అక్కినేని నాగేశ్వరరావు
భారతీయ సినీ నటుడు, నిర్మాత From Wikipedia, the free encyclopedia
Remove ads
అక్కినేని నాగేశ్వరరావు (1924, సెప్టెంబరు 20 – 2014, జనవరి 22) తెలుగు నటుడు, నిర్మాత. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. సుమారు 255 చిత్రాల్లో నటించాడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించాడు. ఎన్. టి. ఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.[2]
మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినీరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు. ఎన్టీరామారావుతో కలిసి 14 సినిమాల్లో నటించాడు. దాసరి నారాయణరావు ఎన్.టి రామారావు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళని వ్యాఖ్యానించాడు. ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు సినిమాలో అరుదైన నటుడిగా గుర్తింపు పొందాడు. వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు. అయినా ఎన్నో భక్తి సినిమాలలో నటించాడు. అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. కొడుకు నాగార్జున, మనవడూ నాగచైతన్యతో కలిసి నటించిన మనం సినిమా ఆయన నటించిన చివరి చిత్రం. అక్కినేని 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపు విడుదల చేశారు.
Remove ads
వ్యక్తిగత జీవితం
అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించింది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు, అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ.[3] భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశాడు. అన్నపూర్ణ 2011 డిసెంబరు 28 న మరణించింది.[4]
Remove ads
నట జీవితం
ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూసాడు. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేసాడు. చిన్నప్పటి నుండి నాటకాల మీద వున్న ఆసక్తి తోనే 1941 లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 256 సినిమాల్లో నటించాడు. అతను నటించిన ఆఖరి సినిమా మనం.
పలురకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 1953 లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 1966 లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించాడు. 1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్లో జీవిత చరిత్రలపై దేవుడి పాత్రలపై చేసిన సినిమాలు గుర్తింపును తీసుకువచ్చాయి.
అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971 లో వచ్చిన దసరాబుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని హైదరాబాదుకు రావడానికి ఎంతో కృషి చేశాడు. పర భాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. తన వారసులను పరిశ్రమకు అందించాడు. కళాప్రపూర్ణ. గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968 లో పద్మశ్రీ అవార్డు, 1988 లో పద్మభూషణ్, 1989 లో రఘుపతి వెంకయ్య, 1990 లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996 లో ఎన్. టి.ఆర్. జాతీయ అవార్డులూ అందుకున్నాడు. 2011 లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి, నటుడు. భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు.
Remove ads
సినీజీవితంలో ప్రముఖ సినిమాలు
1940 లో విడుదలైన "ధర్మపత్ని" అతను నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). ఆకర్షించే రాజకుమారుడినుండి విరక్తిచెంది మద్యానికి బానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడినుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థినుండి సమర్ధుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలలో నటించాడు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు (మాయాబజార్), విష్ణువు (చెంచులక్ష్మి), నారదుడు (భూకైలాస్), అర్జునుడు (శ్రీకృష్ణార్జున యుద్ధం) లో రాణించాడు.
గ్రామీణ ప్రాంతాలకు అద్దంపట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, నమ్మినబంటులో నటించి, తెలుగు నటసామ్రాట్గా పేరుపొందాడు.[5] మిస్సమ్మ, చక్రపాణి, ప్రేమించుచూడు లాంటి హాస్యరసప్రధాన చిత్రాలలో అందరి మన్ననలందుకున్నాడు. లైలామజ్ను, అనార్కలి (1955), బాటసారి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మేఘసందేశంలో నటన ద్వారా తెలుగుచిత్రరంగానికి విషాదరారాజుగా పేరుపొందాడు.
దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగుసినిమాలో రికార్డు నమోదు చేసింది. ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది.[6][7][8]
తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయనానికి నాందిపలికిన అక్కినేని నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రలలో నటించాడు. ప్రేమలో ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడిగా దేవదాసు చిత్రంలోని నటన శరత్ చంద్ర నవలలోని కథానాయకుడికి జీవంపోసింది. ఈ పాత్రకు ఆ తర్వాత మరెంతోమంది మరిన్ని భాషలలో నటించినా, హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించిందే ఒకేఒక దేవదాసు అని అన్నాడు.
సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాలలో సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్థాంగి, మాంగల్యబలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, ప్రతిబింబాలు, బాటసారి, కాలేజి బుల్లోడు లాభాలుపొందిన సినిమాలు. 1991 లోఆయన నటజీవితం స్వర్ణోత్సవం సందర్భాన విడుదలైన సీతారామయ్య గారి మనమరాలు, కొత్త, యువనటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీసు హిట్ గా నిలిచింది. తన పుత్రుడు అక్కినేని నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసినటించిన మనం అతను నటించిన చివరి సినిమా.
వివిధ ప్రాంతాల సాహిత్య, సాంస్కృతిక వ్యక్తుల పాత్రలు అనగా, ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిషాకి చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన, తమిళనాడుకి చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారాం లను తెరమీదికి తేవటం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకులు, కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా అతని నటనా ప్రతిభను మనం చూడవచ్చు.
తెలుగు చలనచిత్ర రంగములో తన సహనటుడు నందమూరి తారక రామారావుతో కలిసి 14 నటించిన సినిమాలు ఆర్థికంగా విజయం పొందడమే గాక, అగ్రశ్రేణి నటుల కలయికకు నాంది వేసినారు. పల్లెటూరి పిల్ల (1950), సంసారం (1950), రేచుక్క (1954), పరివర్తన (1954), మిస్సమ్మ (1955), తెనాలి రామకృష్ణ (1956), చరణ దాసి (1956), మాయా బజార్ (1957), భూకైలాస్ (1958), గుండమ్మ కథ (1962), శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963), చాణక్య చంద్రగుప్త (1977), రామ కృష్ణులు (1978), సత్యం శివం (1981) మొదలైన సినిమాలు ఉన్నాయి.[9]
Remove ads
పురస్కారాలు, బిరుదులు
నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని ఎన్నో ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ అవార్డులే కాక ఈ క్రింది పురస్కారాలు కూడా అతను అందుకున్నాడు.
- కళాప్రపూర్ణ - 1977 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
- పద్మవిభూషణ్ - 2011- భారత ప్రభుత్వం
- పద్మ భూషణ్ – 1988 – భారత ప్రభుత్వం.
- పద్మశ్రీ – 1968 భారత ప్రభుత్వం.
- కాళిదాస్ సమ్మాన్ – మధ్య ప్రదేశ్.
- రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు – 10.03.1980 – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
- దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు – 07.04.1991 – ఆర్. వెంకట్రామన్, భారత రాష్ట్రపతి,
- ఎన్టీఆర్ జాతీయ పురస్కారం - 1996 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
- విశిష్ట వ్యక్తి అవార్డు – 10.03.1988 – సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
- రాజ్ కపూర్ స్మారక అవార్డు – 10.06.1989 – కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు.
- లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు - 21.10.1994 - కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
- అన్నా అవార్డు – 24.11.1995 – జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
- తపాలా శాఖ 19-09-2018 న పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు (ANR) 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసారు. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు.
- నటసామ్రాట్.[5]
- భారత తపాలా శాఖ 2018 లో వీరి 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసారు.[10]
- 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపును 2024, సెప్టెంబరు 20న హైదరాబాద్ డాక్ సదన్ లో విడుదల చేశారు.[11]
Remove ads
సంఘసేవ
మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలక అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్ఆర్ కళాశాల (ANR College) అని నామకరణం పెట్టారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశాడు. విరాళాల రూపంలోనే కాకుండా సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను ఆదుర్తి సుబ్బారావుతో చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించాడు.
Remove ads
మరణం
అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 2014, జనవరి 22 న మరణించాడు. అర్థరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుటుంబసభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. పదినిమిషాలకే డా. సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతిచెందారని నిర్ధారణ అయింది.[1] ఆయన అంతిమయాత్రకు చాలామంది సినీ ప్రముఖులు వచ్చి నివాళులర్పించారు. అక్కినేని నాగేశ్వరరావు మరణం తెలుగు సినిమాకు తీరని లోటని పేర్కొన్నారు.
Remove ads
ఇవీ చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads