత ఉక్కుమనిషి'

1991లో భారత ప్రభుత్వం వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి భారత రత్న బిరుదును మరణానంతరం ప్రకటించింది.

సంస్థలు, స్మారకాలు

Thumb
పటేల్ విగ్రహం, పటేల్ చౌక్, కాత్రా గులాబ్ సింగ్, ప్రతాప్ గఢ్, ఉత్తరప్రదేశ్.
Remove ads

ఇవి కూడా చూడండి

త్వరిత వాస్తవాలు
త్వరిత వాస్తవాలు

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads