పులి

ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే క్షీరదం From Wikipedia, the free encyclopedia

పులి
Remove ads

పులి (పాంథెరా టైగ్రిస్) ఫెలిడే కుటుంబంలో కెల్లా అతిపెద్ద జాతి. ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. ఆరెంజి-బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత. ఈ నిలువుచారలు కిందికి వెళ్ళే కొద్దీ పలచబడతాయి. ఇది, ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే వేటాడే జంతువు. ప్రధానంగా జింక, అడవి పంది వంటి ఖురిత జంతువులను (గిట్టలు కల జంతువులు) వేటాడుతుంది. ఇది ఒక ప్రదేశానికి పరిమితమై ఉంటుంది. సాధారణంగా ఒంటరిగా జీవించే వేట జంతువు. దీనికి, తన సంతానాన్ని పోషించుకునేందుకు తగినంత ఆహారం లభించే విశాలమైన ఆవాస ప్రాంతాలు అవసరమవుతాయి. పులి పిల్లలు స్వతంత్రంగా జీవించే ముందు రెండేళ్లపాటు తల్లితో కలిసి ఉంటాయి. ఆ తరువాత, విడిపోయి, తల్లి ఇంటి పరిధిని దాటి వెళ్ళి, స్వతంత్రంగా జీవిస్తాయి.

త్వరిత వాస్తవాలు Conservation status, Scientific classification ...
ఒక పులి వీడియో

పులి ఒకప్పుడు పశ్చిమాన తూర్పు అనటోలియా ప్రాంతం నుండి అముర్ నదీ పరీవాహక ప్రాంతం వరకు, దక్షిణాన హిమాలయాల పర్వత ప్రాంతాల నుండి సుంద ద్వీపాలలో బాలి వరకూ విస్తృతంగా ఉండేది. 20 వ శతాబ్దం ఆరంభం నుండి, పులి జనాభా కనీసం 93% తగ్గిపోయింది. పశ్చిమ, మధ్య ఆసియాలో, జావా, బాలి ద్వీపాల నుండి, ఆగ్నేయ, దక్షిణ ఆసియా, చైనాల్లోని విశాలమైన ప్రాంతాలలో పులి కనుమరుగై పోయింది. నేటి పులి జనాభా సైబీరియా సమశీతోష్ణ అడవుల నుండి భారత ఉపఖండం, సుమత్రాల్లోని ఉపఉష్ణమండల, ఉష్ణమండల అడవుల మధ్య ప్రదేశాల్లో చెదురుమదురుగా విస్తరించి ఉంది. పులిని, 1986 నుండి ఐయుసిఎన్ రెడ్ జాబితాలో అంతరించిపోతున్న జాబితాలో చేర్చారు. 2015 నాటికి, ప్రపంచ పులి జనాభా 3,062 - 3,948 మధ్య ఉన్నట్లు అంచనా వేసారు. 20 వ శతాబ్దం ప్రారంభంలో సుమారు 1,00,000 నుండి ఈ స్థాయికి తగ్గింది. నివాస విధ్వంసం, నివాస విభజన, వేట జనాభా క్షీణతకు ప్రధాన కారణాలు. ఇది భూమిపై ఎక్కువ జనసాంద్రత గల ప్రదేశాలలో నివసిస్తూండడంతో, మానవులతో గణనీయమైన ఘర్షణలు ఏర్పడ్డాయి.

ప్రపంచంలోని ఆకర్షణీయమైన మెగాఫౌనాలో పులి అత్యంత గుర్తించదగినది, ప్రాచుర్యం పొందినదీ. ఇది పురాతన పురాణాలలోను, జానపద కథల్లోనూ ప్రముఖంగా కనిపించింది. ఆధునిక చలనచిత్రాలు, సాహిత్యాలలో వర్ణించారు. అనేక జెండాలు, కోట్లు, ఆయుధాల పైనా, క్రీడా జట్లకు చిహ్నాలుగానూ కనిపిస్తుంది . పులి భారతదేశం, బంగ్లాదేశ్, మలేషియా, దక్షిణ కొరియా దేశాలకు జాతీయ జంతువు.

Remove ads

వర్గీకరణ, జన్యుశాస్త్రం

1758 లో, కార్ల్ లిన్నెయస్ తన రచన సిస్టమా నాచురేలో పులిని వర్ణించాడు. అతడు దానికి ఫెలిస్ టైగ్రిస్ అనే శాస్త్రీయ నామం పెట్టాడు. [2] 1929 లో, బ్రిటిష్ వర్గీకరణ శాస్త్రవేత్త రెజినాల్డ్ ఇన్నెస్ పోకాక్ పాంథెరా టైగ్రిస్ అనే శాస్త్రీయ నామాన్ని పెట్టి, ఈ జాతిని పాంథెరా ప్రజాతి కింద ఉంచాడు. [4] [5]

Thumb
డ్రిస్కాల్ తదితరుల ప్రకారం పులి జనాభా ఫైలోజెనెటిక్ సంబంధం. (2009). [6]
మరింత సమాచారం జనాభా, వివరణ ...
మరింత సమాచారం జనాభా, వివరణ ...
Remove ads

ప్రవర్తన, జీవావరణం

Thumb
పులులకు నీటిలో హాయిగా ఉంటుంది. అవి తరచూ స్నానం చేస్తాయి
Thumb
పులి వాసన దాని భూభాగాన్ని సూచిస్తుంది

సామాజిక, రోజువారీ కార్యకలాపాలు

Thumb
రణతంబోర్ టైగర్ రిజర్వులో ఆడ పులిపిల్లల ఆటలు

మనుషుల జోక్యం లేనపుడు, పులి ప్రధానంగా దివాచరి (అంటే పగటి పూట పనిచేసి, రాత్రివేళ విశ్రాంతి తీసుకోవడం). [22] ఇది పెద్దగా చెట్లు ఎక్కదు గానీ, ఎక్కిన దాఖలాలు ఉన్నాయి. [23] ఇది చక్కగా ఈత కొట్టగలదు. తరచుగా చెరువులు, సరస్సులు, నదులలో స్నానం చేస్తుంది. తద్వారా పగటి వేడిని తగ్గించు కుంటుంది. [24] పులి 7 కి.మీ. వెడల్పైన నదిని దాటగలదు. ఒక్క రోజులో 29 కి.మీ. దూరాన్ని ఈదగలదు. [25] 1980 లలో, రణతంభోర్ నేషనల్ పార్క్‌లోని లోతైన సరస్సులో ఒక పులి తరచుగా వేటాడుతూండటం గమనించారు.

పులులు చాలా దూర దూరంగా నివసిస్తాయి. ఒక్కొక్క నివాసం ఇతర నివాసాల నుండి 650 కి.మీ. దూరం వరకూ ఉంటుంది. [26] చిట్వాన్ నేషనల్ పార్కులో రేడియో-కాలరు పెట్టిన పులులు 19 నెలల వయస్సులోనే అవి పుట్టిన ప్రాంతాల నుండి వలస పోవడం ప్రారంభించాయి. నాలుగు ఆడ పులులు 0 నుండి 43.2 కి.మీ.వరకు దూరం వెళ్ళాయి. 10 మగ పులులు 9.5 నుండి 65.7 కి.మీ. దూరం వెళ్ళాయి. వాటిలో ఏవీ కూడా 10 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఉన్న, పంట పొలాల వంటి బహిరంగ ప్రాంతాల మీదుగా పోలేదు. అడవుల గుండానే వెళ్ళాయి. [27]

వయోజన పులులు ఎక్కువగా ఒంటరిగా జీవిస్తాయి. అవి తమ రాజ్యాలను స్థాపించుకుని పాలించుకుంటాయి. కానీ అవి తిరిగే ప్రాంతం (గృహ పరిధి - హోమ్ రేంజి) దానికంటే పెద్దదిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వేరువేరు రాజ్యాలకు చెందిన పులులు తిరుగుతాయి. ఒకే ప్రాంతాన్ని పంచుకునే పులులకు, ఒకరి కదలికలు, కార్యకలాపాల గురించి ఇంకొకరికి తెలుస్తుంది. [28] అవి తమలో తాము ఘర్షించుకోకుండా, ఒకదాన్నుంచి ఒకటి తప్పించుకుంటూ ఉంటాయి. ఇంటి పరిధి ప్రధానంగా ఆహార సమృద్ధి, భౌగోళిక ప్రాంతం, పులి లింగంపై ఆధారపడి ఉంటుంది. [23] [12] భారతదేశంలో, గృహ పరిధులు 50 నుండి 1,000 చ.కి.మీ. వరకు ఉంటాయి. మంచూరియాలో 500 నుండి 4,000 చ.కి.మీ., నేపాల్‌లో 19 నుండి 151 చ.కి.మీ. మగపులులకు, 10 నుండి 51 చ.కి.మీ. ఆడవాటికీ ఉంటాయి. [25]

యువ ఆడ పులులు తమ మొదటి భూభాగాలను తమ తల్లికి దగ్గరగా స్థాపించుకుంటాయి. ఆడ పులి, ఆమె తల్లి భూభాగాల మధ్య ఉండే అతివ్యాప్తి (ఓవర్‌ల్యాప్), కాలం గడిచేకొద్దీ తగ్గుతూ పోతుంది. అయితే, మగపులు మాత్రం ఆడవాటి కంటే తక్కువ వయసులోనే, ఆడవాటి కంటే ఎక్కువ దూరం వెళ్లి తమ సొంత రాజ్యాన్ని స్థాపించుకుంటాయి. కుర్ర మగ పులి ఇతర మగ పులులు లేని ప్రాంతాన్ని వెతుక్కుని రాజ్యాన్ని స్థాపించుకుంటుంది. లేదా మరొక మగపులి భూభాగంలో ఆ రాజ్యపు పులిని ఎదిరించేంత బలవంతుడయ్యే దాకా అస్థిరంగా జీవిస్తూ ఉంటుంది.

తన భూభాగాన్ని గుర్తించడానికి, మగ పులి తన మూత్రాన్ని చెట్లపై పిచికారీ చేస్తుంది. [29] [30] మలం తోటి, అలాగే నేలపైన, చెట్లపైనా పంజాతో గీయడం ద్వారానూ తన భూభాగాన్ని గుర్తిస్తుంది. ఆడపులులు కూడా ఈ గుర్తులు ఉపయోగిస్తాయి. ఈ రకమైన వాసన పీల్చిన ఇతర పులులకు ఆ పులి గుర్తింపు తెలుస్తుంది. దాని లింగం, పునరుత్పత్తి స్థితి కూడా తెలుస్తుంది. ఎదకొచ్చిన ఆడ పులులు వాసనను మరింత తరచుగా వదులుతూంటాయి. మామూలు కంటే ఎక్కువగా అరుస్తూ కూడా ఎదకొచ్చినట్లు సూచిస్తారు. [23]

చాలావరకు ఒకదాన్నుంచి ఒకటి దూరంగా ఉన్నప్పటికీ, పులులు ఎల్లప్పుడూ తమ ప్రాంతానికే పరిమితమై ఉండవు. వాటి మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉంటాయి. ఆడ గానీ మగ గానీ వయోజన పులులు కొన్నిసార్లు తాము వేటాడిన ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటాయి -తమకు సంబంధించని వాటితో కూడా. ఒక మగ పులి తన వేటను రెండు ఆడ పులులు, నాలుగు పిల్లలతో కలిసి తినడాన్ని జార్జ్ షాలర్ గమనించాడు. మగ సింహాల మాదిరిగా కాకుండా, మగ పులులు తాము తినడానికి ముందే ఆడపులులనూ, పిల్లలనూ తిననిస్తాయి; తింటున్నవన్నీ ఒకదానితో ఒకటి సామరస్యంగా ఉంటాయి. సింహం గుంపు అలా ఉండదు. [31] రణతంభోర్ నేషనల్ పార్కులో జరిగిన ఒక సామూహిక భోజన కార్యక్రమాన్ని స్టీఫెన్ మిల్స్ వివరించాడు:

పద్మిని అనే ఆ ఆడపులి ఓ 250 కిలోల పెద్ద నీల్గాయ్‌ను చంపింది. తెల్లవారు ఝామున ఆ వేట వద్ద వాళ్ళు దాన్ని చూసారు. దాని వెంట దాని 14 నెలల పిల్లలు మూడు ఉన్నాయి. పది గంటల పాటు నిరంతరాయంగా వాళ్లు ఆ పులులను గమనిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో మరో రెండు ఆడపులులు, ఓ మగపులీ ఈ భోజన కార్యక్రమంలో చేరాయి. ఇవన్నీ కూడా పద్మిని పిల్లలే. వీటికి ఏ సంబంధమూ లేని మరో రెండు పులులు కూడా వీటితో చేరాయి.వాటిలో ఒకటి ఆడపులి, రెండోది ఏంటో తెలీలేదు. మధ్యాహ్నం మూడింటికి, ఆ వేట చుట్టూ 9 కి తక్కువ కాకుండా పులులున్నాయి.[32]

అప్పుడప్పుడు, మగ పులులు పిల్లల పెంపకంలో పాల్గొంటాయి. సాధారణంగా అవి తమ సొంత పిల్లలనే పెంచుతాయి. కానీ ఇది చాలా చాలా అరుదు. దీని గురించి మానవులకు సరిగా అర్థం కాలేదు కూడా. 2015 మే లో, అమూర్ పులులను సిఖోట్-అలిన్ బయోస్ఫియర్ రిజర్వ్‌లో కెమెరా వలలతో ఫోటో తీశారు. ఆ ఫోటోల్లో ఒక మగ అముర్ పులి వెళ్ళిన రెండు నిమిషాల తరువాత ఒక ఆడ పులి, మూడు పిల్లలు వెళ్ళడం కనిపించింది. [33] రణతంబోర్లో, తల్లి అనారోగ్యంతో మరణించడంతో రెండు ఆడ పులిపిల్లలు అనాథలయ్యాయి. వాటి తండ్రి (బెంగాల్ పులి) ఆ పిల్లలను పెంచి రక్షించింది. పిల్లలు దాని సంరక్షణలో ఉండేవి. వాటికి ఆహారాన్ని ఇచ్చింది. తన ప్రత్యర్థుల నుండి, తన సోదరి నుండి వాటిని రక్షించింది. వాటికి శిక్షణ కూడా ఇచ్చింది. [34]

మగ పులులు తమ భూభాగంలోనికి మగ పులులు వస్తే సహించవు. ఆడపులులు మాత్రం ఇతర ఆడ పులులతో ఎక్కువ సహనంగా ఉంటాయి. భూభాగ వివాదాలు నేరుగా దాడి చెయ్యడం కాకుండా బెదిరింపుల ద్వారా పరిష్కరించుకుంటాయి. లొంగిపోయిన పులి దాని వీపుపై దొర్లి, కడుపును చూపించి ఓటమిని ఒప్పుకుంటుంది. [35] ఒకసారి ఆధిపత్యం ఏర్పడిన తర్వాత, మగ పులి, లొంగిపోయిన పులిని తన రాజ్యంలో ఉండనిస్తుంది. కానీ తన నివాసానికి దగ్గరలో ఉండనివ్వదు. ఎదకొచ్చిన ఆడ పులి కోసం మగ పులుల మధ్య తీవ్రమైన పోరాటాలు జరుగుతాయి. కొన్నిసార్లు మగపులుల్లో ఒకటి చనిపోతుంది.

వేట, ఆహారం

Thumb
చీల్చే దంతాలు, కోరలు, నమలు దంతాలను చూపిస్తున్న వయోజన పులి
Thumb
తడోబా నేషనల్ పార్క్ వద్ద ఒక పందిని చంపుతున్న బెంగాల్ పులి

అడవిలో పులులు, పెద్ద, మధ్యస్థ-పరిమాణంలో ఉండే క్షీరదాలను ఎక్కువగా తింటాయి. ముఖ్యంగా 60-250 కిలోల బరువుండే గిట్టల జంతువులను తింటాయి. రేంజ్-వైడ్, సాంబార్ జింక, మంచూరియన్ వాపిటి, బరసింగ్, అడవి పంది అంటే వీటికి బాగా ఇష్టం. పులులు గౌర్ వంటి పెద్ద జంతువులను వేటాడే సామర్థ్యం కలిగినవి. [36] కానీ కోతులు, పీఫౌల్, ఇతర భూ-ఆధారిత పక్షులు, కుందేళ్ళు, పందికొక్కులు, చేపలు వంటి చాలా చిన్న వేటలను కూడా అవకాశాన్ని బట్టి తింటాయి. [37] [23] కుక్కలు, చిరుతపులులు, కొండచిలువలు, ఎలుగుబంట్లు, మొసళ్ళ వంటి ఇతర వేట జంతువులను కూడా వేటాడతాయి. పులులు సాధారణంగా పూర్తిగా ఎదిగిన ఆసియా ఏనుగులు, భారతీయ ఖడ్గమృగాలను వేటాడవు. కాని అలా వేటాడిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. [38] [39] [40] చాలా తరచుగా, తేలిగ్గా దొరికిపోయే చిన్న దూడలను తింటాయి. [41] మానవుల నివాసాలకు దగ్గరలో ఉన్నప్పుడు పశువులు, గుర్రాలు, గాడిదల వంటి పెంపుడు జంతువులను కూడా వేటాడతాయి. [42] పులులు మాంసాహారులే అయినప్పటికీ, పీచు పదార్థం కోసం అప్పుడప్పుడు పండ్లు వంటి శాకాహారాన్ని తింటాయి.

Thumb
పైన: పులి దంతాల అమరిక క్రింద: ఆసియా నల్ల ఎలుగుబంటి దంతాలు. పెద్ద కుక్కలను చంపడానికి మాంసాన్ని చీల్చడానికి కార్నాసియల్స్ ఉపయోగిస్తాయి.

పులులు ప్రధానంగా రాత్రించరులు. రాత్రుళ్ళు వేటాడతాయి. [43] కానీ మానవులు లేని ప్రాంతాలలో, అవి పగటిపూట వేటాడ్డాన్ని రిమోట్-కంట్రోల్డ్, హిడెన్ కెమెరాలు రికార్డు చేశాయి. [44] అవి సాధారణంగా ఒంటరిగా వేటాడతాయి. ఇతర పిల్లుల మాదిరిగానే తమ వేటపై ఒక్కుదుటున, ఆకస్మికంగా దాడి చేసి, ఏ కోణం నుండైనా వాటిని ఆక్రమించి, లోబరచుకుంటాయి. తమ శరీర పరిమాణాన్ని, బలాన్నీ ఉపయోగించి ఎరను పడవేస్తాయి. సాధారణంగా ఒక్కుదుటున తన వేటపైకి దూకి, దానిని పడేసి, గొంతును గానీ, మెడను గానీ దంతాలతో పట్టేసుకుంటుంది. [25] దేహం అంత పెద్ద గా ఉన్నప్పటికీ, పులులు 49 నుండి 65 కి.మీ./గం వేగంతో పరుగెడతాయి. కానీ చాలా కొద్ది సేపు, చాలా కొద్ది దూరం మాత్రమే అలా పరుగెడతాయి. అందుచేతనే, పులులు ఎరకు దగ్గరగా వచ్చేంత వరకు, మరుగుననే ఉండి ఒక్కసారిగా బయటపడి, దాడి చేస్తాయి. ఒకవేళ దీని కంటే ముందే పులి ఉనికి వేటకు తెలిసిపోతే, పులి ఇక దాన్ని వదిలివేస్తుంది. వెంటాడదు. ఎదురుబడి పోరాడదు. 2 నుండి 20 సార్లు మాటు వేస్తే ఒక్కటి విజయవంత మౌతూ ఉంటుంది. పులి దాదాపు 10 మీటర్లు దూకిన సంఘటనలు ఉన్నాయి. ఇందులో సగం దూరం దూకడం మాత్రం మామూలే.

Thumb
రణతంబోర్ టైగర్ రిజర్వ్‌లోని సాంబర్‌పై బెంగాల్ పులి దాడి చేసింది

పెద్ద జంతువులను వేటాడేటప్పుడు, పులులు వాటి గొంతును కరిచి పట్టుకుంటాయి. వేటను బలమైన ముందరి కాళ్ళతో పట్టుకుని కదలనీయకుండా బిగించేస్తాయి. అలా పట్టుకుని నేలపై పడేస్తాయి. ఊపిరాడక చనిపోయే వరకూ ఎర గొంతును కరచి పట్టుకునే ఉంటుంది. [31] ఈ పద్ధతిలో, టన్నుకు పైగా బరువున్న గౌర్‌లు, నీటి గేదెలను వాటి బరువులో ఆరో వంతున్న పులి చంపేసింది. [45] పులులు ఆరోగ్యకరంగా ఉన్న వయోజన మృగాలను చంపగలిగినప్పటికీ, దూడలను లేదా పెద్ద జాతుల్లోని బలహీన జంతువులనూ ఎంచుకుంటాయి. [46] ఈ రకమైన ఆరోగ్యకరమైన వయోజన జంతువును చంపడం ప్రమాదకరం. ఎందుకంటే వాటి పొడవైన, బలమైన కొమ్ములు, కాళ్ళు, దంతాలు పులికి ప్రాణాంతకం. మరే ఇతర భూ జంతువు కూడా ఇంత పెద్ద జంతువులను ఒంటరిగా వేటాడదు. [8] [47]

కోతులు, కుందేళ్ళ వంటి చిన్న జంతువులను చంపేటపుడు, వాటి మెడను కొరికి, వెన్నుపామును విరిచేస్తుంది. విండ్ పైపును కత్తిరిస్తుంది.లేదా కరోటిడ్ ధమనిని చీల్చేస్తుంది.[48] చాలా అరుదుగా ఐనప్పటికీ, కొన్ని పులులు తమ పంజాతో కూడా ఎరను చంపడం జరిగింది. పశువుల పుర్రెలను పగుల గొట్టేంతటి శక్తి పంజాకుంది. [42] పంజాతో స్లోత్ ఎలుగుబంట్ల వీపును చీల్చెయ్యగలవు కూడా. [49]

వేటను చంపిన తరువాత, పులులు దానిని నోటితో పట్టుకుని ఏపుగా పెరిగిన గడ్డి వంటి చోటకు ఈడ్చుకు పోయి దాస్తాయి. దీనికి కూడా గొప్ప శారీరక బలం అవసరం. ఒక సందర్భంలో, ఒక పులి ఒక పెద్ద గౌర్‌ను చంపిన తరువాత, ఆ భారీ దేహాన్ని 12 మీ. దూరం ఈడ్చుకు పోయింది. ఆ తరువాత అదే దేహాన్ని 13 మంది పురుషులు కలిసి కూడా కదపలేకపోయారు.. [25] ఒక వయోజన పులి ఏమీ తినకుండా రెండు వారాల వరకు వెళ్లదీయగలదు. తడవకు 34కిలోల ఆహారం తింటుంది. బోనుల్లోని వయోజన పులులకు రోజుకు 3 నుండి 6 కిలోల మాసాన్ని పెడతారు.

శత్రువులు, పోటీదారులు

Thumb
పులిని వేటాడుతున్న రేచు కుక్కలు. శామ్యూల్ హోవెట్ & ఎడ్వర్డ్ ఓర్మ్, హ్యాండ్ కలర్డ్, అక్వాటింట్ ఇంగ్రావింగ్స్, 1807.

పులులు సాధారణంగా స్వయంగా తామే పట్టుకున్న ఆహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతాయి. కాని కొరత ఉన్న సమయాల్లో కుళ్ళిన మాసం తినడానికి వెనుదీయవు. ఇతర పెద్ద వేటాడే జంతువులు వేటాడిన మాంసాన్ని ఎత్తుకుపోతాయి కూడా. వేటాడే జంతువులు సాధారణంగా ఒకరికొకరు ఎదురుపడకుండా తప్పించుకున్నప్పటికీ, వేట వస్తువు విషయంలో వివాదం ఉన్నా, తీవ్రమైన పోటీ ఎదురైనా పులులు దూకుడు ప్రదర్శించడం సాధారణం. దూకుడు సరిపోకపోతే, పోరాటానికి దిగవచ్చు; చిరుతపులులు, రేచుకుక్కలు, చారల హైనాలు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, కొండచిలువలు, మొసళ్ళు వంటి పోటిదార్లను చంపేస్తాయి. కొన్నిసార్లు పులులు నేరుగా వీటినే వేటాడి తింటాయి కూడా. [18] [49] [50] బ్యాడ్జర్స్, లింక్స్, నక్కల వంటి చిన్న వేటాడే జంతువులపై చేసే దాడులు వాటిని తినడానికే. [37] మొసళ్ళు, ఎలుగుబంట్లు, రేచుకుక్కల గుంపులూ పులులపై పోరాటంలో గెలవవచ్చు. మొసళ్ళు, ఎలుగుబంట్లైతే పులులను చంపగలవు కూడా. [8] [51] [52]

పులి కంటే బాగా చిన్నదిగా ఉండే చిరుతపులి, పులి నుండి తప్పించుకుని జీవిస్తుంది. ఇది, పులి వేటాడే వేళల్లో కాకుండా వేరే సమయాల్లో వేటాడుతుంది. వేరే ఆహారాన్ని వేటాడుతుంది. దక్షిణ భారతదేశంలోని నాగరహోల్ జాతీయ ఉద్యానవనంలో, చిరుతపులులు ఎంచుకునే ఆహారం 30 నుండి 175 కిలోలు ఉంటుంది. పులులు 175 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులను వేటాడుతాయి. ఈ రెండింటి ఆహారాల సగటు బరువు 37.6 కిలోలు, 91.5 కిలోలు. [53] [54] వేటాడేందుకు జంతువులు సమృద్ధిగా ఉన్నచోట పులులు, చిరుతపులులు పోటీ అనేది లేకుండా సహజీవనం చేస్తాయి. పులి చంపిన జంతువులను గోల్డెన్ నక్కలు తింటాయి.

పులులు అడవిలో లోపల భాగాలలో నివసిస్తాయి. చిరుతపులులు, రేచుకుక్కల వంటి చిన్న మాంసాహారులు అడవికి అంచుల్లో జీవిస్తాయి. [55]

Remove ads

పరిరక్షణ

మరింత సమాచారం దేశం, సంవత్సరం ...

1990 లలో, పులుల సంరక్షణకు టైగర్ కన్జర్వేషన్ యూనిట్స్ (టిసియు) అనే ఒక కొత్త విధానాన్ని అభివృద్ధి చేసారు. మొత్తం 143 టిసియులను గుర్తించారు. వాటి విస్తీర్ణం 33 నుండి 1,55,829 చ.కి.మీ. వరకూ ఉంది. [59]

2016 లో, పులుల సంరక్షణపై మూడవ ఆసియా మంత్రుల స్థాయి సమావేశంలో సుమారు 3,890 మంది ప్రపంచ అడవి పులి జనాభా ఉన్నట్లు అంచనా వేసారు. తదనంతరం ప్రపంచ అడవి పులుల సంఖ్య ఒక శతాబ్దంలో మొదటిసారిగా పెరిగిందని WWF ప్రకటించింది. [60]

పులి ఉనికికి ప్రమాదకరంగా తయారైన అంశాలు - అడవుల నాశనం, నివాస ప్రాంతాలు ముక్కలై, చిన్నవై పోవడం, చర్మం, శరీర భాగాల కోసం అక్రమ వేట మొదలైనవి. [1] భారతదేశంలో, ఆవాసాల విచ్ఛిన్నం కారణంగా చారిత్రక పులి ఆవాస ప్రాంతాలలో 11% మాత్రమే మిగిలి ఉన్నాయి. [61] సాంప్రదాయిక చైనీస్ ఔషధాల్లో కలిపేందుకు పులి అవయవాలను వాడడం కూడా పులి జనాభాకు పెద్ద ముప్పు తెచ్చింది. [62] 20 వ శతాబ్దం ప్రారంభంలో, అడవుల్లో 100,000 వరకూ పులులు ఉన్నాయని అంచనా వేసారు. కాని ఈ జనాభా 1,500 - 3,500 కు పడిపోయింది. సంతానోత్పత్తి దశలో ఉన్న పులులు 2,500 కన్నా తక్కువ ఉన్నాయని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ పులి జనాభాను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ 2011 లో 3,200 అనీ, 2015 లో 3,890 అనీ అంచనా వేసింది - ఒక శతాబ్ద కాలంలో జనాభా పెరగడం ఇదే మొదలని వోక్స్ నివేదించింది. [63]

ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభా భారతదేశంలో ఉంది. 2014 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 2,226 పులులున్నాయి. 2011 తో పోలిస్తే ఇది 30% పెరుగుదల. [64] 2019 లో అంతర్జాతీయ పులుల దినోత్సవం స్ందర్భంగా 'టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018' ను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశాడు. భారతదేశంలో 2,967 పులుల జనాభా 2014 నుండి 25% పెరుగుదలతో ఈ నివేదిక అంచనా వేసింది. 2011 లో 1411 నుండి 2019 నాటికి 2967 కు పులుల జనాభాను పెంచి, రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించినందున భారతదేశం పులులకు సురక్షితమైన ఆవాసాలలో ఒకటి అని మోడీ అన్నాడు. [65]

1973 లో, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ అనేక పులుల సంరక్షణా స్థలాలను స్థాపించింది. 1973 లో 1,200 ఉన్న అడవి బెంగాల్ పులుల సంఖ్య 1990 నాటికి 3,500 దాటింది. సంఖ్యను మూడు రెట్లు పెంచిన ఘనత ఈ ప్రాజెక్టుకు దక్కింది, కాని 2007 జనాభా లెక్కల ప్రకారం, ఇది తిరిగి 1400 కు తగ్గింది. పులులు వేటగాళ్ళకు బలవడమే దీనికి కారణం. [66] [67] ఆ నివేదిక తరువాత, భారత ప్రభుత్వం పులుల సంరక్షణకు 15.3 కోట్ల డాలర్లు కేటాయించింది. వేటగాళ్లను ఎదుర్కోవటానికి చర్యలు తీసుకుంది. మానవ-పులి పరస్పర చర్యలను తగ్గించడానికి 2,00,000 మంది గ్రామస్థులను తరలించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంది. [68] ఎనిమిది కొత్త పులి పరిరక్షక కేంద్రాలను ఏర్పాటు చేసింది. సరిస్కా పులుల సంరక్షణా కేంద్రంలో పులులను తిరిగి ప్రవేశ పెట్టింది. [69] 2009 నాటికి రణతంబోర్ నేషనల్ పార్క్ వద్ద వేటగాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. [70]

Remove ads

మానవులతో సంబంధం

Thumb
ఏనుగు నెక్కి, పులివేట. భారతదేశం, 1808
Thumb
1941 లో వేటాడిన జావా పులితో వేట పార్టీ

పులి వేట

ఆసియాలో మానవులు వేటాడే ఐదు పెద్ద జంతువులలో పులి ఒకటి. 19 వ, 20 వ శతాబ్దాల ప్రారంభంలో పులి వేట పెద్ద ఎత్తున జరిగేది. ఇది వలసరాజ్యాల భారతదేశంలో బ్రిటిష్ వారు గుర్తించిన, ఆరాధించిన క్రీడ. అలాగే స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశపు పూర్వపు సంస్థానాల మహారాజులు, కులీన వర్గాలు కూడా ఆదరించిన క్రీడ ఇది. ఒక మహారాజానో, ఓ ఇంగ్లీష్ వేటగాడో వారి వేట వృత్తిలో వందకు పైగా పులులను చంపినట్లు చెప్పుకోవచ్చు. [25] పులి వేటను కొంతమంది వేటగాళ్ళు కాలినడకన చేశారు; ఇతరులు మేకను లేదా గేదెను ఎరగా కట్టిన మంచెలపై కూర్చునే వారు; ఏనుగు నెక్కి వేటాడేవారు మరికొందరు. [71]

పులుల అందమైన, ప్రసిద్ధ గాంచిన చారల చర్మాల కోసం, పులులను పెద్ద ఎత్తున వేటాడారు. 1960 లలో, అంతర్జాతీయ పరిరక్షణ ప్రయత్నాలు అమల్లోకి రాకముందు పులి చర్మాల వ్యాపారం తారస్థాయిలో ఉండేది. 1977 నాటికి, ఇంగ్లీషు మార్కెట్లో పులి చర్మం US $ 4,250 పలికేది. [25]

అవయవాలు

పులి భాగాలను సాధారణంగా దక్షిణ, ఆగ్నేయాసియాలో తాయెత్తులుగా ఉపయోగిస్తారు. ఫిలిప్పీన్స్లో, పలావాన్ లో శిలాజాలు రాతి పనిముట్లతో పాటు కనబడ్డాయి. ఇది, ఎముకలపై కోతలు, అగ్ని వాడకానికి ఆధారాలు కబడాడంతో, తొలి మానవులు ఈ ఎముకలను కూడబెట్టినట్లు సూచిస్తున్నాయి, [72] సుమారు 12,000 నుండి 9,000 సంవత్సరాల క్రితం నాటి పులి ఉప-శిలాజాల పరిస్థితి ఇతర శిలాజాల నుండి భిన్నంగా ఉంది. పులి గోర్లను ఆభారణాలుగా ధరించడం భారతీయుల్లో సాధారణం.

చైనా లోను, ఆసియాలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రజలు పులి అవయవాల్లో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. వీటిలో నొప్పులు తగ్గించేవి, కామోద్దీపనకారిణి ఉన్నాయని నమ్ముతారు. [73] ఈ నమ్మకాలను సమర్ధించే శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. చైనాలో ఔషధాల తయారీలో పులి అవయవాల వాడకాన్ని ఇప్పటికే నిషేధించారు. పులిని వేటాడిన వాళ్లకు మరణశిక్ష విధిస్తారు.ఇంకా, పులి భాగాల వాణిజ్యం అంతరించిపోతున్న జాతుల అడవి జంతు, వృక్ష జాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై ఏర్పాటు చేసిన కమిషను, పులి అవయవాల వ్యాపారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. 1993 నుండి చైనాలో దేశీయ వాణిజ్య నిషేధం అమలులో ఉంది.

అయితే, ఆసియాలో పులి భాగాల వ్యాపారం పెద్ద బ్లాక్ మార్కెట్ పరిశ్రమగా మారింది. దానిని ఆపడానికి ప్రభుత్వాల ప్రయత్నాలు, పరిరక్షణ ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలితాన్నివ్వలేదు. [25] వాణిజ్యంలో నిమగ్నమైన నల్ల విక్రయదారులు దాదాపుగా అందరూ చైనా కేంద్రంగా పని చేస్తున్నారు. తమ స్వంత దేశంలో లేదా తైవాన్, దక్షిణ కొరియా లేదా జపాన్లలోకి రవాణా చేస్తారు . చైనా పులులు దాదాపుగా అన్నీ 1950 ల నుండి 1970 ల వరకు జరిగిన ఈ వాణిజ్యం కోసం బలైపోయాయి. అక్రమ వాణిజ్యానికి, పులులను బోనుల్లో పెంచే పులి ఫారాములు కూడా చైనాలో ఉన్నాయి. ఇలాంటి ఫారములలో ప్రస్తుతం 5,000 నుండి 10,000 వరకూ ఇలాంటి పెంపుడు పులులు ఉన్నట్లు ఉంచనా. [74] ఆసియా బ్లాక్ మార్కెట్లో, పులి పురుషాంగం సుమారు US 300 డాలర్లు పలుకుతుంది. 1990 - 1992 సంవత్సరాలలో, పులి అవయవాలతో తయారైన 27 మిలియన్ ఉత్పత్తులను కనుగొన్నారు. 2014 జూలైలో, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అంతరించిపోతున్న జాతులపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో, చైనాలో పులి చర్మాల వ్యాపారం జరుగుతోందని తమ ప్రభుత్వానికి తెలుసునని చైనా ప్రతినిధి తొలిసారిగా అంగీకరించారు. [75]

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads