రాజ్ - కోటి
From Wikipedia, the free encyclopedia
రాజ్ - కోటి తెలుగు సినిమాలో ఒక జంట సంగీత దర్శకులు.
- రాజ్: సంగీత దర్శకులు టి.వి.రాజు కుమారుడు. ఇతని పూర్తి పేరు తోటకూర వెంకట సోమరాజు
- కోటి: సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు. ఇతని పూర్తి పేరు సాలూరి కోటేశ్వరరావు.
వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ప్రళయ గర్జన వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లో "సిసింద్రీ" ఒక్కటే చెప్పుకోదగినది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని టీవి షో (ఈటీవీ) లకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు. చిరంజీవితో హిట్లర్, బాలకృష్ణతో పెద్దన్నయ్య, వెంకటేశ్ తో నువ్వు నాకు నచ్చావ్ మొదలైనవి. 1975లో గిటారిస్టుగా సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 8 ఏళ్లు పనిచేశారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్డీబర్మన్, బప్పీలహరి, జంధ్యాల వద్ద పనిచేసి అనుభవాన్ని ప్రోది చేసుకున్నారు. అన్ని భాషల్లో కలిపి 455 చిత్రాలకు పనిచేశారు. 24 చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సుభాష్‌ఘాయ్, డేవిడ్ ధావన్ వంటి దర్శక, నిర్మాతలతో కలసి పనిచేశారు. ముఖుల్ ఆనంద్ డైరెక్టరుగా త్రిమూర్తి అనే సినిమాకు సంగీత బ్రహ్మ రెహ్మాన్‌తో కలసి సంగీత స్వరాలు పలికించారు .
68 ఏళ్ల రాజ్ (తోటకూర సోమరాజు) గుండెపోటుతో హైదరాబాద్ లోని తన నివాసంలో 2023 మే 21న తుదిశ్వాస విడిచాడు.[1]