![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ea/View_in_the_way_to_Paderu.jpg/640px-View_in_the_way_to_Paderu.jpg&w=640&q=50)
తూర్పు కనుమలు
From Wikipedia, the free encyclopedia
తూర్పు కనుమలు భారత ద్వీపకల్పపు తూర్పు సముద్ర తీరం వెంట విచ్ఛిన్నంగా విస్తరించిన కొండల వరుస. ఉత్తర ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణాన తమిళనాడు వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల గుండా కూడా పోతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని నాలుగు ప్రధాన నదులు - గోదావరి, మహానది, కృష్ణ, కావేరి - తూర్పు కనుమలను ఒరుసుకుంటూ, ఖండిస్తూ ప్రవహించి, బంగాళాఖాతంలో కలుస్తాయి. తెలంగాణాలో 965 మీ ఎత్తు కలిగిన దోలి గుట్ట ఈ శ్రేణిలో ఎత్తైన శిఖరం. తమిళనాడులో ఒడైక్కన్ బెట్ట ఎత్తైన శిఖరం. ఒడిషాలో 1672 మీ ఎత్తు కలిగిన దేవమాలి ఎత్తైన శిఖరం. ఆంధ్రప్రదేశ్ లో 1680 మీ ఎత్తున్న ఆర్మకొండ అత్యంత ఎత్తైన ప్రాంతం. కర్ణాటక లో తూర్పు కనుమల్లో భాగమైన బిఆర్ పర్వతశ్రేణులు అక్కడక్కడా 1800 మీ పైగా ఎత్తు కలిగి ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా ఎత్తైన కట్టాహి బెట్ట 1822 మీ ఎత్తున ఉంది. ఈ పర్వతశ్రేణిలో తమిళనాడు లోని తలమలై పర్వశ్రేణులు ఎత్తైనవి. ఆంధ్రప్రదేశ్ లోని అరకు కొండలు ఎత్తులో మూడవ స్థానంలో ఉన్నాయి.
తూర్పు కనుమలు | |
---|---|
![]() విశాఖ జిల్లాలోని పాడేరు వద్ద తూర్పు కనుమలు | |
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | అర్మ కొండ[1], అరకు |
ఎత్తు | 1,690 m (5,540 ft) |
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ | 1,290 m (4,230 ft) |
భౌగోళికం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు and పశ్చిమ బెంగాల్ |
ప్రాంతాలు | తూర్పు భారత దేశం and దక్షిణ భారత దేశం |
Settlements | భువనేశ్వర్, చెన్నై, దిండిగల్, కర్నూలు, నమక్కల్, రాజమండ్రి, సేలం, శ్రీశైలం, తిరువణ్ణామలై, తిరుపతి, వెల్లూరు, విజయవాడ and విశాఖపట్నం |
Biome | అడవులు |
Geology | |
Type of rock | Igneous, ఇనుము and సున్నపురాయి |
ఈ పర్వత శ్రేణులు బంగాళాఖాతపు తీరరేఖకు సమాంతరంగా నడుస్తాయి. తూర్పు కనుమలకు పశ్చిమాన, పశ్చిమ కనుమల వరకూ విస్తరించి ఉన్న ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటారు. కోరమాండల్ తీర ప్రాంతంతో సహా తీర మైదానాలు తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికీ మధ్య విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు పడమటి కనుమలంత ఎత్తు లేవు.