ట్వంటీ20
From Wikipedia, the free encyclopedia
Remove ads
ట్వంటీ 20 (T20) అనేది క్రికెట్ ఆటలో ఒక సంక్షిప్త ఆట పద్ధతి. వృత్తిపరమైన స్థాయిలో దీన్ని, ఇంగ్లాండులో కౌంటీల మధ్య జరిగే పోటీల్లో 2003 లో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రవేశపెట్టింది. [1] ఒక ట్వంటీ20 గేమ్‌లో, రెండు జట్లూ ఒక్కో ఇన్నింగ్స్ ఆడతాయి. ఇన్నింగ్సుకు గరిష్ఠంగా 20 ఓవర్లుంటాయి. ఫస్ట్-క్లాస్, లిస్ట్ A క్రికెట్‌తో కలిపి, ట్వంటీ 20 అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అత్యున్నత అంతర్జాతీయ లేదా దేశీయ స్థాయిలో గుర్తింపు పొందిన మూడు క్రికెట్ రూపాల్లో ఒకటి.

ఒక సాధారణ ట్వంటీ20 గేమ్ దాదాపు రెండున్నర గంటల్లో పూర్తవుతుంది. ఒక్కో ఇన్నింగ్స్ దాదాపు 70 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇన్నింగ్స్ మధ్య అధికారికంగా 10 నిమిషాల విరామం ఉంటుంది. ఇది ఆట యొక్క మునుపటి రూపాల కంటే చాలా చిన్నది, ఫుట్‌బాల్ వంటి జనాదరణ పొందిన ఇతర జట్టు క్రీడల సమయ వ్యవధికి దగ్గరగా ఉంటుంది. గ్రౌండ్‌లోని ప్రేక్షకులకు, టెలివిజన్‌లోని వీక్షకులకూ ఆకర్షణీయంగా ఉండే వేగవంతమైన గేమ్‌ను రూపొందించడానికి దీన్ని ప్రవేశపెట్టారు.
క్రికెట్ ఆట ప్రపంచమంతటా విస్తరింపజేయడంలో ఈ గేమ్ విజయవంతమైంది. చాలా అంతర్జాతీయ పర్యటనలలో కనీసం ఒక ట్వంటీ20 మ్యాచ్ అయినా ఉంటోంది. టెస్ట్ ఆడే దేశాలన్నిటి లోనూ దేశీయంగా ఒక టీట్వంటీ పోటీ ఉంది.
Remove ads
చరిత్ర
మూలాలు

2002లో బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్ ముగిసినప్పుడు, దాని స్థానంలో మరొక వన్డే పోటీని నిర్వహించాల్సిన అవసరం ECB కి ఏర్పడింది. తగ్గిపోతున్న ప్రేక్షకులు, తగ్గిన స్పాన్సర్‌షిప్‌కు ప్రతిస్పందనగా యువతరంలో క్రికెట్ ఆటకు ప్రజాదరణను పెంచాలని అది భావించింది. గతం లోని సుదీర్ఘమైన ఆట రూపాలతో విసుగు చెంది ఆటకు దూరమైన వేలాది మంది అభిమానులకు వేగవంతమైన, ఉత్తేజకరమైన క్రికెట్‌ను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో టీ20ని ప్రవేశపెట్టారు. ECB మార్కెటింగ్ మేనేజర్ స్టూవర్ట్ రాబర్ట్‌సన్, 2001లో కౌంటీ ఛైర్మన్‌లకు 20-ఓవర్-ఇన్నింగ్స్ గేమ్‌ను ప్రతిపాదించాడు. వారు కొత్త ఫార్మాట్‌ను స్వీకరించడానికి అనుకూలంగా 11–7తో ఓటు వేశారు. [2]
ట్వంటీ 20 కప్‌లో ఇంగ్లీష్ కౌంటీల మధ్య 2003 జూన్ 13 న మొదటి అధికారిక ట్వంటీ20 మ్యాచ్‌లు జరిగాయి. [3] ఇంగ్లాండ్‌లో జరిగిన ట్వంటీ20 మొదటి సీజన్ సాపేక్షంగా విజయవంతమైంది. ఫైనల్‌లో సర్రే లయన్స్ వార్విక్‌షైర్ బేర్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. [4] లార్డ్స్‌లో 2004 జూలై 15 న మిడిల్‌సెక్స్, సర్రేల మధ్య జరిగిన మొదటి ట్వంటీ20 మ్యాచ్‌కు 27,509 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 1953 తరువాత ఒక వన్డే ఫైనల్ కాకుండా ఆ మైదానంలో జరిగిన ఏ కౌంటీ క్రికెట్ మ్యాచికి కూడా ఇంతమంది ప్రేక్షకులు రాలేదు. [5]
ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది
2004లో పాకిస్తాన్ ప్రారంభ పోటీలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 13 జట్లు పాల్గొన్నాయి. ఫైసలాబాద్ వుల్వ్స్ మొదటి విజేతలుగా నిలిచింది. 2005 జనవరి 12 న ఆస్ట్రేలియాలో మొదటి ట్వంటీ20 ఆట WACA గ్రౌండ్‌లో వెస్ట్రన్ వారియర్స్, విక్టోరియన్ బుష్రేంజర్స్ మధ్య జరిగింది. ఇది 20,000 మందిని ఆకర్షించింది. ఇంతమంది ఆటను చూడడం, దాదాపు 25 సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి. [6]
2006 జూలై 11 నుండి, 19 వెస్టిండీస్ ప్రాంతీయ జట్లు స్టాన్‌ఫోర్డ్ 20/20 టోర్నమెంట్‌లో పోటీ పడ్డాయి. ఈ ఈవెంట్‌కు బిలియనీర్ అలెన్ స్టాన్‌ఫోర్డ్ ఆర్థికంగా మద్దతు ఇచ్చాడు. అతను కనీసం 2.8 కోట్ల డాలర్ల నిధులను అందించాడు. టోర్నమెంట్‌ను వార్షిక ఈవెంట్‌గా నిర్వహించాలని భావించారు. ప్రారంభ ఈవెంట్‌లో గయానా, ట్రినిడాడ్ టొబాగోను ఐదు వికెట్ల తేడాతో ఓడించి US$ 10 లక్షల ప్రైజ్ మనీని పొందింది. [7] [8]
T20 లీగ్‌లు

2007 ICC వరల్డ్ ట్వంటీ20 ప్రజాదరణ పొందిన తర్వాత అనేక T20 లీగ్‌లు ప్రారంభమయ్యాయి. [9] బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని ప్రారంభించింది. ఇప్పుడది అతిపెద్ద క్రికెట్ లీగ్. ప్రధాన భారతీయ నగరాల్లో పది జట్లతో ఇది ఇది నార్త్ అమెరికన్ స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంటుంది. 2017 సెప్టెంబరులో, తదుపరి ఐదు సంవత్సరాల (2018–2022) IPL ప్రసార, డిజిటల్ హక్కులను US$2.55 బిలియన్లకు స్టార్ ఇండియాకు విక్రయించారు. [10] [11] ఆ విధంగా, ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన స్పోర్ట్స్ లీగ్‌లో ఒకటిగా IPL నిలిచింది. గ్లోబల్ వాల్యుయేషన్, కార్పొరేట్ ఫైనాన్స్ అడ్వైజర్ డఫ్ & ఫెల్ప్స్ ప్రకారం, 10వ ఎడిషన్ తర్వాత IPL బ్రాండ్ విలువ US$5.3 బిలియన్లకు పెరిగింది. [12]
ఆ తర్వాత ఇదే విధమైన సూత్రాలను అనుసరించి బిగ్ బాష్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ లు ప్రారంభమై, అభిమానుల ఆదరణ పొందాయి. [13] [14] 2015లో క్రికెట్ ఆస్ట్రేలియా మహిళల బిగ్ బాష్ లీగ్‌ను ప్రారంభించగా, 2016లో ఇంగ్లాండ్, వేల్స్‌లో కియా సూపర్ లీగ్ ప్రారంభమైంది. 2018లో దక్షిణాఫ్రికాలో మజాన్సి సూపర్ లీగ్ ప్రారంభమైంది.
అనేక T20 లీగ్‌లు [15] గ్రూప్ స్టేజ్‌ని కలిగి ఉండే సాధారణ ఆకృతిని అనుసరిస్తాయి, తర్వాత మొదటి నాలుగు జట్లలో పేజ్ ప్లేఆఫ్ సిస్టమ్ ఉంటుంది:
- గ్రూప్ దశలో మొదటి, రెండవ స్థానాల్లో ఉన్న జట్లు తలపడతాయి, విజేతలు ఫైనల్‌కు వెళతారు.
- మూడవ, నాల్గవ స్థానంలో ఉన్న జట్లు తలపడతాయి, ఓడిపోయిన వారు తొలగించబడతారు.
- పై రెండు మ్యాచ్‌లు ముగిశాక ఇంకా ఫైనల్‌కు చేరుకోని రెండు జట్లు ఫైనల్‌లో రెండో బెర్త్‌ను భర్తీ చేసేందుకు తలపడతాయి.
బిగ్ బాష్ లీగ్‌లో, నాల్గవ లేదా ఐదవ స్థానంలో ఉన్న జట్లలో ఏది టాప్ ఫోర్‌లో ఉండటానికి అర్హత సాధిస్తుందో నిర్ణయించడానికి అదనంగా ఒక మ్యాచ్ ఉంటుంది. [16]
ట్వంటీ20 ఇంటర్నేషనల్స్
మొదటి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ 2004 ఆగస్టు 5 న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ను న్యూజిలాండ్ తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది. [17]
2005 ఫిబ్రవరి 17 న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన మొదటి పురుషుల అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ పోటీని సరదాగా ఆడారు - రెండు జట్లూ 1980లలో ధరించిన కిట్‌ను ధరించారు. న్యూజిలాండ్ జట్టు, బీజ్ బ్రిగేడ్ ధరించిన దాన్ని కాపీ చేసింది. కొంతమంది ఆటగాళ్ళు 1980లలో మీసాలు, గడ్డాలు లాంటి కేశాలంకరణకు ప్రసిద్ధి చెందారు, బీజ్ బ్రిగేడ్ అభ్యర్థన మేరకు "బెస్ట్ రెట్రో లుక్" కోసం తమలో తాము ఒక పోటీలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా గేమ్‌ను గెలుచుకుంది. న్యూజీల్యాండ్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఫలితం స్పష్టంగా కనిపించడంతో, ఆటగాళ్ళు, అంపైర్లు మిగతా ఆటను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు: గ్లెన్ మెక్‌గ్రాత్ 1981 ODI నుండి ట్రెవర్ చాపెల్, బిల్లీ బౌడెన్ మధ్య జరిగిన ఒక అండర్ ఆర్మ్ సంఘటనను సరదాగా రీప్లే చేశాడు. ప్రతిస్పందనగా అతనికి మాక్ రెడ్ కార్డ్ (క్రికెట్‌లో రెడ్ కార్డ్‌లు సాధారణంగా ఉపయోగించబడవు) చూపించాడు.
ఇంగ్లాండ్‌లో మొదటి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ 2005 జూన్ 13 న హాంప్‌షైర్‌లోని రోజ్ బౌల్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగింది. ఇందులో ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో గెలిచింది. 2007 వరకు కొనసాగిన రికార్డు విజయం ఇది. [18]
2006 జనవరి 9 న ఆస్ట్రేలియాలో జరిగిన మొదటి అంతర్జాతీయ ట్వంటీ20 ఆటలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తలపడ్డాయి. మొదటగా, ప్రతి క్రీడాకారుడి ఇంటిపేరు కాకుండా అతని మారుపేరును అతని యూనిఫాం వెనుక వేసారు. గబ్బాలో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కు 38,894 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
2006 ఫిబ్రవరి 16 న న్యూజిలాండ్ టై బ్రేకింగ్ బౌల్ అవుట్‌లో 3-0తో వెస్టిండీస్‌ను ఓడించింది; ఆటలో మొదట రెండు జట్లూ చెరొక 126 పరుగులు సాధించాయి. ఈ గేమ్ క్రిస్ కెయిర్న్స్ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్.
ICC T20ని ఆటను ప్రపంచీకరించడానికి సరైన ఫార్మాట్‌గా ప్రకటించింది. [19] 2018లో, దాని సభ్య దేశాల మధ్య జరిగే అన్ని T20 క్రికెట్ మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోదాను ఇస్తామని ప్రకటించింది. [20] దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆడిన T20 మ్యాచ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. [21] [22]
ట్వంటీ20 ప్రపంచ కప్
ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ జరగాలి, అదే సంవత్సరంలో ICC క్రికెట్ ప్రపంచ కప్ షెడ్యూల్ చేసి ఉంటే తప్ప. అలాంటి సందర్భంలో దాని ముందు సంవత్సరం నిర్వహిస్తారు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టోర్నీలో ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. మొదటి టోర్నమెంట్‌లో రెండు అసోసియేట్ జట్లు ఆడాయి. 2007 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ వన్ 50 ఓవర్ల పోటీ ద్వారా ఎంపిక చేయబడింది. 2007 డిసెంబరులో జట్లను మెరుగ్గా సన్నద్ధం చేసేందుకు 20 ఓవర్ల ఫార్మాట్‌తో క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. పాల్గొనే ఆరుగురిలో, ఇద్దరు 2009 వరల్డ్ ట్వంటీ20 కి అర్హత సాధిస్తారు. ఒక్కొక్కరు $250,000 ప్రైజ్ మనీని అందుకుంటారు. [23] 2009 జూన్ 21 న ఇంగ్లాండ్‌లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్, రెండో టోర్నమెంట్‌ను గెలుచుకుంది. 2010 ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ 2010 మేలో వెస్టిండీస్‌లో జరిగింది. ఇక్కడ ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 ఫైనల్స్‌లో శ్రీలంకను ఓడించి వెస్టిండీస్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆసియా దేశంలో జరగడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. 2014 ICC వరల్డ్ ట్వంటీ 20 బంగ్లాదేశ్‌లో జరిగిన టోర్నమెంట్ ఫైనల్స్‌లో భారత్‌ను ఓడించి శ్రీలంక గెలుచుకుంది. 2016 ICC వరల్డ్ ట్వంటీ 20 ని వెస్టిండీస్ గెలుచుకుంది. 2020 జూలైలో, COVID-19 మహమ్మారి కారణంగా 2020, 2021 ఎడిషన్‌లను ఒక సంవత్సరం వాయిదా వేసినట్లు ICC ప్రకటించింది.
2021 జూన్‌లో ICC, 2024 ఎడిషన్ ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను 16 నుండి 20 జట్లకు విస్తరించింది. [24]
ట్వంటీ20 వలన క్రికెట్ ఆట మరింత అథ్లెటిక్ రూపానికి, విస్ఫోటక క్రికెట్ రూపానికీ దారితీసిందని పేర్కొన్నారు. భారత ఫిట్‌నెస్ కోచ్ రామ్‌జీ శ్రీనివాసన్ భారతీయ ఫిట్‌నెస్ వెబ్‌సైట్ Takath.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్వంటీ 20 ఆటగాళ్లందరికీ ఫిట్‌నెస్ స్థాయిల పరంగా "ప్రమాణాలను పెంచింది" అని ప్రకటించాడు. ఆటగాళ్లందరూ, జట్టులో పాత్ర ఏమిటి అనేదానితో సంబంధం లేకుండా అధిక స్థాయి బలం, వేగం, చురుకుదనం, ప్రతిచర్య సమయం చూపించాల్సి వచ్చింది. [25] మాథ్యూ హేడెన్, ఆటలో తన ప్రదర్శనతో పాటు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవసరమైన ఫిట్‌నెస్ లేనందున తాను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నానని ప్రకటించాడు. [26]
మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ట్వంటీ 20 టెస్టు క్రికెట్‌కు హానికరమని, బ్యాట్స్‌మెన్ స్కోరింగ్ నైపుణ్యాలు, ఏకాగ్రతను దెబ్బతీస్తుందని విమర్శించాడు. [27] ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కూడా ఇలాంటి ఫిర్యాదులే చేసాడు. యువ ఆటగాళ్ళు చాలా T20 ఆడుతారని, వారి బ్యాటింగ్ నైపుణ్యాలను పూర్తిగా అభివృద్ధి చేసుకోలేరని అతను భయపడ్డాడు. మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ ట్యూడర్ బౌలర్లకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని భయపడ్డాడు. [28] [29]
వెస్టిండీస్ మాజీ కెప్టెన్లు క్లైవ్ లాయిడ్, మైఖేల్ హోల్డింగ్, గార్ఫీల్డ్ సోబర్స్లు ట్వంటీ 20 వలన ఆటగాళ్ళు తమ జాతీయ టెస్ట్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండా ఆటగాళ్లను నిరుత్సాహపరుస్తోందని విమర్శించారు. క్రిస్ గేల్, సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో వంటి చాలా మంది వెస్టిండీస్ ఆటగాళ్లు ఏ ఇతర ఫార్మాటు కన్నా చాలా ఎక్కువ డబ్బు సంపాదించగలిగే ట్వంటీ 20 ఫ్రాంచైజీలో ఆడటానికే ఇష్టపడుతున్నారు. [30] [31] [32] [33] [34]
Remove ads
ఆట పద్ధతి, నియమాలు
పద్ధతి
ట్వంటీ20 మ్యాచ్ అనేది పరిమిత ఓవర్ల క్రికెట్ యొక్క ఒక రూపం. దీనిలోనూ రెండు జట్లు ఉంటాయి, ఒక్కొక్కటి ఒకే ఇన్నింగ్స్ ఆడతాయి. ప్రధాన లక్షణం ఏమిటంటే, ప్రతి జట్టు గరిష్ఠంగా 20 ఓవర్లు (120 లీగల్ బంతులు) బ్యాటింగ్ చేస్తుంది. బ్యాటింగ్ జట్టు సభ్యులు సాంప్రదాయిక డ్రెస్సింగ్ రూమ్‌ల నుండి రావడం అక్కడికే పోవడం ఉండదు. ఫుట్‌బాల్ అసోసియేషన్ యొక్క సాంకేతిక ప్రాంతం లేదా బేస్ బాల్ డగౌట్‌తో సమానంగా ఉండే ప్లేయింగ్ అరేనాలో కనిపించే బెంచి పైన (సాధారణంగా కుర్చీల వరుస) కూర్చుంటారు. అక్కడి నుంచే వస్తారు, అక్కడికే తిరిగి వెళ్తారు. [35]

సాధారణ నియమాలు
సాధారణ క్రికెట్ నియమాలన్నీ ట్వంటీ20కి వర్తిస్తాయి. కొన్ని ముఖ్యమైన మినహాయింపులున్నాయి. అవి: [36]
- ఒక్కో బౌలర్ ఒక్కో ఇన్నింగ్స్‌లో గరిష్ఠంగా ఐదవ వంతు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయవచ్చు. పూర్తి, అంతరాయం లేని మ్యాచిలో ఇది నాలుగు ఓవర్లు.
- ఒక బౌలర్ క్రీజును అధిగమించి నో-బాల్‌ను వేస్తే, దానికి ఒకటి లేదా రెండు పరుగులు (పోటీని బట్టి) జరిమానా విధిస్తారు. అతని తదుపరి డెలివరీని "ఫ్రీ-హిట్" అంటారు. ఈ బంతికి బ్యాటర్ కేవలం రన్ అవుట్ ద్వారా, బంతిని రెండుసార్లు కొట్టడం లేదా ఫీల్డ్‌ను అడ్డుకోవడం ద్వారా మాత్రమే ఔట్ అవుతాడు.
- కింది ఫీల్డింగ్ పరిమితులు వర్తిస్తాయి:
- ఏ సమయంలోనైనా ఐదుగురు కంటే ఎక్కువ ఫీల్డర్లు లెగ్ సైడ్‌లో ఉండకూడదు.
- మొదటి ఆరు ఓవర్లలో, గరిష్ఠంగా ఇద్దరు ఫీల్డర్లు 30-గజాల సర్కిల్ వెలుపల ఉండవచ్చు (దీనినే పవర్‌ప్లే అంటారు).
- మొదటి ఆరు ఓవర్ల తర్వాత, ఫీల్డింగ్ సర్కిల్ వెలుపల గరిష్ఠంగా ఐదుగురు ఫీల్డర్లు ఉండవచ్చు.
- ఫీల్డింగ్ జట్టు తమ 20వ ఓవర్‌ను 75 నిమిషాలలోపు వేయడం ప్రారంభించకపోతే, 75 నిమిషాల తర్వాత వేసిన ప్రతి ఓవర్‌కు అదనంగా ఆరు పరుగులు బ్యాటింగ్ చేసే జట్టుకు ఇస్తారు. బ్యాటింగ్ చేసే జట్టు సమయాన్ని వృధా చేస్తోందని అంపైర్ విశ్వసిస్తే, ఈ జరిమానా సమయాన్ని పెంచవచ్చు.
Remove ads
అంతర్జాతీయ
మహిళల, పురుషుల ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లు వరుసగా 2004, 2005 లలో మొదలయ్యాయి. ఈ రోజు వరకు, అన్ని టెస్టులు ఆడే దేశాలతో సహా 76 దేశాలు ఈ ఫార్మాట్‌ను ఆడాయి.
T20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్
2011 నవంబరులో, టెస్ట్, ODI ర్యాంకింగ్‌ల మాదిరిగానే అదే విధానం ఆధారంగా పురుషుల ఆట కోసం ICC మొదటి ట్వంటీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ర్యాంకింగ్‌లు రెండు నుండి మూడు సంవత్సరాల వ్యవధిని కవర్ చేస్తాయి, ఇటీవలి ఆగస్టు 1 నుండి జరిగిన మ్యాచ్‌లకు వెయిటేజీ పూర్తిగా ఇవ్వగా, అంతకు ముందరి 12 నెలల్లో జరిగిన మ్యాచ్‌లకు మూడింట రెండు వంతుల వెయిటేజి ఇచ్చారు. దానికి ముందరి 12 నెలల్లో ఆడిన మ్యాచ్‌లకు మూడింట ఒక వంతు వెయిటేజీ ఉంటుంది. ర్యాంకింగ్స్‌కు అర్హత సాధించాలంటే, ర్యాంకింగ్ వ్యవధిలో జట్లు కనీసం ఎనిమిది ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లు ఆడి ఉండాలి. [37] [38]
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads