![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4f/Black_hole_-_Messier_87_crop_max_res.jpg/640px-Black_hole_-_Messier_87_crop_max_res.jpg&w=640&q=50)
కృష్ణ బిలం
From Wikipedia, the free encyclopedia
కృష్ణ బిలం (బ్లాక్ హోల్) అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్‌టైమ్ ప్రాంతం. ఎంత బలమైన గురుత్వాకర్షణ అంటే, దాని ఆకర్షణ నుండి, ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ, దాని నుండి తప్పించుకోలేవు. ఏదైనా ద్రవ్యరాశి తగినంత సాంద్రతతో ఉంటే, స్పేస్‌టైమ్‌ను వంచి, కృష్ణ బిలం ను ఏర్పరుస్తుందని సాధారణ సాపేక్షతా సిద్ధాంతం ఊహించింది.[6] [7] తిరిగి వెనక్కి రాలేని ఆ ప్రాంతపు సరిహద్దును ఈవెంట్ హొరైజన్ అంటారు. ఈవెంట్ హొరైజన్ను దాటిన వస్తువు గతి, దాని పరిస్థితులపై ఈవెంట్ హొరైజన్ విపరీతమైన ప్రభావాన్ని చూపినప్పటికీ, స్థానికంగా గుర్తించదగిన లక్షణాలేమీ గమనించలేం. అనేక విధాలుగా, కృష్ణ బిలం కూడా ఒక ఆదర్శవంతమైన బ్లాక్ బాడీ లాంటిదే. బ్లాక్ బాడీ లాగానే ఇది కూడా కాంతిని ప్రతిబింబించదు.[8] [9] అంతేకాకుండా, ఈవెంట్ హొరైజన్లు హాకింగ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయని క్వాంటం ఫీల్డ్ థియరీ ఊహించింది. ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉండే ఉష్ణోగ్రత వద్ద ఉన్న బ్లాక్ బాడీ విడుదల చేసే రేడియేషన్ ఏ స్పెక్ట్రమ్‌లో ఉంటుందో, ఆ స్పెక్ట్రమ్‌లోనే ఈ రేడియేషన్ ఉంటుంది. నక్షత్ర స్థాయి ద్రవ్యరాశి (స్టెల్లార్ మాస్ కృష్ణ బిలం) ఉండే కృష్ణ బిలం లకు ఈ ఉష్ణోగ్రత ఒక కెల్విన్ లో వందల కోట్ల వంతు ఉంటుంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రత వలన దీన్ని గమనించడం అసాధ్యం.
![Blackness of space with black marked as center of donut of orange and red gases](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4f/Black_hole_-_Messier_87_crop_max_res.jpg/640px-Black_hole_-_Messier_87_crop_max_res.jpg)
కాంతిని కూడా తప్పించుకోనీయనంత బలంగా ఉండే గురుత్వాకర్షణ క్షేత్రాల గురించి 18 వ శతాబ్దంలో జాన్ మిచెల్, పియరీ-సైమన్ లాప్లేస్ లు ప్రస్తావించారు.[10] సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని వాడి కృష్ణ బిలం ను వర్ణించే మొట్టమొదటి ఆధునిక పరిష్కారం 1916 లో కార్ల్ ష్వార్జ్‌షీల్డ్ కనుగొన్నాడు. అయితే అది, తన నుండి దేన్నీ తప్పించుకోనీయని అంతరిక్ష ప్రాంతమనే వివరణను మాత్రం మొదటగా 1958 లో డేవిడ్ ఫింకెల్స్టెయిన్ ప్రచురించాడు. కృష్ణ బిలాలను చాలాకాలం పాటు గణితానికి సంబంధించిన కుతూహల విషయంగా మాత్రమే పరిగణిస్తూ వచ్చారు. 1960 లలో జరిగిన సైద్ధాంతిక కృషి ఫలితంగా సాధారణ సాపేక్షత యొక్క అంచనాయే కృష్ణ బిలం అని తేలింది. 1967 లో జోసెలిన్ బెల్ బర్నెల్ న్యూట్రాన్ నక్షత్రాలను కనుగొన్నాక, గురుత్వాకర్షణ కారణంగా తమలోకి తాము కూలిపోయి, కుంచించుకు పోయి ఏర్పడే కాంపాక్ట్ వస్తువులపై ఆసక్తి రేకెత్తింది.
చాలా భారీ నక్షత్రాలు, వాటి జీవితాంతాన కూలి, కుంచించుకుపోయి, నక్షత్ర స్థాయి ద్రవ్యరాశి (స్టెల్లార్ మాస్ కృష్ణ బిలం) గల కృష్ణ బిలాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. కృష్ణ బిలం ఏర్పడిన తరువాత, దాని పరిసరాల నుండి ద్రవ్యరాశిని తనలో కలిపేసుకుంటూ, ఇది పెరుగుతూనే ఉంటుంది. ఇతర నక్షత్రాలను, ఇతర కృష్ణ బిలంలనూ తనలో విలీనం చేసుకుని, కోట్ల సౌర ద్రవ్యరాశి (M☉) కలిగిన సూపర్ మాసివ్ కృష్ణ బిలంలు ఏర్పడవచ్చు. చాలా గెలాక్సీల కేంద్రాల్లో సూపర్ మాసివ్ కృష్ణ బిలంలు ఉన్నాయని ఒక విస్తృతామోద అభిప్రాయం ఉంది.
కృష్ణ బిలం ఇతర పదార్థంతో జరిపే చర్య ద్వారానూ, అది వెలువరిచే విద్యుదయస్కాంత వికిరణాన్ని బట్టీ దాని ఉనికిని ఊహించవచ్చు. కృష్ణ బిలం లో పడే పదార్థం ఒక ఎక్రీషన్ డిస్క్ లాగా ఏర్పడుతుంది. రాపిడి వలన ఇది విపరీతంగా వేడెక్కి కాంతిని వెలువరిస్తుంది. విశ్వంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోయే వస్తువుల్లో ఇదొకటి. సూపర్ మాసివ్ కృష్ణ బిలంకు దగ్గరగా ప్రయాణించే నక్షత్రాలను అది ముక్కలు చేసేస్తుంది. ఈ ముక్కలు ప్రకాశవంతంగా వెలిగిపోతూ ప్రవాహంలా కృష్ణ బిలంలోకి పడిపోతాయి. కృష్ణ బిలం నక్షత్రాలను ఇలా "మింగేస్తుంది".[11] కృష్ణ బిలం చుట్టూ నక్షత్రాలేమైనా ప్రదక్షిణ చేస్తూ ఉంటే, వాటి కక్ష్యలను బట్టి కృష్ణ బిలం ద్రవ్యరాశినీ, దాని స్థానాన్నీ నిర్ణయించవచ్చు. న్యూట్రాన్ నక్షత్రాల వంటివి కృష్ణ బిలాలు కావని నిర్ధారించుకోడానికి ఇటువంటి పరిశీలనలు ఉపయోగపడతాయి. ఈ విధంగా, ఖగోళ శాస్త్రవేత్తలు బైనరీ వ్యవస్థలలో అనేక కృష్ణ బిలాలను గుర్తించారు. పాలపుంత గెలాక్సీ కేంద్రం వద్ద సాజిట్టేరియస్ A * అని పిలిచే రేడియో వనరు వద్ద సుమారు 43 లక్షల సౌర ద్రవ్యరాశి కలిగిన భారీ కృష్ణ బిలం ఉందని ఈ పద్ధతి లోనే నిర్ధారించారు.
2016 ఫిబ్రవరి 11న, LIGO గురుత్వాకర్షణ తరంగాలను మొట్టమొదటిగా ప్రత్యక్షంగా గుర్తించినట్లు ప్రకటించింది. ఇది రెండు కృష్ణ బిలాలు విలీనమైన ఘటనలో ఈ తరంగాలు పుట్టాయి. [12] 2018 డిసెంబరు నాటికి, కృష్ణ బిలం విలీన ఘటనలు పది, న్యూట్రాన్ స్టార్ వీలీనం ఒకటీ, మొత్తం పదకొండు గురుత్వాకర్షణ తరంగ ఘటనలను గమనించారు. మెస్సియర్ 87 గెలాక్సీ కేంద్రంలోని అతి భారీ కృష్ణ బిలం ఉందని 2017 లో ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ చేసిన పరిశీలనలలో తేలింది. 2019 ఏప్రిల్ 10 న, ఈ కృష్ణ బిలంను, దాని పరిసరాలనూ తీసిన మొట్టమొదటి ప్రత్యక్ష చిత్రాన్ని ప్రచురించారు. [2] [13] [14]
![Schwarzschild black hole](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/BlackHole_Lensing.gif/220px-BlackHole_Lensing.gif)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/15/Images_of_gas_cloud_being_ripped_apart_by_the_black_hole_at_the_centre_of_the_Milky_Way_ESO.jpg/640px-Images_of_gas_cloud_being_ripped_apart_by_the_black_hole_at_the_centre_of_the_Milky_Way_ESO.jpg)