ఇస్లామీయ ప్రవక్తలు
క్రైస్తవమ్ / From Wikipedia, the free encyclopedia
ప్రవక్తలు : ప్రవక్తలు అనగానే అనాది కాలపు మనుషులు వారిని సంస్కరించడానికి పూనుకొన్న మహనీయులు జ్ఞాపకం వస్తారు. ఖురాన్ బైబిల్, హదీసుల ప్రకారం సరిగ్గా ఇలాంటి వారే ప్రవక్తలు. (అల్లాహ్) తాను సృష్టించిన మానవాళిని సన్మార్గము విడువకుండా చక్కటి ప్రాకృతిక జీవనం, అందులో ఆధ్యాత్మికత, దైవికత, సత్సీలత గల్గిన జీవనాన్ని సాగించుటకై, సదరు జీవనానికి కావలసిన సిద్ధాంతాలనూ మార్గదర్శకాలనూ చేరవేయడానికి తన వార్తాహరులను (పైగంబరులను) భూమిపై అవతరింపజేశాడు, వారే ప్రవక్తలు.
అల్లాహ్ వాక్కు ఖురాను, బైబిల్ ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు, ప్రథమ ప్రవక్త. మహమ్మద్ చివరి ప్రవక్త.
హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) ప్రవక్తలు అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన ఉంది. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ ఈశ్వరుడు (అల్లాహ్) ప్రవక్తలను అవతరింపజేశాడు.
ప్రతి ప్రవక్త ఈశ్వరుడి (అల్లాహ్) హెచ్చరికలను ప్రజానీకానికి చేరవేస్తాడు. ప్రతి ప్రవక్తకాలంలోని ప్రవక్తల అనుయాయులందరూ ముస్లిములే, కాని క్రొత్త ప్రవక్త అవతరించినచో అతడిని అవలంబించవలసి యుంటుంది. ఉదాహరణకు ఇబ్రాహీం ప్రవక్త (అబ్రహాము) అనుయాయులు ఇస్మాయీల్, ఇస్ హాఖ్ లను అవలంబించారు. వీరి అనుయాయులు మూసా (మోషే) ను అవలంబించారు. వీరి అనుయాయులు ఈసా (యేసు) ను అవలంబించారు. ఇది ప్రవక్తల గొలుసుక్రమం. వీరందరూ ఈ క్రమంలోని అంతిమ ప్రవక్త అయిన మహమ్మదును అవలంబించవలెను. ఇదే ముస్లింల విశ్వాసం.