ఇంగ్లీషు భాష

వెస్ట్ జర్మానిక్ భాష From Wikipedia, the free encyclopedia

Remove ads

భౌగోళిక విభజన

Thumb
ప్రపంచంలో ఆంగ్లభాషను ప్రాంతీయ భాషగా వాడే దేశాలను సూచించే పై-చార్ట్.

ఆంగ్ల భాష సంక్షిప్త చరిత్ర

మనం ఈ నాడు “బ్రిటిష్ దీవులు" అని పిలచే భూభాగంలో పూర్వం ఐదు రాజ్యాలు ఉండేవి. వాటిలో ప్రజలని ఇంగ్లీశు వాళ్లు, బ్రిటన్ వాళ్లు, స్కాట్ వాళ్లు, పిక్ట్ వాళ్లు, లేటిన్ వాళ్లు అని పిలచేవారు. వీరు వేర్వేరు భాషలు మాట్లాడేవారు. వీరందరిలోను ముందు ఈ దీవులలో నివసించటానికి వచ్చిన వాళ్లు బ్రిటన్ లు; అందుకనే ఈ దేశానికి బ్రిటన్ అనే పేరు సిద్ధించింది. తరువాత సా. శ. 43 లో రోము నుండి చక్రవర్తి క్లాడియస్ పంపిన వలస ప్రజలు వచ్చి బ్రిటన్ లో స్థిరపడటం మొదలు పెట్టేరు. చూరు కింద తలదాచుకుందుకని వచ్చి ఇంటినే ఆక్రమించిన తీరులో రోమకులు బ్రిటన్ ని ఆక్రమించి ఐదు శతాబ్దాలు పాలించేరు. అప్పుడు గాత్ అనే మరొక తెగ వారు రోమకులని ఓడించి దేశం నుండి తరిమేశారు. అప్పుడు ఈ గాత్ తెగని పడగొట్టటానికి పిక్ట్ లు, స్కాట్ లు ప్రయత్నించేరు. వీళ్లని ఎదుర్కొనే శక్తి లేక బ్రిటన్ మళ్లా రోమక ప్రభువులని ఆశ్రయించక తప్ప లేదు. కాని ఆ సమయంలో రోములో వారి ఇబ్బందులు వారికి ఉండటంతో వారు సహాయం చెయ్యలేక పెదవి విరచేరు. గత్యంతరం లేక బ్రిటన్ లు ఐరోపాలో, నేటి జర్మనీ ప్రాంతాలలో, ఉండే సేక్సన్ లు అనే మరొక తెగని పిలుచుకొచ్చేరు. వారు బ్రిటన్ తీరానికి మూడు పడవలలో సా. శ. 449 లో వచ్చినట్లు చారిత్రకమైన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు వారు మాట్లాడిన భాషనే ఇప్పుడు మనం "పాత ఇంగ్లీశు" అంటున్నాం. దీన్నే ఏంగ్లో-సేక్సన్ అని కూడా అంటాం.

ఒక భాషలోని మాటలే ఆ భాష యొక్క పడికట్టు రాళ్లు. పదసంపదే భాషకి రూపు రేఖలని ఇస్తుంది, ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఏదైనా కొత్త భాషని నేర్చుకునేటప్పుడు ఉచ్చారణని, వ్యాకరణాన్ని అవుపోశన పట్టటం అంత కష్టం కాదు. కాని ఆ భాషలోని పద సంపద మీద ఆధిపత్యం సంపాదించటానికి చాల కాలం పడుతుంది. ఒక భాషని అనర్గళంగా మాట్లాడాలంటే ఆ భాషలోని పదాలు త్వరత్వరగా స్పురణకి రావాలి. ఇంగ్లీశు విషయంలో ఇది కష్టం. ఎందుకంటే ఇంగ్లీశు చీపురుకట్ట లాంటి భాష. వాకట్లో చీపురు పెట్టి తుడిస్తే చేరే ద్రవ్యరాశిలో ఆకులు, అలములు, చితుకులు, చేమంతులు, రెట్టలు, పెంటికలు, ..., ఇలా సమస్తం ఉంటాయి. అలాగే ఇంగ్లీశు ఎవరి వాకిట్లోకి వెళ్ళినా అక్కడి సామగ్రిని అంతా సేకరించి మమేకం చేసుకుంది. అందుకనే ఇంగ్లీశు మాటల్లో కాని, వర్ణక్రమంలో కాని ఒక నియమం, నిబంధన, వరస, వావి కనబడవు. అందుకనే నేటి ఇంగ్లీశు పదసంపదలో మూల భాష అయిన జెర్మన్ వాసనలు తక్కువగానే కనిపిస్తాయి.

ఇంగ్లీశు భాషకి మరొక ప్రత్యేకత ఉంది. చెలగాటాలాడటానికి ఇంగ్లీశు సులభంగా లొంగుతుంది. ఇంగ్లీశు భాషతో కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యటం తేలిక. చేసినవాళ్లని ఇతరులు తిరస్కరించరు, తూష్ణీంభావంతో చూడరు. సంప్రదాయ విరుద్ధంగా ఇంగ్లీశులో కొత్త మాటలు సృష్టించటం తేలిక. "మా భాషని కల్తీ చేసి అపవిత్రం చెయ్యకండి" అని ఇంగ్లీశు మాట్లాడేవారెవరూ ఇంతవరకు అనగా వినలేదు. ఉన్న మాటలని సాగదీసి, ఒంచి, మలచి, కొత్తకొత్త ప్రయోగాలు చెయ్యటంలో ఇంగ్లీశు రచయితలు అగ్రగణ్యులు. ధైర్యం చేసి, ఉన్న మాటలని మడచిపెట్టి ప్రయోగించటంలో షేక్స్ పియర్ దిట్టతనం ప్రదర్శించేడు.

ఇంగ్లీశు భాష తల్లివేరు జెర్మన్ భాషలో ఉండటం ఉంది కాని, ఏంగ్లో-సేక్సన్ లు బ్రిటన్ లో వచ్చి స్థిరపడే నాటికే వారి భాష అయిన జెర్మన్ మీద లేటిన్ ప్రభావం బాగా పడిపోయింది. అందుకనే ఇంగ్లీశు మీద లేటిన్ ప్రభావం మొదట్లో ఎక్కువగా ఉండేది. క్రైస్తవ మతగ్రంధాలు, పూజలు, పురస్కారాలు లేటిన్ లో ఉండేవి కనుక వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు, విద్యారంగంలోనూ లేటిన్ పదజాలం పాతుకు పోయింది.

తరువాత స్కేండినేవియా నుండి వైకింగులు దండయాత్ర చేసి ఒక శతాబ్దం పాటు - సా. శ. 780 నుండి 880 వరకు - బ్రిటన్ తో చిల్లర మల్లర యుద్ధాలు చేసేరు. ఈ సమయంలో ఆ ప్రాంతాల పదజాలం ఇంగ్లీశులో కలిసిపోయింది. నిజానికి పదవ శతాబ్దం వరకు ఈ భాషని "ఇంగ్లీశు" అనే పేరుతో వ్యవహరించనే లేదు.

పెను తుపానులా వచ్చి ఇంగ్లీశుని కూకటి వేళ్లతో కుదిపేసిన భాష ఫ్రెంచి భాష. సా. శ. 1066 తరువాత బ్రిటన్ మీద ఫ్రెంచి వారి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. దానితోపాటు ఫ్రెంచి వారి ధర్మశాస్త్రం, స్థాపత్య శాస్త్రం, సంగీతం, లలితకళలు, సాహిత్యం బ్రిటన్ మీద విపరీతమైన ప్రభావం చూపించటం మొదలు పెట్టేయి. జెర్మన్ సంప్రదాయాలని ఆసరా చేసుకున్న ఆంగ్లో-సేక్సన్ ఆచార వ్యవహారాలు ఫ్రెంచి దృక్పథానికి కట్టుబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాత కొత్తల కలయికతో సమానార్ధకాలయిన పాత మాటలు, కొత్త మాటలు పక్క పక్కన నిలబడి మనుగడ కొనసాగించేయి. కొన్ని పాత మాటలు కొత్త అర్ధాన్ని సంతరించుకున్నాయి.

తరువాత బ్రిటన్ ప్రపంచ వ్యాప్తంగా వలస రాజ్యాలు స్థాపించి ఏలుబడి చెయ్యటంతో పదహారవ శతాబ్దానికే ప్రపంచ భాషలలోని మాటలు ఇంగ్లీశులో జొరబడటం మొదలు పెట్టేయి. అప్పటికే ఐరోపాలో నవజాగృతి యుగం తలెత్తటం, విజ్ఞానశాస్త్రం వేగం పుంజుకోవటంతో గ్రీకు మాటలు తండోపతండాలుగా వచ్చి ఇంగ్లీశులో పడ్డాయి. ఇంగ్లీశు ఇలా కొత్త అందాలతో వెలుగుతూ ఉంటే ఇంగ్లీశులో మాతృఛాయలు పూర్తిగా నశించిపోతున్నాయని కొందరు ఆరాటపడ్డారు. ఎవరెంతగా ఆరాట పడ్డా ఇంగ్లీశు మీద పరభాషా ప్రభావం పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గ లేదు.

తరువాత ఇంగ్లీశుని ఎక్కువగా ప్రభావితం చేసింది అమెరికాలో మాట్లాడే ఇంగ్లీశు. అమెరికాలో ఇంగ్లీశు వర్ణక్రమం మారిపోయింది. భ్రిటన్ లో వాడే మాటలకి సమానార్ధకాలైన కొత్త మాటలు ఎన్నో అమెరికాలో పుట్టుకొచ్చేయి. అమెరికాకి స్వరాజ్యం వచ్చిన కొత్తలో బ్రిటన్ మీద ఉండే తిరస్కార భావమే ఈ మార్పుకి ప్రేరణ కారణం.

ఇప్పుడు ప్రపంచీకరణ, కలనయంత్రాలు, అంతర్జాలం వచ్చేక పరభాషా పదాలు, పారిభాషిక పదాలు తొంబతొంబలుగా వచ్చి ఇంగ్లీశులో చేరుతున్నాయి. కేవలం పది శతాబ్దాల క్రితం పుట్టిన ఒక భాష ఇలా ఏకైక ప్రపంచ భాషగా చెలామణీ అవటం చూస్తూ ఉంటే నివ్వెరపాటు కలగక మానదు. డేటా అనేది చాలా ముఖ్యమైన విషయం.

Remove ads

భారత్ లో ఆంగ్ల భాష

భారతదేశంలో ఆంగ్ల భాషకు చెందిన అనేక మాండలికాలను ఉపయోగిస్తున్నారు. ఈ మాండలిక ఉపయోగం బ్రిటిష్ రాజ్ కాలంలో ప్రారంభమయ్యింది. ఈ భాష సహ-రాజ భాషగా ఉపయోగింపబడేది. ప్రస్తుతమునూ ఇదే విధంగా ఉపయోగంలో ఉంది. దాదాపు తొమ్మిది కోట్ల మంది ఈ భాషను ఉపయోగిస్తున్నారు. మొదటిభాషగా దాదాపు మూడు లక్షలమంది వాడుతున్నారు.[1] భారత్ లో ఉపయోగించేభాష, శుద్ధ ఆంగ్ల భాష గానూ, ఇంగ్లాండులో ఉపయోగించే భాష తరువాత గ్రాంధిక భాషోపయోగ దేశంగా భారత్ కు పేరున్నది. భారతదేశంలో ఉపయోగించే ఆంగ్ల వ్యాకరణం మంచి పరిపుష్టి కలిగినదిగా భావింపబడుతుంది.సరస్వతీదేవి భారతదేశానికి ఇచ్చిన గొప్పవరం ఆంగ్లభాష అన్నారు Mr.రాజాజీ .

ఈ రోజుల్లో ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యం దృష్ట్యా చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా దీనిని నేర్చుకొంటున్నారు .

ఆంగ్లం ఎక్కువగా వాడే దేశాలు

మరింత సమాచారం ర్యాంకు, దేశం ...
Remove ads

ఆంధ్ర ప్రదేశ్ లో ఆంగ్ల భాష

ప్రభుత్వ ప్రైవేటు రంగ వ్యవహారాలలోనూ, ప్రభుత్వ ప్రభుత్వేతర రంగ ఉత్తర్వులలోనూ, ప్రకటనలలోనూ, వివిధరంగాల ఉత్తర ప్రత్త్యుత్తరాలలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు.

తెలుగువారు పలికే ఆంగ్ల పదాలు

తెలుగు నిఘంటువులో చేరాల్సిన ఇంగ్లీశు పదాలు. నిఘంటువులలోని పదాల సంఖ్య పెరిగే కొద్దీ ఆ భాష శక్తివంతమవుతుంది. పరాయి భాషలకు చెందిన పదాలనే వ్యతిరేకతతో ప్రజల్లో పాతుకుపోయిన పదాలనుకూడ మనం నిఘంటువులలో చేర్చుకోకపోయినందు వలన మన తెలుగు నిఘంటువు చిక్కిపోయింది. ఇంగ్లీశు నిఘంటువు మాత్రం ఏటేటా కొత్తపదాలతో బలిసిపోతోంది.మన తెలుగులో దీటైన పదాలు పల్లెప్రజల్లో వాడుకలో ఉన్నా మన నిఘంటువులో ఆ పదాలు చోటుచేసుకోలేదు. ఒకవేళ పై ఇంగ్లీశు పదాలకు అర్థాలు చెప్పాలన్నా సంస్కృత పదాలు వాడుతారుగానీ, తెలుగు పదాలు వాడరు. వాడటం అవమానకరంగా భావిస్తారు. తెలుగు ప్రజలు పుట్టించినవి, ఎంత నీచమని మనం అనుకొనే పదాలైనా నిఘంటువులో చేరాలి. మన మాటల్ని పోగొట్టుకోకూడదు. అలాగే సంస్కృతపదం అర్ధంకాకపోయినా మన తెలుగు పదంలాగానే భావించి ఆదరిస్తాం. వేలాది ఉర్దూ, ఇంగ్లీశు పదాలు మన తెలుగు ప్రజల వాడుకలోకి వచ్చాయి.

Remove ads

తెలుగునాట ఆంగ్లభాష ఉపయోగంపై విమర్శలు

మాతృ భాష అంటే పసిపిల్ల వాడికి తల్లి ఉగ్గుపాలతో పాటు రంగరించి పోసే భాష. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్‌, బ్యాగు, బుక్కు, స్లేట్‌ పెన్సిల్‌ లాంటి మాటలు తెలుగు తల్లులు తమ పిల్లలకు రంగరించి పోస్తున్నారు. బయట పాఠశాల, ఆఫీసు, మార్కెట్టు, కోర్టుల్లో ఎన్నెన్నో పదాలు ఎడతెరిపి లేకుండా వాడుతున్నారు. మాటకు వాడుకే గదా ప్రాణం? వాడకం అంతా ఆంగ్లపదాల్లో జరుగుతూఉంటే తెలుగు గ్రంథానికి పరిమితమై పోయింది. కవులు, సాహితీవేత్తలు మాత్రమే భాష గురించి బాధపడుతున్నారు. పాలక భాషకు ఉండవలసినంత పదసంపద ఎన్నేళ్లు గడిచినా సమకూర్చలేక పోతున్నారు.

అనువాదకులు తేటతెలుగుకు బదులు సంస్కృతం వాడి భయపెడుతున్నారు. కాలగమనంలో కొత్త కొత్త ఆంగ్లపదాలే మనకు అబ్బు తున్నాయిగానీ, కొత్త తెలుగు పదాలుగానీ, పాతవేగాని కొత్తగా వాడకంలోకి రావడం లేదు. ఇది మన జాతి చేతకానితనం, దౌర్భాగ్యం. పైన పేర్కొన్న వందలాది పదాలేగాక ఇంకెన్నో ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. ఉర్దూ, సంస్కృత పదాలెన్నింటటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీశు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది. సంస్కృత, ఉర్దూ పదాలు వేలాదిగా తెలుగులో చేరకపోయి ఉన్నట్లయితే తెలుగు భాషకీపాటి శక్తి వచ్చి ఉండేది కాదు గదా?

కొందరికి పూర్తిగా ఆంగ్లభాషపై వెర్రి వ్యామోహం ఉంటుంది. అలాకాకుండ వాస్తవస్థితిని గ్రహించి మనభాషను రక్షించుకుంటూ, ఆంగ్లపదాలను వాడుకోవడం తెలివైన పద్ధతి. లెక్కల మాస్టరు 2+2=4 అనే దాన్ని రెండు ప్లస్‌ రెండు ఈజ్‌ ఈక్వల్‌టు నాలుగు అంటాడు. ఇప్పటి వరకు ప్లస్‌, ఈజీక్వల్టు, మైనస్‌, ఇంటు లాంటి ఆంగ్ల పదాలకు సమానార్ధక పదాలను కల్పించి లెక్కలు చెప్పలేదు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ప్లస్‌, మైనస్‌ అనే శబ్దాలనే వాడుతున్నారు. గత్యంతరం లేదు, అనుకున్న ఆంగ్ల పదాలను మాత్రం తెలుగు నిఘంటువులో చేర్చటం అవశ్యం, అత్యవసరం. వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాష పదాలు కూడా కావచ్చు. మనం తెలుగును సరిగా నేర్చుకోక ముందే మనకు ఇంగ్లీశు నేర్పారు. వందలాది ఏళ్ళు మనం ఇంగ్లీశును గత్యంతరం లేక హద్దు మీరి వాడినందు వల్ల, అది మన భాషాపదాలను కబళించి తానే తెలుగై మనలో కూర్చుంది. మన ఆత్మలను వశం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇంగ్లీశు పదాలను నిర్మూలించటం మన తరం కాదు. వాటిని మన పదాలుగా అంగీకరించటమే మంచిది. ఏఏటికాయేడు మన నిఘంటువుకి పదసంపద సమకూర్చాలి. మరోభాషా పదం మనలో పాతుకు పోకూడదనే ఆశయం ఉంటే, మనభాషలోనే కొత్త పదాలను సృష్టించటమే గాక, వాటిని ప్రజలంతా నిరంతరం వాడుతూ ఉండాలి.

ఇంగ్లీశు-తెలుగు అనువాద సమస్యలు

Remove ads

ఇవీ చూడండి

ఇంగ్లీశు-తెలుగు అనువాద సమస్యలు

ఆంగ్ల కవులు:

భారత ఆంగ్ల కవులు:

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads