తెలుగు వికీపీడియా
స్వేచ్ఛా-విషయ విజ్ఞాన సర్వస్వం / From Wikipedia, the free encyclopedia
తెలుగు వికీపీడియా (తెవికీ) 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన తెలుగు భాషా వికీపీడియా. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని లిఖిత ఆధారాలతో ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. వెన్న నాగార్జున ప్రారంభ కృషి చేయగా, దీనిలో చాలామంది సభ్యులై అభివృద్ధి పథంలో నడిపించారు. తెలుగు వికీపీడియా మొదటిపేజీ వివిధ రకాల శీర్షికలతో అందరినీ ఆకట్టుకొనేటట్లుగా ఉంటుంది. తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనే లక్ష్యంతో విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. 2005 నవంబరు 14న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఈ ప్రక్రియ 2007- 23 వ వారం (జూన్) లో మొదటిసారి సుడోకుతో "ఈ వారపు వ్యాసాలు"గా మారింది.
Type of site | విజ్ఞానసర్వస్వం |
---|---|
Available in | తెలుగు |
Headquarters | మియామీ,ఫ్లోరిడా |
Owner | వికీమీడియా ఫౌండేషన్ |
URL | te.wikipedia.org |
Commercial | కాదు |
Registration | ఐచ్ఛికం |
Launched | డిసెంబరు 10, 2003; 20 సంవత్సరాల క్రితం (2003-12-10) |
Current status | ఆన్లైన్ |
Content license | CC-BY-SA |
2011 లో ఆంగ్ల వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. వాటిలో క్రియాశీలంగా ఉన్న ఎక్కువ మంది తెలుగు వికీ ప్రాజెక్టుల సభ్యులు ముఖాముఖిగా కలుసుకొని వివిధ అంశాలపై చర్చించారు. వికీపీడియాలో అనేక మార్పులతో పాటు, సాంకేతికాభివృద్ధి కారణంగా ఆధునిక స్మార్ట్ ఫోన్లకు తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చింది.
వికీపీడియా సంస్థాగత రూపంలో సాధారణ సభ్యులతో పాటు సభ్యులు ఎన్నుకున్న నిర్వాహకులు, అధికారులు ఉంటారు. కొత్త సభ్యులకు వికీ గురించి నేర్చుకునేందుకు పాఠాలు, సహాయాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. 2011-2019 మధ్యకాలంలో వికీమీడియా భారతదేశం చాప్టర్, సిఐఎస్-ఎ2కే సంస్థలు వికీపీడియా అవగాహన సదస్సుల ద్వారా వికీపీడియాని అభివృద్ధి పరచటానికి సహాయం చేశాయి.